ఇలా ఉంటే లంచ్‌ బాక్స్‌ లాగించేస్తారు!

స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి.... పిల్లలకు రుచికరమైన, పోషకభరిత పదార్థాలు తయారు చేయడానికి అమ్మలు వంటింట్లో కుస్తీ పడుతున్నారు. అటు పిల్లల స్కూలు... ఇటు ఆఫీసు... గడియారం నేనెవరి కోసమూ ఆగనంటూ తనపని తాను చేసుకుపోతుంది. తక్కువ సమయంలో, పోషకాలు ఉండేలా ఆహార పదార్థాలను తయారు చేయాలనుకునే అమ్మలూ వీటిని ఓసారి చూసేయండి.

Published : 03 Oct 2021 02:42 IST

స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి.... పిల్లలకు రుచికరమైన, పోషకభరిత పదార్థాలు తయారు చేయడానికి అమ్మలు వంటింట్లో కుస్తీ పడుతున్నారు. అటు పిల్లల స్కూలు... ఇటు ఆఫీసు... గడియారం నేనెవరి కోసమూ ఆగనంటూ తనపని తాను చేసుకుపోతుంది. తక్కువ సమయంలో, పోషకాలు ఉండేలా ఆహార పదార్థాలను తయారు చేయాలనుకునే అమ్మలూ వీటిని ఓసారి చూసేయండి.


హైదరాబాదీ కిచిడీ

కావాల్సినవి: బియ్యం, ఎర్రపప్పు- కప్పు చొప్పున, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు- పావు కప్పు, మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, మిరియాలు, ఎండుమిర్చి, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు)- కొన్ని, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, కొత్తిమీర, పుదీనా తరుగు- చెంచా చొప్పున, కరివేపాకు- రెండు రెమ్మలు, నెయ్యి- పావు కప్పు.

తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక బిర్యానీ ఆకు, మిరియాలు, ఎండుమిర్చి, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు... ఇలా అన్నింటినీ నూనెలో వేయించాలి. అవి కాస్త చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. కాస్తంత ఉప్పు జత చేసి నిమిషం వేయించాలి. ఆ తర్వాత పప్పు, బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయే వరకు చిన్నమంటపై ఉడికించాలి. చివరగా కాస్తంత నెయ్యి జత చేస్తే సరి... రుచికరమైన కిచిడీ రెడీ...


స్వీట్‌ అండ్‌ స్పైసీ చపాతీ

కావాల్సినవి: ఉడికించిన చిలగడ దుంపలు, గోధుమ పిండి- కప్పు చొప్పున, కారం, జీలకర్ర- చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, నెయ్యి- పావుకప్పు.  

తయారీ: పెద్ద గిన్నెలో మెత్తగా చిదిమిన చిలగడ దుంప, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, కొద్దిగా నెయ్యి, పిండి వేసి కొన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. దీన్ని కాస్త మందంగా చపాతీల్లా చేసుకుని పెనంపై నెయ్యి వేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి.


తవా పులావ్‌

కావల్సినవి: బాస్మతి బియ్యం- కప్పు, వెన్న- 50 గ్రా.,  ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు చెంచాలు, క్యాప్సికమ్‌- ఒకటి, టొమాటోలు- మూడు, పండుమిర్చి పేస్ట్‌- రెండు చెంచాలు, కశ్మీరీ కారం, గరంమసాలా- ఒకటిన్నర చెంచాల చొప్పున, పసుపు- పావు చెంచా, పావ్‌బాజీ మసాలా- మూడు చెంచాలు, ఉడికించిన ఆలూ- రెండు, ఉడికించిన బఠాణీలు- అర కప్పు, ఉప్పు- తగినంత, నూనె- రెండు చెంచాలు.

తయారీ: పావుగంట బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టి మరిగిన తర్వాత బియ్యం, ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులో పసుపు వేసుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత నీటిని వార్చి అన్నాన్ని చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే మిగిలిపోయిన నీళ్లు కూడా పోతాయి. పొయ్యి మీద వెడల్పాటి కడాయి పెట్టి బటర్‌ వేసుకోవాలి. అది కరిగాక కాస్తంత నూనె కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి అల్లంవెల్లుల్లి ముద్దను చేర్చి రెండు నిమిషాలు వేయించాలి. క్యాప్సికమ్‌, టొమాటో ముక్కలు, పండుమిర్చీ పేస్ట్‌ (ఇది లేకపోతే కారం కూడా వాడుకోవచ్చు.) ను వేయాలి. దీనికి కశ్మీరీ కారాన్ని, తగినంత ఉప్పునూ జత చేయాలి. గరంమసాలా, పావ్‌బాజీ మసాలా వేసి బాగా కలపాలి. ఇందులోనే ఉడికించిన ఆలూ, బఠాణీలను వేసుకుని మరికాసేపు మగ్గించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే తవా పులావ్‌ రెడీ. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది.


చిల్లీ చీజ్‌ టోస్ట్‌

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైస్‌లు- నాలుగు, బటర్‌- తగినంత, చీజ్‌- 50 గ్రా.,  వెల్లుల్లి తరుగు- అరచెంచా, ఎండుమిర్చిపొడి- రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు- పావు కప్పు,  నూనె, ఉప్పు- తగినంత.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి వేడయ్యాక బ్రెడ్‌ స్లైస్‌లను కాస్త నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. గిన్నెలో బటర్‌ తీసుకుని పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌ ముక్కలపై రాయాలి. దీనిపై ఎండు మిరపకాయల పొడి, తగినంత ఉప్పు చల్లాలి. చీజ్‌ స్లైస్‌ను వేసి దానిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్‌ పొడి జత చేయాలి. పాన్‌లో నూనె వేసి అది వేడయ్యాక ఈ స్లైసులను ఓ వైపు మాత్రమే కాల్చుకుంటే రుచికరమైన చిల్లీ చీజ్‌ టోస్ట్‌ రెడీ.


ఎగ్‌ నూడుల్స్‌

కావాల్సినవి: నూడుల్స్‌- 300 గ్రా., గుడ్లు- నాలుగు, వెల్లుల్లి, అల్లం తరుగు- పెద్ద చెంచా చొప్పున, సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్‌, క్యారెట్‌- ఒక్కోటి చొప్పున, క్యాబేజీ తురుము- కప్పు, వెనిగర్‌- చెంచా, సోయాసాస్‌, చిల్లీసాస్‌- రెండు పెద్ద చెంచాల చొప్పున, స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు- కొద్దిగా, నూనె, ఉప్పు, మిరియాల పొడి- తగినంత.

తయారీ: పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో కాస్తంత ఉప్పు, నూడుల్స్‌ వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. వీటిలోని నీళ్లను ఒంపేసి రెండు చెంచాల నూనె వేస్తే నూడుల్స్‌ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. ఇది వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఇందులోనే నిలువుగా, సన్నగా కోసిన క్యాప్సికమ్‌ ముక్కలను వేయాలి. వీటితోపాటు సన్నగా తరిగిన క్యారెట్‌, క్యాబేజీ వేసి అయిదు నిమిషాలు ఫ్రై చేయాలి. ఇందులో వెనిగర్‌, సోయాసాస్‌, చిల్లీసాస్‌ వేసి కాసేపు వేయించాలి. దీంట్లో స్ప్రింగ్‌ ఆనియన్స్‌ను కూడా జత చేయాలి. పాన్‌ మధ్యలో ఖాళీగా చేసి రెండు చెంచాల నూనె వేయాలి. దీనిపై గుడ్లను పగలగొట్టి వేయాలి. వీటిపై కాస్తంత మిరియాల పొడి చల్లి మంట పెద్దగా పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో నూడుల్స్‌ను వేసుకోవాలి. వీటికి ఎగ్‌, ఇతర కూరగాయ ముక్కలు బాగా పట్టేలా కలపాలి. చివరగా స్ప్రింగ్‌ ఆనియన్‌తో గార్నిష్‌ చేస్తే వేడి వేడి ఎగ్‌ నూడుల్స్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు