ఈ అన్నం... పోషక స్వరూపం!

ఎప్పుడూ అన్నం, పప్పు, కూరేనా...  అయితే ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నించి చూడండి. ఇమ్యూనిటీని పెంచే జింజర్‌ రైస్‌... శక్తిని, వెచ్చదనాన్ని అందించే నువ్వులన్నం... కంది, పెసరపప్పులతో ప్రొటీన్లను పంచే రసమన్నం...

Updated : 28 Nov 2021 06:44 IST

ఎప్పుడూ అన్నం, పప్పు, కూరేనా...  అయితే ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నించి చూడండి. ఇమ్యూనిటీని పెంచే జింజర్‌ రైస్‌... శక్తిని, వెచ్చదనాన్ని అందించే నువ్వులన్నం... కంది, పెసరపప్పులతో ప్రొటీన్లను పంచే రసమన్నం... పోషకాల పోతపోసే మునగాకు అన్నం.. కాస్త భిన్నంగా.. మరికాస్త రుచిగా... వండి వడ్డించేయండి మరి.


జింజర్‌, పెప్పర్‌ ఫ్రైడ్‌ రైస్‌...

కావాల్సినవి:  అన్నం- మూడు కప్పులు, సన్నగా, పొడవుగా తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు- కప్పు(ఎరుపు, పసుపు, ఆకుపచ్చ), ఉల్లికాడలు- మూడు (సన్నగా తరగాలి), ఉల్లిపాయలు- మూడు (సన్నగా తరగాలి), సన్నగా, పొడవుగా తరిగిన అల్లం ముక్కలు- రెండు చెంచాలు, తెల్లమిరియాల పొడి- అర చెంచా, ఉప్పు- తగినంత, సోయాసాస్‌- రెండు చెంచాలు, నూనె- పెద్ద చెంచా.

తయారీ:  పొయ్యిమీద పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక  అల్లం ముక్కలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇందులో తెల్ల ఉల్లిపాయ తరుగు వేసి పాన్‌ను అటూ ఇటూ కదపాలి. ఆ తర్వాత రంగురంగుల బెల్‌పెప్పర్‌ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.  ఇప్పుడు వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేయాలి. దీంతోపాటు సోయాసాస్‌, తగినంత ఉప్పు, తెల్ల మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు వేసి బాగా కలిపి కాసేపు మగ్గించాలి. అంతే రుచికరమైన జింజర్‌, పెప్పర్‌ ఫ్రైడ్‌ రైస్‌ రెడీ. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.


నువ్వులతో...

కావాల్సినవి: నువ్వులు- రెండు పెద్ద చెంచాలు, అన్నం- కప్పు, నువ్వుల పొడి- రెండు చెంచాలు, పోపు దినుసులు- చెంచా, కాజు- అయిదారు, పచ్చిమిర్చి- ఐదు (నిలువుగా కోసుకోవాలి), ఎండుమిర్చి- రెండు, మిరియాలు- పావు చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇందులో నువ్వులు వేసి కాస్త వేగనివ్వాలి. బరకగా చేసిన మిరియాల పొడి, తగినంత ఉప్పును కూడా కలపాలి. ఇందులో పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నం కలపాలి. ఇది కాస్త కలిపిన తర్వాత నువ్వుల పొడి వేసి కాసేపు రైస్‌ను మగ్గనివ్వాలి. చివరగా వేయించిన కాజు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.  


రసంతో...

కావాల్సినవి: బియ్యం- అరకప్పు, కందిపప్పు- పావు కప్పు, పెసరపప్పు- రెండు చెంచాలు, టొమాటోలు- రెండు, పసుపు- పావు చెంచా, రసం పొడి- చెంచాన్నర,  నూనె- పావు కప్పు, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు- రెండు, ఇంగువ- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగైదు, చింతపండు గుజ్జు- రెండు పెద్ద చెంచాలు, నీళ్లు- రెండున్నర కప్పులు, ఉప్పు- తగినంత.

తయారీ: బాస్మతి బియ్యం, కందిపప్పు, పెసరపప్పులను విడివిడిగా పావుగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి కుక్కర్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటమన్నాక ఇంగువ, కరివేపాకులు వేయాలి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ముక్కలు వేసి రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి. దీనికి పసుపు, రసం పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, కందిపప్పు, పెసరపప్పు వేసి బాగా కలపాలి. రెండున్నర కప్పుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు, చింతపండు గుజ్జును కూడా కలపాలి. ఇప్పుడీ మిశ్రమం ఉడకడం మొదలయ్యాక మంటను పెద్దగా చేసి మూత పెట్టి మూడు, నాలుగు కూతలు వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన రసం అన్నం రెడీ. దీన్ని పుదీనా, కొత్తిమీర చట్నీలతో తింటే సరి.


మునగాకుతో...

కావాల్సినవి: మునగాకు- కప్పు, పొడి పొడిగా వండి వార్చిన అన్నం- కప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పోపు గింజలు- చెంచా చొప్పున, ఎండుమిర్చి- పది, పన్నెండు, పచ్చిమిర్చి- నాలుగైదు, ధనియాలు, వేయించిన నువ్వులు- రెండు చెంచాల చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- నాలుగైదు, ఉల్లిపాయముక్కలు- పావు కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, నెయ్యి- పావు కప్పు, నూనె- రెండు పెద్ద చెంచాలు, చింతపండు, కొత్తిమీర- కొద్దిగా, , ఉప్పు- తగినంత, వేయించిన బఠాణీలు- రెండు చెంచాలు.

తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి వేయించాలి. ఇందులోనే మునగాకు వేసి మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసి కాస్తంత చింతపండు జత చేసి పొడి చేసుకోవాలి. మరోసారి పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక పోపు దినుసులు, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత మరొకటి వేసి వేయించాలి. ఇందులో రెండు మూడు చెంచాల మునగాకు పొడి, అన్నం, ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించిన నువ్వులను జత చేయాలి. బఠాణీలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని