న్యూడుల్స్‌...

అల్లరి పిల్లల కోసం అల్పాహారం... శ్రీవారి లంచ్‌బాక్స్‌లోకి మధ్యాహ్న భోజనం... సాయంత్రాలు అతిథులకు స్నాక్స్‌గానూ సిద్ధం... ఇంట్లో నూడుల్స్‌ ఉంటే అన్నివేళలా ఆకలి పరార్‌! మమకారం వేసి కొంచెం కారంకారంగా చేసుకోవచ్చు... నోరూరించేలా ఘాటుగానూ ప్రయత్నించొచ్చు... చిన్నాపెద్దా అంతా మెచ్చేలా.. వెరైటీ రుచులు వచ్చేలా.. తయారు చేద్దామిలా!

Updated : 12 Dec 2021 03:26 IST

అల్లరి పిల్లల కోసం అల్పాహారం... శ్రీవారి లంచ్‌బాక్స్‌లోకి మధ్యాహ్న భోజనం... సాయంత్రాలు అతిథులకు స్నాక్స్‌గానూ సిద్ధం... ఇంట్లో నూడుల్స్‌ ఉంటే అన్నివేళలా ఆకలి పరార్‌! మమకారం వేసి కొంచెం కారంకారంగా చేసుకోవచ్చు... నోరూరించేలా ఘాటుగానూ ప్రయత్నించొచ్చు... చిన్నాపెద్దా అంతా మెచ్చేలా.. వెరైటీ రుచులు వచ్చేలా.. తయారు చేద్దామిలా!


నూడుల్స్‌ మంచూరియా...

కావాల్సినవి: నూడుల్స్‌, ఉల్లిపాయ ముక్కలు- కప్పు చొప్పున, క్యాప్సికమ్‌ ముక్కలు- అర కప్పు, క్యాబేజీ, క్యారెట్‌ ముక్కలు- పావు కప్పు చొప్పున, తరిగిన ఉల్లికాడలు- కొన్ని, ఆనియన్స్‌ ముక్కలు, కార్న్‌ఫ్లోర్‌- రెండు పెద్ద చెంచాలు, చిన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు- పెద్ద చెంచా చొప్పున, పచ్చిమిర్చి- రెండు (చిన్నగా కోసుకోవాలి), టొమాటో, సోయా, చిల్లీ సాస్‌లు, మిరియాల పొడి- పెద్ద చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూడుల్స్‌తోపాటు సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్‌, స్ప్రింగ్‌ ఆనియన్స్‌, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కాస్తంత మొక్కజొన్న పిండిని కలిపి ఉండలుగా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. మరో పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేయాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌ ముక్కలు, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ వేసి, నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. దీంట్లో ఇందాక తయారుచేసి, వేయించిన నూడుల్స్‌ బాల్స్‌ను వేసి రెండు, మూడు నిమిషాలు మగ్గించాలి.


స్ప్రింగ్‌ రోల్‌...

కావాల్సినవి: నూడుల్స్‌- 200 గ్రా., నూనె- రెండు చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- రెండు, సన్నగా తరిగిన క్యారెట్‌- కప్పు, ఉల్లికాడల తరుగు- రెండు పెద్ద చెంచాలు, క్యాబేజీ తరుగు- కప్పు, చక్కెర- పావు చెంచా, ఉప్పు- తగినంత, స్ప్రింగ్‌ రోల్‌ షీట్స్‌- అయిదారు, మిరియాల పొడి- అర చెంచా, కార్న్‌ఫ్లోర్‌- చెంచా, సోయాసాస్‌- రెండు చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ:  నూడుల్స్‌ను ఉప్పు, నూనె వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి అది వేడయ్యాక బరకగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత  నిలువుగా కోసుకున్న క్యాబేజీ, క్యారెట్‌ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త మెత్తబడే వరకు కలుపుతూనే ఉండాలి. దీంట్లో సోయాసాస్‌, చక్కెర, ఉప్పు, మిరియాల పొడి వేసి పెద్ద మంటపై బాగా కలపాలి. నూడుల్స్‌ను కడాయిలో వేయాలి. మొక్కజొన్న పిండిలో కాసిన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పేస్ట్‌లా తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి. మంటను పెద్దగానే పెట్టి ఈ మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత చల్లార్చిన మిశ్రమాన్ని స్ప్రింగ్‌రోల్‌ షీట్‌కు ఓ చివర పెట్టాలి. దీన్ని ఎన్‌వలప్‌లా చేసి చివర్లను మైదాపిండి పేస్ట్‌తో మూసేయాలి. వీటిని వేడి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. లేదంటే 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పదినిమిషాలు అవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు. ఇలా తయారైన వేడి వెజ్‌ స్ప్రింగ్‌ రోల్స్‌ నూడుల్స్‌ను స్వీట్‌ చిల్లీ సాస్‌ లేదా టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.


చిల్లీ గార్లిక్‌  

కావాల్సినవి:  నూడుల్స్‌- 300 గ్రా., నువ్వుల నూనె- రెండు పెద్ద చెంచాలు, వెల్లుల్లి తరుగు- చెంచా, ఉల్లిపాయ పెద్దది- ఒకటి (సన్న ముక్కలుగా కోసుకోవాలి),  పచ్చిమిర్చి తరుగు- చెంచా, క్యారెట్‌- ఒకటి (సన్నగా తరగాలి), నిలువుగా, సన్నగా తరిగిన క్యాబేజీ - కప్పు,  పసుపు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌ ముక్కలు- అర కప్పు చొప్పున, స్ప్రింగ్‌ ఆనియన్స్‌- కొన్ని, వెనిగర్‌- రెండు చెంచాలు, సోయా సాస్‌- రెండు పెద్ద చెంచాలు, రెడ్‌, గ్రీన్‌ చిల్లీసాస్‌లు - పెద్ద చెంచా చొప్పున, మిరియాల పొడి- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.

తయారీ: పొయ్యి వెలిగించి బాండీ పెట్టి తగినన్ని నీళ్లు పోయాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఉప్పు జత చేయాలి. ఆ తర్వాత నూడుల్స్‌ వేసి 90 శాతం ఉడికిన తర్వాత చిల్లుల గిన్నెలో వేసి నీళ్లన్నీ పోయేలా చూడాలి. వీటిపై కాస్తంత నూనె వేస్తే అతుక్కోకుండా ఉంటాయి. పొయ్యి మీద మరో పాన్‌ పెట్టి నువ్వుల నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి కాసేపు వేయించాలి. క్యారెట్‌, క్యాబేజీ, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో స్ప్రింగ్‌ ఆనియన్స్‌ను జత చేయాలి. ఇందులో వెనిగర్‌, సోయాసాస్‌, రెడ్‌, గ్రీన్‌ చిల్లీసాస్‌లు, పెప్పర్‌ వేసి బాగా కలపాలి. గ్రీన్‌ చిల్లీసాస్‌ అందుబాటులో లేకపోతే రెడ్‌ చిల్లీసాస్‌ను రెండు చెంచాల వరకు వేసుకోవాలి. సాస్‌ల్లో ఉండే ఉప్పే సరిపోతుంది కాబట్టి అదనంగా ఉప్పు అవసరం రాకపోవచ్చు. చివరగా నూడుల్స్‌ వేసి అవి విరిగిపోకుండా కలిపి చిన్న మంటపై పదినిమిషాలు మగ్గించాలి. రుచి చూసి ఉప్పు తక్కువైందనిపిస్తే కాస్తంత జత చేస్తే చాలు. ఉల్లికాడలతో గార్నిష్‌ చేసుకుంటే సరి.


పకోడీ..

కావాల్సినవి: నూడుల్స్‌- కప్పు, క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు చొప్పున, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- మూడు (ముక్కలుగా చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముక్కలు- చెంచా చొప్పున, సోయాసాస్‌, చిల్లీపేస్ట్‌- పెద్ద చెంచా చొప్పున, వెనిగర్‌- చెంచా, చక్కెర- అర చెంచా, బియ్యప్పిండి, శనగపిండి- కప్పు చొప్పున, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ:  నూడుల్స్‌ ఉడికించి, ఆ తర్వాత నీటిని వడబోసి చల్లార్చి పెట్టుకోవాలి. మరో గిన్నెలో క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్‌, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. దీంట్లో సోయాసాస్‌, చిల్లీపేస్ట్‌, వెనిగర్‌, చక్కెర వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు, ఉడికించిన నూడుల్స్‌ వేసి బాగా కలపాలి. దీంట్లోనే బియ్యప్పిండి, శనగపిండి, కొద్దిగా వేడి నూనె వేసి బజ్జీ పిండిలా కలపాలి. దీన్ని పకోడీల్లా కాగే నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని టొమాటో కెచప్‌తో తింటే సరి.


చికెన్‌తో...

కావాల్సినవి: చికెన్‌- 500 గ్రా., సోయాసాస్‌- నాలుగు చెంచాలు, వెనిగర్‌, టొమాటో కెచప్‌, రెడ్‌, గ్రీన్‌చిల్లీ సాస్‌లు- రెండు చెంచాల చొప్పున, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- చెంచా, చక్కెర- పావుచెంచా, అల్లం, వెల్లుల్లి తరుగు- అర చెంచా చొప్పున, క్యాప్సికమ్‌, క్యారెట్‌, క్యాబేజీ తరుగు- పావుకప్పు చొప్పున, ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లిఅల్లం ముక్కలు- సగం చెంచా చొప్పున, నూనె- తగినంత.

తయారీ: గిన్నెలో చికెన్‌, రెండు చెంచాల సోయాసాస్‌, వెనిగర్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి గంట పక్కన పెట్టాలి. పొయ్యిపై పాన్‌ పెట్టి నూనె వేయాలి. ఇది వేడయ్యాక మారినేట్‌ చేసిన చికెన్‌ వేసి పెద్ద మంటపై వేయించాలి. పూర్తిగా ఉడికాక పక్కన పెట్టాలి. నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో సోయా, రెడ్‌, గ్రీన్‌ చిల్లీసాస్‌లు, టొమాటో కెచప్‌, చక్కెర, అల్లంవెల్లుల్లి తరుగు వేసి కలపాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక క్యాప్సికమ్‌, క్యారెట్‌, క్యాబేజీ తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. మరోసారి పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం తరుగు, పండుమిర్చి ముక్కలు వేయించాలి. ఇందులోనే చికెన్‌ ముక్కలు, వేయించిన వెజిటేబుల్స్‌ వేసి కలపాలి. చివరగా సాస్‌ వేసి మరోసారి కలపాలి. అంతే రుచికరమైన చికెన్‌ నూడుల్స్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని