రుచుల సోయగం!

వీటిలో ప్రొటీన్లు పుష్కలం...పీచుతోబాటు పోషకాలూ ఉంటాయి...రుచిలో అదుర్స్‌..అన్నం, చపాతీ... పరాఠా.. దేంట్లోకైనా ఇట్టే కలిపేసుకోవచ్చు. మాంసాహారంలా అనిపించే... మీల్‌మేకర్‌గా పిలిచే... సోయా రుచులు మీకోసం!

Updated : 06 Feb 2022 05:05 IST

వీటిలో ప్రొటీన్లు పుష్కలం...పీచుతోబాటు పోషకాలూ ఉంటాయి...రుచిలో అదుర్స్‌..అన్నం, చపాతీ... పరాఠా.. దేంట్లోకైనా ఇట్టే కలిపేసుకోవచ్చు. మాంసాహారంలా అనిపించే... మీల్‌మేకర్‌గా పిలిచే... సోయా రుచులు మీకోసం!


కబాబ్‌

కావాల్సినవి: సోయా చంక్స్‌- కప్పు, పచ్చిమిర్చీ- నాలుగు, అల్లం- పెద్ద ముక్క, వెల్లుల్లి రెబ్బలు- నాలుగైదు, చాట్‌ మసాలా- చెంచా, గరంమసాలా- అర చెంచా, ఉల్లిపాయ- ఒకటి (చిన్న ముక్కలుగా), కొత్తిమీర తరుగు- కొద్దిగా, మైదా- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: సోయా చంక్స్‌ను వేడినీళ్లలో గంట నానబెట్టాలి. ఆ తర్వాత ముక్కల్లోని నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చీ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న సోయా చంక్స్‌, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఇందులో చాట్‌ మసాలా, గరంమసాలా, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. దీనికి మైదానూ జత చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న వడలుగా చేసుకుని పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. చిల్లీసాస్‌ లేదా పచ్చిమిర్చి, నిమ్మరసంతో తింటే చాలా బాగుంటాయి.


పులావ్‌...

కావాల్సినవి:  సోయా చంక్స్‌- పెద్ద కప్పు, బాస్మతి బియ్యం- 250 గ్రా., పెరుగు- రెండు పెద్ద చెంచాలు, పసుపు- చిటికెడు, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, హోల్‌ గరంమసాలా (దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు, జీలకర్ర)- కొద్దిగా,  ఉల్లిపాయలు- రెండు (చిన్న ముక్కలుగా), పచ్చిమిర్చి- మూడు (చిన్న ముక్కలుగా), అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, టొమాటోలు- రెండు (ముక్కలుగా), గరంమసాలా పొడి- చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ: సోయా చంక్స్‌ను ముందుగా ఇరవై నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పెరుగు, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు పావుగంట పక్కన పెట్టాలి. అలాగే బాస్మతి బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టాలి. పొయ్యి మీద కుక్కర్‌ పెట్టి నెయ్యి, వేసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర, ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కలనూ వేయాలి. వీటిని కాస్త మగ్గించాక చిటికెడు పసుపు, చెంచా చొప్పున కారం, గరంమసాలా పొడి, మారినేట్‌ చేసి పెట్టుకున్న మీల్‌ మేకర్‌ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు కొన్నింటిని వేసి కలపాలి. ఆ తర్వాత ఉప్పు, నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. మూత పెట్టి ఆవిరి వచ్చిన తర్వాత కుక్కర్‌ విజిల్‌ పెట్టాలి. రెండు కూతలు వచ్చే వరకు మంటను మధ్యస్థంగా పెట్టాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి దాదాపు ఎనిమిది నుంచి పదినిమిషాలు అలా ఉంచేయాలి. అంతే రుచికరమైన సోయా పులావ్‌ రెడీ. దీన్ని రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది.


చిల్లీ సోయా..

కావాల్సినవి: సోయా చంక్స్‌- 100 గ్రా., కారం- మూడు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, మొక్కజొన్నపిండి- పావు కప్పు, నూనె- వేయించడానికి సరిపడా, అల్లం, వెల్లుల్లి తరుగు- రెండు చెంచాల చొప్పున, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ - ఒక్కోటి చొప్పున (పెద్ద ముక్కలుగా), మిరియాల పొడి, వెనిగర్‌- చెంచా చొప్పున, సోయాసాస్‌- రెండు చెంచాలు, చిల్లీసాస్‌, టొమాటో కెచప్‌- రెండు పెద్ద చెంచాలు, ఉల్లికాడల తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చీ- రెండు (నిలువుగా చీల్చాలి).
తయారీ:  సోయా చంక్స్‌ను ముందుగా పావుగంట వేడి నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, రెండు చెంచాల కారం, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పావు కప్పు కార్న్‌ఫ్లోర్‌ కొద్ది కొద్దిగా 
జతచేస్తూ మరోసారి కలపాలి. కాగుతున్న నూనెలో వీటిని వేసి మంటను మధ్యస్థంగా పెట్టి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి మీద పాన్‌ పెట్టి కాస్తంత నూనె వేసుకోవాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. వెనిగర్‌, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో కెచప్‌, చెంచా కారం వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు చెంచా కార్న్‌ఫ్లోర్‌లో పావు కప్పు నీళ్లు పోసి మజ్జిగలా చేసి ఈ మిశ్రమంలో కలపాలి. సోయా ముక్కలను వేసుకోవాలి. బాగా కలిపి చివరగా ఉల్లికాడల తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చీ ముక్కలు వేసి కలిపి తింటే వావ్‌ అనకుండా ఉండలేరు.


భుర్జీ...

కావాల్సినవి: మీల్‌మేకర్‌ ముక్కలు- కప్పు, నెయ్యి- పెద్ద చెంచా, దాల్చిన చెక్క- పెద్దదొకటి, జీలకర్ర- చెంచా, లవంగాలు- అయిదు, యాలకులు- రెండు, పచ్చిమిర్చీ- రెండు (నిలువుగా చీల్చాలి), ఉల్లిపాయ- ఒకటి (ముక్కలుగా), వెల్లుల్లి రెబ్బలు- మూడు, అల్లం ముద్ద- చెంచా, పసుపు- పావు చెంచా, కారం- ముప్పావు చెంచా, జీలకర్ర పొడి- పావు చెంచా, గరంమసాలా- అర చెంచా, టొమాటో ప్యూరీ- కప్పు, పెరుగు- పావు కప్పు, నీళ్లు- తగినన్ని, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత.
తయారీ: పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. ఈ నీటిలో సోయా ముక్కలు, ఉప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ముక్కలను చల్లటి నీటిలో వేసి నీళ్లను పిండేసి మిక్సీలో వేసి గ్రాన్యూల్స్‌లా చేసుకోవాలి. మరో పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. మసాలా దినుసులు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇందులోనే పచ్చిమిర్చీ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసి వేయించాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసి కూర నుంచి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. మంట చిన్నగా చేసి పెరుగు కలపాలి. కాసేపటి తర్వాత సోయా గ్రాన్యూల్స్‌, కాస్తంత ఉప్పు వేసి అయిదు నిమిషాలు కలపాలి. కొన్ని నీళ్లు పోసి పది నిమిషాలు చిన్నమంటపై మగ్గించాలి. కొత్తిమీరతో చల్లుకుంటే సోయా భుర్జీ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని