Published : 06 Mar 2022 01:05 IST

నెయ్యప్పడాలు తేలేదా!

శ్రీకాకుళం నుంచీ వచ్చినవాళ్లను అడిగే ప్రశ్న ఇది!
సారెలో నెయ్యప్పడాలు పంపలేదని అత్తింటివారి అలక...
భోజనంలో నెయ్యప్పడాలు పెట్టలేదని అతిథుల కినుక...
ఈ రెండు మాటలు చాలు నెయ్యప్పడాల స్థానమేమిటో చెప్పడానికి..

సిక్కోలు వారి ఇంట్లో భోజనం చేసిన వారికి తెలుసు ఈ నెయ్యప్పడాల రుచేంటో...  ఇంటి ఆడపడచు పెళ్లి సారెలో తప్పకుండా ఉండే పదార్థం కూడా. ఉత్తరాంధ్రలో.. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ నెయ్యప్పడాలు చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇవి లేని ఇల్లంటూ ఉండదు. చాలావరకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని గ్రామాలు, గ్రామాల్లోని అన్ని కుటుంబాలు వీటిని చేసుకుంటున్నాయి. చారన్నం, చద్దన్నంలోకి నెయ్యప్పడాలు ఉండాల్సిందే. కొత్తగా రుచి చూసేవారు రుచిని ఆస్వాదిస్తారు. మళ్లీ కావాలంటూ అడిగి మరీ తింటారు. శుభకార్యానికి ఉత్తరాంధ్రలోని ఏ ఇంటికి వచ్చినా తిరిగి వెళ్లేటప్పుడు కాసిన్ని నెయ్యప్పడాల్ని ఇచ్చి సాగనంపడం ఆనవాయితీ కూడా. వీటి తయారీకి పెద్దగా శ్రమించక్కర్లేదు. చేయడం చాలా సులభం.

ఎలా చేస్తారంటే...
వరి ధాన్యాన్ని వేయిస్తే నెయ్యలు (పేలాలు) వస్తాయి. వీటిని దుకాణాల్లో అమ్ముతారు కూడా. కేజీ నెయ్యల నుంచి వరిపొట్టును వేరు చేయాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇసుక, మట్టిరేణువులు అడుగుకు వచ్చాక నీళ్లన్నీ పోయేలా గట్టిగా పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. పావుకేజీ పచ్చిమిర్చీ మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. శుభ్రం చేసిన పేలాలను వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చీ ముద్ద, ఉప్పు, వాము, జీలకర్ర, నువ్వులను వేసి బాగా కలపాలి. ముద్ద తడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. అన్ని పదార్థాలను బాగా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. చిన్న మూతపై పలుచని వస్త్రం వేసి, దానిపై తయారు చేసుకున్న పిండిని కాసింత తీసుకుని పలుచగా అప్పడంలా చేయాలి. ఇలా తయారుచేసి పెట్టుకున్న అప్పడాలను కాటన్‌ వస్త్రంపై జాగ్రత్తగా వేసి రెండు రోజులు ఎండలో పెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత నిల్వచేసుకుంటే సరి. వేయించేటప్పుడు మాత్రం నూనె బాగా మరిగించొద్దు. అలా అయితే వేయగానే మాడిపోయి చేదైపోతాయి. ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు రుచి చూస్తారా మరి!

- భూపతి సత్యనారాయణ, మల్టీమీడియా, ఈజేఎస్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts