ఈ ఉగాదికి వెప్పం పూ రసం!

తెలుగువారి సంవత్సరాది  ఉగాది వచ్చేస్తోంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే ఉగాది పచ్చడి రుచి అందరికీ తెలిసిందే. బొబ్బట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఉగాదిని చేసుకుంటారు.   మరి ఆ రోజున వారు చేసుకునే వంటకాలు ఏంటో చూద్దామా.. నచ్చినవి ప్రయత్నిద్దామా..  

Updated : 27 Mar 2022 06:02 IST

తెలుగువారి సంవత్సరాది  ఉగాది వచ్చేస్తోంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే ఉగాది పచ్చడి రుచి అందరికీ తెలిసిందే. బొబ్బట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఉగాదిని చేసుకుంటారు. మరి ఆ రోజున వారు చేసుకునే వంటకాలు ఏంటో చూద్దామా.. నచ్చినవి ప్రయత్నిద్దామా..  

న పక్క రాష్ట్రం తమిళనాడులో ఉగాదిని....పుదు వరుష పిరప్పు అని పిలుస్తారు. ఆ రోజు తమిళులు మన ఉగాది పచ్చడిలానే వెప్పం పూ రసం తయారు చేసుకుని తాగుతారు. మామిడికాయతో తియ్యని, పుల్లని పచ్చళ్లను చేసుకుంటారు. అలాగే, కర్ణాటకలో ఈ పర్వదినాన్ని యుగాదిగా వ్యవహరిస్తారు. గసగసె పాయసం, ఒబ్బట్టు, హోళిగె రసం లాంటి ప్రత్యేకమైన వంటకాలు వండుతారు. కేరళలో ‘విషు’గా ఈ కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలుకుతారు. ఈ రోజున విషు కట్టా, పాయసం, విషు కంజి లాంటి డిషెస్‌ని చేస్తారు. మహారాష్ట్రలో ఉగాదిని  గుడి పడ్వాగా నిర్వహిస్తారు. పూరన్‌ పోలీ, ఉగాది డ్రైఫ్రూట్స్‌ పాయసం, కొత్తింబీర్‌ వడి లాంటివి వండుతారు. పంజాబ్‌లో ఉగాదిని భైశాఖీగా పిలుస్తారు. మీఠా పీలా చావల్‌, ఫిర్నీ, ఖడీ, రైస్‌ ఖీర్‌, మ్యాంగో లస్సీ వంటివి చేస్తారు. ప్రాంతమేదైనా పండగ అంటేనే సంతోషాల కలబోత... మరి ఈ ఉగాదికి భిన్న రుచులను ఆస్వాదిద్దామా!

గసగసె పాయస...

కర్ణాటక

కావాల్సినవి:  గసగసాలు- మూడు పెద్ద చెంచాలు, జీడిపప్పు, బాదం- అయిదు చొప్పున, పచ్చికొబ్బరి తురుము- కప్పు, నీళ్లు- రెండు కప్పులు, బెల్లం- ముప్పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి, గసగసాలు, బాదం, జీడిపప్పు వేసి, చిన్నమంటపై గసగసాలు లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి తురుము, అర కప్పు నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడీ పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి. పెద్ద కడాయిలో ముప్పావు కప్పు బెల్లం వేసి, కప్పున్నర నీళ్లు పోసి బాగా కలిపి బెల్లాన్ని కరిగించాలి. ఆ తర్వాత దీన్ని రెండు మూడు నిమిషాలు మరిగించాలి. ఇందులో తయారుచేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. దీన్ని ఓ అయిదు నిమిషాలు లేదా ఖీర్‌ పూర్తిగా  ఉడికే వరకు మరిగించాలి.

మరో పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని ఖీర్‌పై వేసుకోవాలి. చివరగా పావు చెంచా యాలకుల పొడి వేసి బాగా కలిపితే సరి. అంతే రుచికరమైన బెల్లంతో చేసిన గసగసె పాయస(ం) సిద్ధమైంది. తినడమే తరువాయి. ఈ పాయసాన్ని బెల్లంతోనే కాకుండా చక్కెరతోనూ చేసుకోవచ్చు. అయితే తయారీ విధానం కాస్త భిన్నంగా ఉంటుంది.


మీఠా పీలా చావల్‌...

పంజాబ్‌

కావాల్సినవి: బాస్మతి బియ్యం, చక్కెర- అర కప్పు (అరగంట నానబెట్టాలి) చొప్పున, నెయ్యి- పావు కప్పు, జీడిపప్పు- ఎనిమిది, బాదం- అయిదారు, కిస్‌మిస్‌, కొబ్బరి పొడి- రెండు పెద్ద చెంచాల చొప్పున, యాలకులు- రెండు, లవంగాలు- నాలుగు, నీళ్లు- కప్పు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌- పావు చెంచా (ఆప్షనల్‌), కుంకుమపువ్వు రేకలు- కొన్ని.

తయారీ: పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, బాదం తరుగు, కిస్‌మిస్‌, కొబ్బరి పొడులను లేత గోధుమ రంగు వచ్చేవరకు చిన్న మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో యాలకులు, లవంగాలనూ వేసి వేయించాలి. దీంట్లోనే కప్పు నీళ్లు పోసి, కుంకుమ పువ్వు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి చక్కగా కలపాలి. మూత పెట్టి మంటను మధ్యస్థంగా ఉంచి పది నిమిషాలు ఉడికించాలి. అన్నం సగం ఉడికిన తర్వాత చక్కెర, రెండు పెద్ద చెంచాల నెయ్యి వేసి చక్కెర కరిగేలా కలియబెట్టాలి. ఇప్పుడు మరోసారి మూత పెట్టి చిన్న మంటపై అయిదు నిమిషాలు మగ్గించాలి. అన్నం పూర్తిగా ఉడకనివ్వాలి. అలాగే మెత్తగా కాకుండా చూసుకోవాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకుంటే నోరూరించే మీఠా పీలా చావల్‌ సిద్ధమైనట్లే.


విషు కట్టా...

కేరళ

కావాల్సినవి: కేరళ బియ్యం- అర కప్పు (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి, లేదంటే మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు), కొబ్బరిపాలు- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, జీలకర్ర- చెంచా, బెల్లం- పావు కప్పు, నీళ్లు- సరిపడా, నెయ్యి- రెండు చెంచాలు, యాలకుల పొడి- పావు చెంచా.

తయారీ: పెద్ద గిన్నెలో బియ్యం వేసి, నీళ్లు పోసి గంట నానబెట్టాలి. మరో గిన్నెలో కొబ్బరి పాలు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టిన బియ్యం వేసి మంటను మధ్యస్థంగా పెట్టి అన్నం పూర్తిగా మెత్తగా ఉడికేలా చూడాలి. ఇందులో తగినంత ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అర కప్పు కొబ్బరిపాలు పోసి మరికాసేపు ఉడికించాలి. మొత్తం ఉడికిన తర్వాత ఓ పెద్ద పళ్లెంలో అరటి ఆకు వేసి, దానిపై ఈ అన్నాన్ని వెడల్పుగా పరిచి మరో ఆకుతో కప్పేయాలి. ఇప్పుడీ మిశ్రమాన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి.

పైన వేసిన ఆకు తీసేసి చాకుతో నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోయాలి. మరో గిన్నెలో పావు కప్పు బెల్లం వేసి కాసిన్ని నీళ్లు పోసి చిన్నమంటపై వేడి చేయాలి. ద్రవం చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేయాలి. కావాలనుకుంటే కాస్తంత నెయ్యి జత చేయొచ్చు. ఈ ద్రవాన్ని అన్నం ముక్కలపై పోసి వేడిగా తింటే చాలా బాగుంటాయి. కేవలం బెల్లం పాకంతోనే కాకుండా జీడిపప్పు కుర్మా, వెజ్‌, నాన్‌వెజ్‌ గ్రేవీలతోనూ తింటే రుచి పెరుగుతుంది.


కొత్తింబీర్‌ వడి...

మహారాష్ట్ర

కావాల్సినవి: కొత్తిమీర తురుము- రెండు కప్పులు, శనగపిండి- కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, నువ్వులు, నిమ్మరసం- చెంచా చొప్పున, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి- అర చెంచా చొప్పున; గరంమసాలా- పావు చెంచా, పచ్చిమిర్చి- ఒకటి (చిన్న ముక్కలుగా), ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా, నీళ్లు- కాసిన్ని.

తయారీ: పెద్ద గిన్నెలో కొత్తిమీర తురుము, శనగపిండి తీసుకోవాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చీ, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, నువ్వులు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని బుల్లెట్స్‌లా స్తూపాకారంగా చేసుకోవాలి. వీటిని పావుగంట ఆవిరి మీద ఉడికించాలి. ఆ తర్వాత చల్లార్చి, కాస్త మందమైన ముక్కలుగా కోసుకోవాలి. వీటిని అరచేతుల్లో తీసుకుని కాస్తంత అదిమి వడల్లా చేసుకుని వేడి నూనెలో వేసి వేయించాలి. వేడి వేడిగా... చాయ్‌కి జతగా అదిరిపోతాయి.


వెప్పం పూ రసం...

తమిళనాడు

కావాల్సినవి:   వేప పువ్వు- రెండు పెద్ద చెంచాలు, కందిపప్పు, చింతపండు రసం- కప్పు చొప్పున, బెల్లం- రెండు చెంచాలు, పసుపు, ఆవాలు- అర చెంచా చొప్పున, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- రెండు చెంచాలు, ఎండుమిర్చి- మూడు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- అయిదు రెబ్బలు.  

తయారీ:  పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసుకుని అది వేడయ్యాక వేప పువ్వు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు వేసి కాస్త చిటపట మన్నాక  ఎండుమిర్చీ, కరివేపాకు, కందిపప్పు ఒకదాని తర్వాత మరొకటి జత చేస్తూ కాసేపు వేయించాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసి, పసుపు, బెల్లం వేసి బాగా ఉడికించాలి. తగినంత ఉప్పునూ చేర్చాలి. చివరగా సరిపడా వేయించి పెట్టుకున్న వేపపువ్వును వేసుకోవాలి. ఓ రెండు నిమిషాలు మరిగించి దించేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన వెప్పం పూ రసం రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని