పోషకాల జాతర తినరా.. పెసర

ఇంట్లో పిడికెడు పెసరపప్పు ఉంటే చాలు... పండగే! ఏ కాయగూరలూ లేకపోతే.. కమ్మని కిచిడీ అవుతుంది. ‘అతిథులొస్తే’.. హల్వాగా మారి ఆనందాలు పంచుతుంది. చప్పబడిన నోటికి రోటి పచ్చడై జిహ్వచాపల్యం తీరుస్తుంది. అరె ఇవన్నీ చేయడమెలా అనుకొనేవారు ఈ వంటలని ఓ సారి చూసేయండి...

Published : 29 May 2022 01:26 IST

ఇంట్లో పిడికెడు పెసరపప్పు ఉంటే చాలు... పండగే! ఏ కాయగూరలూ లేకపోతే.. కమ్మని కిచిడీ అవుతుంది. ‘అతిథులొస్తే’.. హల్వాగా మారి ఆనందాలు పంచుతుంది. చప్పబడిన నోటికి రోటి పచ్చడై జిహ్వచాపల్యం తీరుస్తుంది. అరె ఇవన్నీ చేయడమెలా అనుకొనేవారు ఈ వంటలని ఓ సారి చూసేయండి...


కిచిడీ

కావాల్సినవి: బియ్యం- అరకప్పు, పెసరపప్పు- అరకప్పు, నెయ్యి- మూడు చెంచాలు, పసుపు- పావుచెంచా, ఉప్పు- అరచెంచా, నీళ్లు- నాలుగుంబావు కప్పులు, జీలకర్ర- చెంచా, బిర్యానీ ఆకు- ఒకటి, ఇంగువ- కొద్దిగా, ఉల్లిపాయ- ఒకటి(చిన్నది), అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, టమాటా- ఒకటి, కారం- చెంచా, గరంమసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
తయారీ: బియ్యం, పెసరపప్పులు శుభ్రంగా కడిగి పావుగంటపాటు నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్‌లో చెంచా నెయ్యి వేసి అందులో పెసరపప్పు, బియ్యం వేసి గరిటెతో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంతవరకూ ఇలా చేయాలి. ఇందులో పావుచెంచా పసుపు, అరచెంచా ఉప్పు, మూడుంపావు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టి ఐదునిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు విడిగా ఒక కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో చెంచా జీలకర్ర, ఇంగువ, బిర్యానీ ఆకు వేసి మంచి వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి అవి మగ్గేంత వరకూ ఉండి అందులో కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు, గరంమసాలా వేయాలి. ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పు అన్నాన్ని వేసి మరో కప్పు వరకూ నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి దించుకోవాలి. పచ్చడితో తింటే బాగుంటుంది.


హల్వా

కావాల్సినవి: పెసరపప్పు- అరకప్పు, నెయ్యి- ఆరు చెంచాలు, బొంబాయి రవ్వ- అరచెంచా, నీళ్లు- అరకప్పు, పాలు- అరకప్పు, పంచదార- ఎనిమిది చెంచాలు, యాలకులపొడి- అరచెంచా, పిస్తా పప్పులు- ఆరు, బాదం పప్పులు- ఆరు
తయారీ: ముందుగా పెసరపప్పుని శుభ్రం చేసి అరగంటపాటు నానబెట్టుకోవాలి. పప్పులోని నీళ్లను వడకట్టి మిక్సీలో కొద్దిగా బరకగా ఉండేట్టు ఆడించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాన్‌లో నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ వేసుకుని దోరగా వేయించాలి. అది వేగిన తర్వాత అందులో పెసరపప్పు ముద్ద వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కదుపుతూ ఉండాలి. మంచి వాసన వస్తున్న సమయంలో అప్పుడు పాలు, నీళ్లు, కొద్దిగా కుంకుమపువ్వు వేసి ఉడకనివ్వాలి. మిశ్రమం దగ్గరకు వస్తున్నప్పుడు ఇందులో పంచదార, రెండు చెంచాల నెయ్యి, యాలకులపొడి, రోజ్‌వాటర్‌ వేసి గరిటెతో కలపాలి. హల్వా గిన్నె అంచుల నుంచి వేరవుతున్నప్పుడు బాదం, పిస్తాలని సన్నని పలుకుల్లా తురుమి పైన వేయాలి. ఈ హల్వాని వేడిగా తింటే రుచిగా ఉంటుంది.


పచ్చడి

కావాల్సినవి: పెసరపప్పు- అరకప్పు, నూనె- అరచెంచా, ఎండుమిర్చి- పది, జీలకర్ర- చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు, నీళ్లు- తగినన్ని తాలింపుకోసం: నూనె- చెంచా, ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- పావుచెంచా, ఎండుమిర్చి- ఒకటి, ఇంగువ- కొద్దిగా
తయారీ: పెసరపప్పుని అరగంటపైన నానబెట్టుకుని ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి అందులో ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. వీటిని మిక్సీలోకి తీసుకుని మెత్తగా పొడిచేసుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత తాలింపు వేసి దాన్ని పెసరపప్పులో కలుపుకొంటే పచ్చడి సిద్ధం.


చాట్‌

కావాల్సినవి: పెసల మొలకలు- కప్పు, టమాటా- ఒకటి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- రెండు, చాట్‌మసాలా- పావుచెంచా, గరంమసాలా- పావుచెంచా, కారం- పావుచెంచా, పంచదార- పావుచెంచా, నిమ్మకాయ- అరచెక్క, ఉప్పు- తగినంత
తయారీ: మొలకలని శుభ్రంగా కడిగేసి సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, మొలకలు మిగిలిన అన్నింటిని వేసుకొని బాగా కలుపుకొని చివరిగా  నిమ్మరసం పిండుకుంటే పోషకభరితమైన చాట్‌ సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని