పాలతో... పసందుగా!

శ్రావణమాసం అంటే పూజలు, వ్రతాలు..ప్రతివారం అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని తప్పనిసరిగా నివేదించే వాళ్లూ ఉంటారు. పాలల్లో సేమియాలు వేసి చేయడం మనకి కొత్తకాదు. కానీ ఈసారి  ఫూల్‌మకనా, గసగసాలు, గులాబీరేకులతో పాయసాలు చేసి చూడండి.. అమ్మనే కాదు ఇంటిల్లిపాదినీ మెప్పించొచ్చు..  

Published : 31 Jul 2022 00:52 IST

శ్రావణమాసం అంటే పూజలు, వ్రతాలు..ప్రతివారం అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని తప్పనిసరిగా నివేదించే వాళ్లూ ఉంటారు. పాలల్లో సేమియాలు వేసి చేయడం మనకి కొత్తకాదు. కానీ ఈసారి  ఫూల్‌మకనా, గసగసాలు, గులాబీరేకులతో పాయసాలు చేసి చూడండి.. అమ్మనే కాదు ఇంటిల్లిపాదినీ మెప్పించొచ్చు..  

ఫూల్‌మకనా పాయసం

కావాల్సినవి: హోల్‌మిల్క్‌- రెండు కప్పులు, యాలకులు- మూడు, జీడిపప్పులు లేదా బాదం పప్పులు-10, ఎండుద్రాక్షలు- చెంచాన్నర, పంచదార- నాలుగు చెంచాలు, కుంకుమపువ్వు- చిటికెడు, నెయ్యి- మూడు చెంచాలు, ఫూల్‌ మకనా- కప్పు
తయారీ: పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు, మకనాని తక్కువమంట మీద వేయించుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఒక పాత్రలో పాలని వేసి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ పాలు కాస్త దగ్గరగా వచ్చేంతవరకూ కాచాలి. ఈలోపు పావుకప్పు ఫూల్‌మకనా గింజలు, యాలకులు, కుంకుమపువ్వు వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. పాలు మరిగాక అందులో పంచదార, ఈ పొడిని వేసి కలుపుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న మకనా గింజలని కూడా కలుపుకోవాలి. ఈ గింజలు కాస్త మెత్తబడి... పాయసం చిక్కగా అయ్యేంతవరకూ తక్కువ మంట మీద ఉంచాలి. చివరిగా ఎండుద్రాక్ష, జీడిపప్పులని వేసుకోవాలి. దీన్ని వేడిగా, చల్లగా ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది.


గులాబీలతో

కావాల్సినవి: పాలు-అరలీటర్‌, బియ్యం- రెండు చెంచాలు, యాలకులపొడి- చిటికెడు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- రుచికి తగినంత, ఎండు గులాబీరేకులు(ఎడిబుల్‌ రకం)- పావుకప్పు, రోస్‌వాటర్‌- ఐదారు చుక్కలు
తయారీ: ఒక నాన్‌స్టిక్‌ పాత్రను తీసుకుని అందులో పాలు, కడిగి శుభ్రం చేసిన బియ్యం వేయాలి. చిన్నమంట మీద బియ్యాన్ని పూర్తిగా ఉడకనివ్వాలి. మీకు తీపి ఎంత కావాలో చూసుకుని దానిని బట్టి కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసుకోవాలి. ఆ తర్వాత యాలకులపొడి, గులాబీ రెక్కల పొడి(మిక్సీలో పొడి చేసుకోవాలి) వేసుకుని స్టౌ కట్టేయాలి. పాయసం చల్లారాక రోజ్‌వాటర్‌ వేసుకోవాలి. అలంకరణ కోసం కొన్ని గులాబీ రెక్కలు కూడా వేసుకోవచ్చు.


అనాసతో...

కావాల్సినవి: హోల్‌మిల్క్‌- ఐదు కప్పులు, అనాస ముక్కలు- కప్పున్నర, కొబ్బరి పొడి- నాలుగు చెంచాలు, మొక్కజొన్నపిండి- చెంచా, పంచదార- ముప్పావుకప్పు
తయారీ: అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే పాత్రలో పాలని మరిగించుకోవాలి. పాలు పాత్రకు అడుగంటకుండా గరిటెతో కలుపుతూ సగం అయ్యేంతవరకూ తక్కువ మంట మీద కాచుకోవాలి. ఓ నాలుగు చెంచాల నీళ్లు తీసుకుని అందులో మొక్కజొన్న పిండిని కలిపి ఆ నీటిని పాలకి కలపాలి. తర్వాత కొబ్బరిపొడి కూడా వేసి మరో పది నిమిషాలపాటు మరిగించాలి. పొయ్యి కట్టేసి పాలను చల్లారనివ్వాలి. ఇప్పుడు అనాస ముక్కల్లో పంచదార వేసి బాగా కలపాలి. కొన్ని ముక్కలని చివర్లో అలంకరించుకొనేందుకు మాత్రం పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని ఒక కడాయిలో వేసి ముక్కలు మెత్తగా అయ్యేంతవరకూ ఉడికించి చల్లార్చుకోవాలి. పాలు, అనాస ముక్కలూ రెండూ చల్లారిన తర్వాతే రెండిటినీ ఒక పాత్రలో కలుపుకొని ఫ్రిజ్‌లో ఉంచితే చక్కని రుచి వస్తుంది.


గసగసాల పాయసం

కావాల్సినవి: గసగసాలు- అరకప్పు(రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి), పాలు- రెండుకప్పులు, బియ్యం- నాలుగు చెంచాలు, కుంకుమపువ్వు- చిటికెడు, పంచదార- ముప్పావుకప్పు, యాలకులపొడి- చెంచాడు, నానబెట్టి సన్నగా తరిగిన బాదం, పిస్తాపలుకులు- రెండ[ు చెంచాలు
తయారీ: మిక్సీలో గసగసాలు, మూడుచెంచాల బియ్యం, రెండు చెంచాల పాలు తీసుకుని వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో పాలు వేడి చేసుకుని అందులో మిగిలిన చెంచా బియ్యం, కుంకుమపువ్వు వేసుకుని మరిగించుకోవాలి. అవి ఉడికాక గసగసాల ముద్ద వేసి మరో ఐదునిమిషాలు పాటు ఉడికాక, అప్పుడు పంచదార వేసి చిక్కబడేంతవరకూ ఉడికించుకోవాలి. చివరిగా యాలకులపొడి, బాదం, పిస్తా పలుకులు వేసుకుని దించుకోవడమే.

 


తాటిపండుతో..

కావాల్సినవి: పాలు- పావులీటర్‌, తాటిపండు గుజ్జు- రెండు కప్పులు, పంచదార- ముప్పావు కప్పు, కొబ్బరికోరు- అరకప్పు, పాలపొడి- పావుకప్పు,
తయారీ: పాన్‌లో ఒక కప్పు పాలుపోసి తక్కువ మంటమీద మరిగించుకోవాలి. ఇందులో పాలపొడిని వేసి ఉండ కట్టకుండా గరిటెతో తిప్పుకోవాలి. పాలు చిక్కబడ్డాక స్టౌ కట్టేయాలి. వేరొక పాత్రలో విడిగా తాటి గుజ్జును తీసుకుని దానిలో నీరంతా పోయేవరకూ ఉడికించుకోవాలి. దీన్లో పంచదార వేసి అదంతా పూర్తిగా కలిసాక కొబ్బరి కూడా వేసి మరో ఎనిమిది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సిద్ధం చేసిపెట్టుకున్న పాలను కూడా కలుపుకోవాలి. కావల్సిన చిక్కదనం వచ్చేంతవరకూ ఉడికించుకుని దించేయడమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని