ఆరోగ్యానికి గొడుగుపడతాయి!

వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగుల సందడి గురించి  ఎంత చెప్పినా తక్కువే. రుచిలో నాన్‌వెజ్‌కి పోటీనిస్తాయి.  పోషకాల్లో సూపర్‌ఫుడ్‌ హోదాని సొంతం చేసుకున్నాయి.  కొవ్వు, సోడియం ఉండని ఈ పుట్టగొడుగులతో పిల్లలు, పెద్దలకిష్టమైన వంటకాలుఏం చేసుకోవచ్చో చూద్దాం......

Updated : 21 Aug 2022 15:00 IST

వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగుల సందడి గురించి  ఎంత చెప్పినా తక్కువే. రుచిలో నాన్‌వెజ్‌కి పోటీనిస్తాయి.  పోషకాల్లో సూపర్‌ఫుడ్‌ హోదాని సొంతం చేసుకున్నాయి.  కొవ్వు, సోడియం ఉండని ఈ పుట్టగొడుగులతో పిల్లలు, పెద్దలకిష్టమైన వంటకాలు ఏం చేసుకోవచ్చో చూద్దాం......

చిల్లీ మష్రూమ్‌

కావాల్సినవి: పుట్టగొడుగులు- 600గ్రా, మైదా- 5 చెంచాలు, మొక్కజొన్నపిండి- ఐదు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం- అరచెంచా, నూనె- తగినంత, ఉల్లిపాయలు- మూడు(పెద్దముక్కలు తరగాలి), క్యాప్సికమ్‌-రెండు(పెద్దముక్కలు తరగాలి), మిరియాలపొడి- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- మూడు చెంచాలు, సోయాసాస్‌- రెండు చెంచాలు, చిల్లీసాస్‌- రెండు చెంచాలు, టొమాటోసాస్‌- రెండు చెంచాలు, చిల్లీఫ్లేక్స్‌- పావుచెంచా, కార్న్‌ఫ్లోర్‌ స్లరీ(ఒక కప్పు నీళ్లలో, ఒక చెంచా మొక్కజొన్న పిండి కలుపుకొని సిద్ధం చేసుకోవాలి), అల్లంవెల్లుల్లి పేస్ట్‌- మూడు చెంచాలు
తయారీ: ముందుగా పుట్ట గొడుగులని పసుపు వేసి కడిగి, నిలువుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసుకొని మరీజారుగా కాకుండా కలపాలి. ఇందులో పుట్టగొడుగులు కూడా వేసుకుని బాగా కలిపి...నూనెలో కరకరలాడేలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె తీసుకొని అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌ముక్కలు కూడా వేయించుకుని... ఆ తర్వాత మిరియాలపొడి, ఉప్పు, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటోసాస్‌, కారం కూడా వేసి బాగా కలిపి అప్పుడు మొక్కజొన్న పిండి కలిపిన నీళ్లను వేసుకోవాలి. ఇందులో వేయించిన పుట్టగొడుగులు వేసుకుని రెండు నిమిషాలు కలిపితే చాలు చిల్లీ మష్రూమ్‌ సిద్ధం.


మటర్‌ మష్రూమ్‌ సూకే

కావాల్సినవి: పచ్చి బఠాణీలు- కప్పు, పుట్టగొడుగులు- పావుకేజీ, నెయ్యి- రెండు చెంచాలు, ఇంగువ- చిటికెడు, జీలకర్ర- పావుచెంచా, సన్నగా తరిగిన అల్లం- అరచెంచా, గరంమసాలా- రెండు చెంచాలు, ధనియాలపొడి- రెండు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, చిల్లీఫ్లేక్స్‌- అరచెంచా, పసుపు- తగినంత, పెరుగు- అరకప్పు, పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర తరుగు- చెంచాన్నర
తయారీ: పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని ఇందులో జీలకర్ర, ఇంగువ, అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. మంట తగ్గించుకుని అందులో పెరుగు వేసి గరిటెతో కలియ తిప్పుకోవాలి. పెరుగు నుంచి నెయ్యి వేరయ్యేంతవరకూ వేడిచేయాలి. అప్పుడు గరంమసాలా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, చిల్లీఫ్లేక్స్‌ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పచ్చి బఠాణీలు, శుభ్రం చేసిన పుట్టగొడుగులు వేసి అన్నింటినీ బాగా ఉడకనిచ్చి దింపుకోవాలి. రొట్టెల్లోకి బాగుంటుంది.


ఫ్రైడ్‌రైస్‌

కావాల్సినవి: నూనె- చెంచాన్నర, వెల్లుల్లి రెబ్బలు- రెండు, ఉల్లికాడలు- రెండు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు- అరకప్పు, పుట్టగొడుగులు- కప్పు, పచ్చిమిర్చి- రెండు, సోయాసాస్‌- చెంచా, వెనిగర్‌- అరచెంచా, మిరియాలపొడి- పావుచెంచా, ఉప్పు- తగినంత, పొడిగా వార్చిన అన్నం- కప్పున్నర
తయారీ: ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కాక వెల్లుల్లి పలుకులు వేసి మాడిపోకుండా వేయించుకోవాలి. ఇందులో పుట్టగొడుగులు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా వేయించుకోవాలి. ఆ తర్వాత సోయాసాస్‌, వెనిగర్‌ వేసి మరో నిమిషం పాటు వేడిచేసుకోవాలి. ఆ తర్వాత అన్నం, మిరియాలపొడి, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపొరకని వేసి కలిపితేే ఫ్రైడ్‌రైస్‌ సిద్ధం. పచ్చి బఠాణీలు, క్యారెట్‌ ముక్కలు వేసుకుంటే అదనపు
పోషకాలు అందుతాయి.


కబాబ్‌

కావాల్సినవి: పుట్టగొడుగులు- 200గ్రా, జీలకర్రపొడి- పావుచెంచా, పసుపు- కొద్దిగా, తందూరి మసాలా- పావుచెంచా, కారం- అరచెంచా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అరచెంచా, నిమ్మరసం- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- అరచెంచా, నెయ్యి- చెంచా, పెరుగు- రెండు చెంచాలు, సెనగపిండి- రెండు చెంచాలు, కచ్చాపచ్చాగా దంచిన పుదీనాపేస్ట్‌- చెంచా
తయారీ: ఒక పాత్రలో పుట్టగొడుగులు, కారం, పసుపు, జీలకర్రపొడి, తందూరీమసాలా, అల్లంవెల్లుల్లిపేస్ట్‌, నిమ్మరసం, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక పాన్‌లో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో సెనగపిండి వేసి ముదురు గోధుమ రంగు వచ్చేంతవరకూ దోరగా వేయించుకోవాలి. పక్కన పెట్టుకున్న మష్రూమ్‌ మిశ్రమంలో పెరుగు, పుదీనా పేస్ట్‌, వేయించిన సెనగపిండి వేసి ఓ గంటపాటు వదిలేయాలి. తర్వాత వీటిని నూనెలో దోరగా వేయించుకుంటే రుచికరమైన పుట్టగొడుగుల కబాబ్స్‌ సిద్ధం.


క్రిస్పీగా

కావాల్సినవి: పుట్టగొడుగులు-200గ్రా, వెల్లుల్లి రెబ్బలు- మూడు(సన్నగా పలుకుల్లా తరగాలి), బియ్యప్పిండి- కప్పు, కారం- చెంచాన్నర, మిరియాలపొడి- పావుచెంచా, కసూరిమేథీ- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌పొడి- ముప్పావుకప్పు, బొంబాయిరవ్వ- రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు
తయారీ:  బియ్యప్పిండిలో కారం, వెల్లుల్లి పలుకులు, ఉప్పు, మిరియాలపొడి, కసూరీమేథీ వేసి చిక్కగా కలిపి పుట్టగొడుగులని అందులో వేసుకోవాలి. మరో పళ్లెంలో బ్రెడ్‌క్రంబ్స్‌పొడి, బొంబాయిరవ్వ, ఉప్పు, మొక్కజొన్న పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోని పుట్టగొడుగులని తీసి బ్రెడ్‌క్రంబ్‌ పొడిలో అద్దుకుని నూనెలో దోరగా వేయించుకొంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్‌ రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని