కాకర కాదు.. కాసర!

చూడ్డానికి కాకర కాయల్లానే ఉంటాయి. పరిమాణం మాత్రం ఇంచులోపే! కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టే కాసర కాయల్ని కొన్నిచోట్ల చిట్టి కాకర అనీ పిలుస్తారు.

Published : 04 Sep 2022 00:27 IST

చూడ్డానికి కాకర కాయల్లానే ఉంటాయి. పరిమాణం మాత్రం ఇంచులోపే! కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టే కాసర కాయల్ని కొన్నిచోట్ల చిట్టి కాకర అనీ పిలుస్తారు. చేదువల్ల కాకర అంటే మెచ్చని వారూ దీన్ని ఇష్టపడతారు.

కావాల్సిన పదార్థాలు: కాసర కాయలు- పావుకేజీ, మజ్జిగ- చిన్నగ్లాసు, చింతపండు- కొద్దిగా, ఉప్పు, కారం- తగినంత, పచ్చిసెనగపప్పు- గుప్పెడు, కొబ్బరి- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు- 4-5, బెల్లం- రుచికి తగినంత, కరివేపాకు- రెబ్బ, పసుపు- చిటికెడు, జీలకర్ర- చెంచా, నూనె- సరిపడా, ఉల్లిపాయ- ఒకటి (చిన్నది).
తయారీ: మజ్జిగలో చింతపండు, ఉప్పు వేసి, దానిలో ఈ కాసర కాయల్ని వేసి పొయ్యి మీద పెట్టాలి. అయిదు నిమిషాలుంచి స్టవ్‌ కట్టేయాలి. చిల్లుల గిన్నెలో కాయల్ని వడకట్టేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిసెనగపప్పు, కరివేపాకు, కొబ్బరి, జీలకర్ర, చిన్న ముక్క బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి.. కాగాక పక్కన పెట్టిన కాసర కాయల్ని వేయాలి. అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఎరుపు రంగులోకి వచ్చాక ముందే మిక్సీ పట్టి ఉంచుకున్న పొడి వేసి, మరో అయిదు నిమిషాలయ్యాక దింపేస్తే సరి. అన్నం, జొన్నరొట్టె రెండిటిల్లోకీ బాగుంటుంది.

- గొట్టిపాటి రత్నకుమారి, పెద్దివారి పాలెం, గుంటూరు జిల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని