కూరండి... తినండి!

చపాతీ... పక్కనే ఓ కూర! ఇది మామూలు కాంబినేషన్‌. అదే చపాతీలోనే ఊరించే పనీర్‌ ఉంటే..? పరోటాతోపాటు... ఖీమా చేరితే.. అబ్బో ఆ రుచి గురించి మాటల్లో చెప్పలేం.

Updated : 16 Oct 2022 03:19 IST

చపాతీ... పక్కనే ఓ కూర! ఇది మామూలు కాంబినేషన్‌. అదే చపాతీలోనే ఊరించే పనీర్‌ ఉంటే..? పరోటాతోపాటు... ఖీమా చేరితే.. అబ్బో ఆ రుచి గురించి మాటల్లో చెప్పలేం. ఇవే కాదు మరిన్ని రుచులు పరోటాలో స్టఫింగ్‌గా మారితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూసేయండి... చేసేయండి..


ఉల్లితో..

కావాల్సినవి: గోధుమపిండి- రెండు కప్పులు, వాము- పావుచెంచా, ఉప్పు- తగినంత, నెయ్యి లేదా వెన్న- చెంచా  
స్టఫింగ్‌ కోసం: ఉల్లిపాయ పెద్దది- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, చాట్‌మసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, కారం- అరచెంచా, కొత్తిమీర తురుము- చెంచా
తయారీ: గోధుమపిండిలో తగినంత ఉప్పు, వాము వేసుకొని నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్ద చేసుకోవాలి. పిండి పైన తడిపిన నాప్కిన్‌ వేసి ఓ పదినిమిషాలపాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని సన్నగా తరిగిపెట్టుకోవాలి. ఇందులోకి ఉప్పు, కారం, చాట్‌మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగితే చపాతీలో స్టఫింగ్‌ పెట్టడం తేలిక అవుతుంది. చపాతీ పిండిని చిన్నముద్దలుగా చేసుకుని చెంచా చొప్పున ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకుని నెమ్మదిగా పరోటాలని ఒత్తుకోవాలి. రెండు వైపులా కాల్చి... పచ్చడితో తిన్నా బాగుంటాయి.


సెనగ పప్పుతో

కావాల్సినవి: గోధుమపిండి- ఒకటిన్నర కప్పు, ఉప్పు- తగినంత, సెనగపప్పు- అరకప్పు, ఉల్లిపాయముక్కలు- అరకప్పు, గరంమసాలా- చెంచా, కొత్తిమీర తురుము- నాలుగు చెంచాలు, ఆమ్‌చూర్‌పొడి (ఎండుమామిడిపొడి)- అరచెంచా, పచ్చిమిర్చి పేస్ట్‌- చెంచా, పంచదార- పావుచెంచా, బటర్‌ లేదా నెయ్యి- తగినంత
తయారీ: సెనగపప్పుని గంటముందు నానబెట్టుకుని కుక్కర్‌లో కొద్దిగా ఉప్పువేసి ఉడికించుకోవాలి. నీళ్లు వడకట్టి, పప్పు చల్లారిన తర్వాత.. మిక్సీలో బరకగా ఆడించుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, గరంమసాలా, ఉప్పు, కొత్తిమీర తురుము, ఆమ్‌చూర్‌, పచ్చిమిర్చిపేస్ట్‌, పంచదార వేసి కలపాలి. చపాతీపిండి కలిపి.. 12 ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండల్లో సెనగపప్పు మిశ్రమాన్ని చెంచాడు వేసుకుని మిశ్రమం చెదిరి బయటకు రాకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి. వీటిని నెయ్యి లేదా నూనెతో కాల్చుకోవచ్చు.


కీమాతో..

కావాల్సినవి: గోధుమపిండి- రెండు కప్పులు, ఉప్పు, నూనె- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కీమా- 250గ్రా, ధనియాలపొడి- చెంచా, కారం- చెంచా, పసుపు- పావుచెంచా, గరంమసాలా- అరచెంచా, జీలకర్రపొడి- అరచెంచా, నిమ్మరసం- చెంచా, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు
తయారీ: చపాతీపిండిని కలిపిన తర్వాత దానిపై ఒక తడి నాప్కిన్‌ వేసి 20 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాన్‌ తీసుకుని నూనె పోసుకుని అది వేడెక్కాక ఉల్లిపాయముక్కల్ని వేసి వేయించుకోవాలి. దోరగా వేగాక అల్లంవెల్లుల్లిపేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇందులో కీమా కూడా వేసుకుని మూతపెట్టేయాలి. ఓ పదినిమిషాలాగి ఇందులో ధనియాలపొడి, కారం, పసుపు, గరంమసాలా, ఉప్పు, జీలకర్రపొడి వేసి కలిపి ఒక కప్పు నీళ్లుపోసి మూతపెట్టేయాలి. ఆ నీళ్లు ఇగిరి  పోయేంతవరకూ ఉడికించుకుని చివరిగా నిమ్మరసం పిండుకుని దింపేయాలి. రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని ఒక్కో దానిలో కీమా మిశ్రమాన్ని ఉంచుతూ చపాతీలని నెమ్మదిగా కీమా బయటకు రాకుండా ఒత్తుకుని నూనెతో రెండువైపులా కాల్చాలి.


బఠానీతో..

కావాల్సినవి: ఉడికించిన బఠాణీలు- ఒకటిన్నర కప్పు, కొత్తిమీర- నాలుగు చెంచాలు, అల్లం ముక్క- చిన్నది, పచ్చిమిర్చి- రెండు, గోధుమపిండి- రెండు కప్పులు, జీలకర్ర- చెంచా, గరంమసాలా- అరచెంచా, ఆమ్‌చూర్‌- అరచెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత
తయారీ: బఠానీలు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బఠానీ కనిపించాలి అనుకొంటే కొద్దిగా బరకగా పట్టుకోవచ్చు. ఇప్పుడు గోధుమ పిండిలో జీలకర్ర, గరంమసాలా, ఉప్పు, ఆమ్‌చూర్‌పొడి, నూనె వేసుకుని అన్నింటినీ కలిపి ఆ తర్వాత బఠానీ పేస్ట్‌ కూడా వేసుకుని కొద్దిగా నూనె కూడా వేసుకుని ముద్ద చేసుకోవాలి. దీన్ని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలు కాల్చుకోవడమే.  రైతాతో తింటే బాగుంటాయి.


పనీర్‌తో..

కావాల్సినవి: పనీర్‌- 2 కప్పులు, కారం- అరచెంచా, గరంమసాలా- పావుచెంచా, ఉప్పు- తగినంత, అల్లం తురుము- చెంచా, కొత్తిమీర తురుము- నాలుగు చెంచాలు, ఆమ్‌చూర్‌- అరచెంచా, గోధుమపిండి- కప్పు, నూనె- తగినంత, నెయ్యి- కొద్దిగా
తయారీ: పనీర్‌ని గ్రేటర్‌ సాయంతో పలుకులుగా తురుముకొని దానిలో కారం, గరంమసాలా, ఆమ్‌చూర్‌, ఉప్పు, అల్లం తురుము, కొత్తిమీర వేసి అన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసి చపాతీపిండిని కలిపి దానిపై ఓ తడి నాప్కిన్‌వేసి, ఇరవైనిమషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెంచా చొప్పున పనీర్‌ మిశ్రమం తీసుకుని చపాతీలో పెట్టి అంచులని మూసేయాలి. ఈ చపాతీలని పనీర్‌ చెదిరిపోకుండా నెమ్మదిగా ఒత్తుకుని రెండువైపులా కాల్చుకుంటే పనీర్‌ పరాటా రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని