Updated : 08 Jan 2023 06:25 IST

దేశమంతా రుచుల వేడుక!

తెలుగోళ్లకి పెద్దపండగ. తమిళులకు... పొంగల్‌. కన్నడిగులకు సుగ్గీహబ్బా. కేరళీయులకు మకర సంక్రాంతి. పేరు ఏదైనా దేశమంతా చేసుకొనే పంటల పండగ. ఈ సంబరాల వేళ ఆయా ప్రాంతాల్లో తేలిగ్గా చేసుకొనే పిండి వంటలివి...


పిన్ని(పంజాబ్‌)

 

కావాల్సినవి: గోధుమపిండి- 500గ్రా, పాలు- ఏడు చెంచాలు, నెయ్యి- 550గ్రా, యాలకుల పొడి- చెంచాన్నర, పంచదార-450గ్రా

తయారీ: అడుగు మందంగా ఉండే కడాయిని ఇందుకు ఎంచుకోవాలి. దీనిని పొయ్యిమీద పెట్టి వేడెక్కాక నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇందులో గోధుమపిండిని వేసి ఎర్రగా అయ్యేంతవరకూ వేయించుకోవాలి. ఈ పిండిని వేరొక పాత్రలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత యాలకులపొడి, పంచదార వేసుకుని బాగా కలిపి పాలు కూడా వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. రుచి, బలం కూడా.


లాయి పట్టీ(బిహార్‌)

కావాల్సినవి: కరకరలాడే మరమరాలు- మూడు కప్పులు, నెయ్యి- చెంచా, బెల్లం- కప్పు

తయారీ: తక్కువ మంట మీద మరమరాలని వేయించుకుని కరకరలాడుతుంటే తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద కడాయి పెట్టుకుని అందులో చెంచా నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక బెల్లం తురుము వేసుకోవాలి. అది కరిగాక తక్కువమంట మీద ఉంచి గరిటెతో బాగా కలియతిప్పాలి. కొద్దిగా బెల్లం పాకం తీసుకుని నీటిలో వేసి చూడండి. అది పాకిపోకుండా చక్కగా ఉండకడుతుంటే మీకు కావాల్సిన విధంగా బెల్లం పాకం సిద్ధమైనట్టే. స్టౌ కట్టేసి అప్పుడు మరమరాలు కలపాలి. వాటికి బెల్లం బాగా పట్టాక వేడి చల్లారకముందే అరచేతులకు నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకోవడమే.


బైంగన్‌ బజ్జీ(పశ్చిమ బంగ)

కావాల్సినవి: సెనగపిండి- కప్పు, బియ్యప్పిండి- చెంచా, కారం- చెంచా, ఇంగువ- చిటికెడు, బేకింగ్‌ సోడా- పావుచెంచా కంటే తక్కువ, ఉప్పు- రుచికి తగినంత, సన్నగా పొడవుగా ఉండే వంకాయలు- రెండు, నీళ్లు- తగినన్ని, నూనె- కప్పున్నర

తయారీ: సెనగపిండి, బియ్యప్పిండిని జల్లించి ఉండల్లేకుండా చూసుకోవాలి. ఇందులో ఉప్పు, ఇంగువ, కారం, బేకింగ్‌సోడా వేసి నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని సిద్ధం చేసుకోవాలి. వంకాయల్ని సన్నని స్లైసులుగా తరిగి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక వంకాయ ముక్కల్ని పిండిలో ముంచి బజ్జీల్లా వేసుకోవడమే. కరకరలాడే వంకాయ బజ్జీలు భలే రుచిగా ఉంటాయి.


మాద్లి(కర్ణాటక)

కావాల్సినవి: గోధుమపిండి- కప్పు, బొంబాయి రవ్వ- పావుకప్పు, సెనగపిండి- చెంచా, బెల్లం- అరకప్పు, నువ్వులు- రెండు చెంచాలు, కొబ్బరి కోరు- పావుకప్పు, గసగసాలు- చెంచా, పుట్నాలపప్పు- రెండు చెంచాలు, యాలకులు- రెండు, ఉప్పు- అరచెంచా, శొంఠిపొడి- పావుచెంచా,

తయారీ: కడాయిలో గసగసాలు, నువ్వులని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో గోధుమపిండి, సెనగపిండి, బొంబాయిరవ్వ, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలపాలి. వీటిని చిన్న ఉండలుగా చేసి చపాతీల మాదిరిగా ఒత్తుకుని మెత్తగా కాకుండా పెళుసుగా అయ్యేలా కాల్చుకోవాలి. ఇవి వేడిగా ఉండగానే చపాతీల కర్రతో ఒత్తుకుంటే ముక్కలైపోతాయి. ఈ చపాతీ ముక్కల్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో బెల్లం కూడా వేసి మరోసారి మర పట్టించుకోవాలి. ఇప్పుడు దానిని ఒక గిన్నెలో తీసుకుని అందులో యాలకులపొడి, శొంఠిపొడి, వేయించిన నువ్వులు, గసగసాలు, కొబ్బరికోరు, పుట్నాలు వేసుకొని కలిపితే రుచికరమైన మాద్లీ సిద్ధం.


చెన్నాపొడ(ఒడిశా)

కావాల్సినవి:  పాలు- రెండు లీటర్లు, నిమ్మరసం- రెండు చెంచాలు, పంచదార- పావుకప్పు, బొంబాయి రవ్వ- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా, జీడిపప్పు పలుకులు- ఐదు చెంచాలు, బాదం పలుకుల- రెండు చెంచాలు, ఎండుద్రాక్షలు- రెండు చెంచాలు, యాలకులపొడి- పావుచెంచా

తయారీ: పాలల్లో నిమ్మరసం వేసి విరగొట్టుకోవాలి. దానిని శుభ్రమైన వస్త్రంలో వేసి గట్టిగా పిండి నీటిని వడకట్టేయాలి. లేదంటే బజారులో దొరికే పనీర్‌ పావుకిలో తెచ్చుకొన్నా సరిపోతుంది. దీనిని బాగా చిదుముకొని ఇందులో పంచదార, రెండు చెంచాల రవ్వ వేసుకోవాలి. పంచదార అంతా కరిగేవరకూ చేత్తో మెత్తగా చిదుముకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి కేక్‌కి పిండి కలుపుకొన్నట్టుగా కలపాలి. ఆ తర్వాత చెంచా నెయ్యి, బాదం పలుకులు, జీడిపప్పు పలుకుల, యాలకుల పొడి వేసుకోవాలి. అవెన్‌ని ప్రీ హీట్‌ చేసుకుని ఒక పాత్రలో ఈ పిండిని వేసుకుని పదిహేను నిమిషాలపాటు హీట్‌ చేసుకోవాలి. లేదంటే తక్కువ మంట మీద కుక్కర్‌లో విజిల్‌ లేకుండా కూడా ఉడికించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని