పాలు పొంగిద్దాం!

పండగ అంటే.. పాయసం పక్కా కదా! మరి ఎప్పుడూ ఒకే రకం వడ్డిస్తారా?.. ఈసారి కాస్త వెరైటీగా ప్రయత్నిద్దాం.

Updated : 15 Jan 2023 02:45 IST

పండగ అంటే.. పాయసం పక్కా కదా! మరి ఎప్పుడూ ఒకే రకం వడ్డిస్తారా?.. ఈసారి కాస్త వెరైటీగా ప్రయత్నిద్దాం. పసందైన పాయసాలతో అతిథులని అలరిద్దాం..  


గసగసాలతో

కావల్సినవి: గసగసాలు- 50గ్రా, కొబ్బరి తురుము- అర కప్పు, నీళ్లు- ఒకట్నిర కప్పు, యాలకుల పొడి- పావుచెంచా, నెయ్యి - మూడు చెంచాలు, జీడి పప్పులు- పది, బాదం పప్పులు- 5, ఎండు ద్రాక్షలు- 10, చక్కెర-100గ్రా

తయారీ: అడుగు మందంగా ఉండే పాత్రలో కాస్త నెయ్యి వేసి, వేడెక్కాక గసగసాలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని, చల్లార్చి పెట్టుకోవాలి. వీటికి కొబ్బరి తురుముని చేర్చి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టుకుని చెంచా నెయ్యి వేసుకొని వేడెక్కాక అందులో రుబ్బిన గసగసాలపేస్ట్‌ వేసి ఉండ కట్టకుండా గరిటెతో కలపాలి. 15 నిమిషాలపాటు ఉడకనిచ్చాక అది చిక్కగా అవడం మొదలవుతుంది. మరో స్టౌ పై చిన్న ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టుకొని నెయ్యి పోసి అందులో జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు, బాదం పలుకుల్ని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుకొని పాయసంలో పోయాలి. అలాగే యాలకుల పొడి వేసి బాగా కలిపితే.. రుచికరమైన గసగసాల పాయసం సిద్దం.


గోధుమరవ్వ పాయసం

కావల్సినవి: నెయ్యి- చెంచా, గోధుమ రవ్వ (వేయించుకోవడానికి)- రెండు చెంచాలు, ఎర్ర గోధుమ రవ్వ- అర కప్పు, సగ్గుబియ్యం- పావుకప్పు(ఉడకబెట్టినవి), నీళ్లు- చెంచాన్నర, బెల్లం - కప్పు( తురిమినది) కొబ్బరి పాలు- 2 కప్పులు, యాలకులపొడి- చెంచా, జీడిపప్పులు- పది, ఎండు ద్రాక్షలు- 12

తయారీ: స్టౌపై కడాయి పెట్టి నెయ్యి పోసి వేడెక్కాక రెండు చెంచాల గోధుమ రవ్వని 2 నిమిషాలు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అరకప్పు గోధుమ రవ్వ, బెల్లం, నీళ్లు కుక్కర్‌లో పోసి స్టౌ మీద ఉంచి కుక్కర్‌కు మూత పెట్టి 2 విజిల్స్‌ రానివ్వాలి.. విజిల్‌ వచ్చాక పాన్లో ఉడికించిన గోధుమ రవ్వ పోసి, అందులో ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసి 5-10 నిమిషాలు బాగా చిక్కబడే వరకు ఉడికించాలి. అందులో కొబ్బరి పాలు పోసి కాసేపు ఉడికించి యాలకుల పొడి చల్లి మరొక్కసారి కలపాలి. చివరిగా మరో చిన్న పాన్‌లో నెయ్యి పోసి జీడిపప్పు, ద్రాక్ష వేయించి ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి. అలాగే  ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమరవ్వని కూడా దీనిపై చల్లుకోవాలి. అంతే రుచికరమైన గోధుమ రవ్వ పాయసం సిద్ధం.


పన్నీర్‌తో..

కావల్సినవి: తరిగిన పన్నీర్‌- కప్పు, పాలు- లీటరు, చిక్కటి పాలు- ముప్పావుకప్పు, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలు- 10, యాలకుల పొడి- చెంచా, చక్కెర- 75గ్రా

తయారీ: స్టౌ వెలిగించి కడాయి పెట్టుకుని తరిగిన పనీర్‌ని కొద్దిగా వేడి చేసుకొని పాలను పోసుకోవాలి. 5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. చక్కెర, యాలకుల పొడి, తరిగిన బాదం, జీడిపప్పు పలుకులని వేసుకోవాలి. చివరిగా తరిగిన బాదం, ఎండుద్రాక్షలతో అలంకరించుకుని వడ్డించుకోవాలి.


డ్రైఫ్రూట్స్‌తో...

కావల్సినవి:.పాలు- లీటర్‌, ఆప్రికాట్స్‌- పది, పిస్తా- పది, చక్కెర- కప్పు, కుంకుమ పువ్వు- ఆరు పలుకులు, బాదం- ఎనిమిది, ఎండు ద్రాక్షలు- పది, ఎండు అంజీరాలు- ఐదు, యాలకుల పొడి- చెంచా, నెయ్యి- తగినంత  

తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి, ఆప్రికాట్లు, ఎండుద్రాక్షలు, అంజీర్‌ పండ్లని 10 నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాలను మరిగించుకొని అందులో యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసుకుని మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. పైన సిద్ధం చేసుకున్న పండ్లను చిన్న ముక్కలుగా కట్‌ చేసి పాలలో కలిపి, 5 నిమిషాలు ఉడికించాలి. తరువాత పాలలో కప్పు చక్కెర వేసి కలిశాక, బాదం, పిస్తా పలుకులు వేసి ఉడికించుకుని పై నుంచి కాస్త నెయ్యి వేసి సర్వ్‌ చేసుకోవడమే.


బాదం, మీగడ పాయసం...

కావల్సినవి: చక్కెర- 100 గ్రా, పొట్టు తీసిన బాదం- 5 నుంచి 6, బాస్మతి బియ్యం- 50గ్రా, యాలకుల పొడి- చెంచా, కుంకుమ పువ్వు- కొన్ని రేకులు, పాలు -350గ్రా, చిక్కటి పాలు- 100గ్రా, మీగడ- 50గ్రా,

తయారీ: బియ్యాన్ని పావుగంట పాటు నాననివ్వాలి. ఒక కడాయి తీసుకుని పాలు పోసి పది నిమిషాలపాటు మరగనివ్వాలి. నానిన బియ్యాన్ని పోసి బాగా కలిపి 10 నిమిషాలు అన్నాన్ని ఉడకనివ్వాలి. అన్నం మెత్తగా ఉన్నప్పుడు, పాలు, మీగడ, బాదం పప్పులు, యాలకుల పొడి, చక్కెర వేసుకుని రెండు నిమిషాల పాటు కలపాలి. పాయసాన్ని దింపేముందు కుంకుమపువ్వుని అలంకరించి సర్వ్‌ చేసుకోవడమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని