కూరండి.. తినండి!

గుత్తొంకాయ కూరముందు ఏ రుచైనా బలాదూరే అంటారు వంకాయ అభిమానులు. అదే రుచితో చవులూరించే గుత్తి బెండకాయ, ఉల్లిపాయ రుచులు గురించి విన్నారా?

Updated : 22 Jan 2023 02:46 IST

గుత్తొంకాయ కూరముందు ఏ రుచైనా బలాదూరే అంటారు వంకాయ అభిమానులు. అదే రుచితో చవులూరించే గుత్తి బెండకాయ, ఉల్లిపాయ రుచులు గురించి విన్నారా? మసాలాతో పాటు ప్రేమనీ, రుచినీ కూడా కూరి, ఇలా ప్రేమగా వడ్డించేయండి..


బెండకాయతో..

కావాల్సినవి: బెండకాయలు- పావుకిలో, నూనె- రెండు చెంచాలు, స్టఫింగ్‌ మసాలా కోసం: వేయించి, పొడి కొట్టుకున్న పల్లీలు- మూడు చెంచాలు, ధనియాల పొడి- చెంచా, జీలకర్ర పొడి- చెంచా, పసుపు- పావు చెంచా, కారం- చెంచా, గరంమసాలా- అరచెంచా, ఆమ్‌చూర్‌ పొడి- అరచెంచా, సోంపు పొడి- అరచెంచా, ఉప్పు- తగినంత, నూనె- రెండు చెంచాలు
తయారీ: బెండకాయల్ని కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. రెండు చివర్లు తీసేసి చాకుతో నిలువుగా గాటు పెట్టుకోవాలి. ఒక పాత్రలో పల్లీపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, పసుపు, గరంమసాలా, ఆమ్‌చూర్‌, సోంపు పొడి, ఉప్పు, చెంచా నూనె వేసి అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని నిలువుగా చీల్చిన బెండకాయల్లో నింపాలి.
బెండకాయలకి అన్నివైపులా నూనె రాసి పెట్టుకోవాలి. స్టౌపై పాన్‌ పెట్టి, వేడెక్కాక సన్నమంట మీద ఉంచాలి. బెండకాయల్ని స్టఫింగ్‌ ఉన్న వైపు పెట్టి వేగనివ్వాలి. కాసేపటి తర్వాత అన్నివైపులకీ తిప్పుతూ వేగనివ్వాలి. లేత బెండకాయల్ని ఎంచుకుంటే త్వరగా ఉడుకుతాయి.


స్టఫ్డ్‌ బేబీ ఆనియన్‌

కావాల్సినవి: ఉల్లిపాయల స్టఫింగ్‌ కోసం: చిన్న ఉల్లిపాయలు లేదా సాంబార్‌ ఉల్లి- 15, పసుపు- పావు చెంచా, కారం- అర చెంచా, గరంమసాలా- అరచెంచా,  ఉప్పు- తగినంత. కూర కోసం: నూనె- 2 చెంచాలు, ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- అరచెంచా, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెబ్బ, మామూలు ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- మూడు, అల్లం- చిన్నముక్క, పసుపు- పావు చెంచా, కారం- చెంచా, ధనియాలపొడి- చెంచా, గరంమసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, క్యాప్సికమ్‌ మిర్చి- సగం ముక్క, టొమాటో గుజ్జు- కప్పున్నర, పెరుగు- పావు కప్పు, నీళ్లు- అరకప్పు, కసూరీమేథి- అరచెంచా
తయారీ: చిన్న ఉల్లిపాయలపై పొట్టు తీసేసి ఎక్స్‌ ఆకారంలో చాకుతో కోసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారం, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. దీన్ని ఉల్లిపాయలకు పట్టించి పావుగంట పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని.. నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం పలుకులు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరంమసాలా, ఉప్పు వేసి మంచి వాసన వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్‌ ముక్కలని క్యూబ్స్‌లా తరిగి, ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అందులో టొమాటో ప్యూరీ వేసుకుని నూనె వేరయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత చిలికిన పెరుగు కలపాలి. బాగా ఉడికిన తర్వాత కాసిని నీళ్లుపోసి స్టఫ్‌ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మూతపెట్టి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కసూరీమేథి వేసి దింపేయడమే.


బర్వా మిర్చి

కావాల్సినవి: ఉడికించి, మెత్తగా చిదిమిన బంగాళా దుంపలు- కప్పు, ఉల్లిపాయ- 1, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, కారం- అర చెంచా, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- పావు చెంచా, పసుపు- తగినంత, గరంమసాలా- పావుచెంచా, ఉప్పు- తగినంత, పెద్దగా ఉండే బజ్జీ మిర్చీలు- ఆరు, నూనె- చెంచాన్నర, పనీర్‌- చెంచాన్నర
తయారీ: బంగాళాదుంపల్ని ఉడికించి నీళ్లు వార్చి వాటిని మెత్తగా చిదుముకోవాలి. ఒక గిన్నెలో కప్పు చిదిమిన బంగాళాదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి అన్నింటినీ కలపాలి. మిర్చీలని నిలువునా చీల్చుకుని గింజలు తీసేయాలి. వీటిల్లోకి కలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఖాళీ లేకుండా కూరాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని నూనె పోసి వేడెక్కాక, మిర్చీలని ఉంచాలి. మూత పెట్టి నాలుగైదు నిమిషాలు సన్నమంట మీద అన్నివైపులా కాల్చాలి. అంతే బర్వా మిర్చీ సిద్ధం. నచ్చితే స్వీట్‌కార్న్‌ కూడా కలపొచ్చు. బిర్యానీలోకి సైడ్‌ డిష్‌గా బాగుంటుంది.


గుత్తి బీరకాయ


కావాల్సినవి: బీరకాయలు- అరకిలో, ఉల్లిపాయ ముద్ద- కప్పు, టొమాటో గుజ్జు- కప్పు, పల్లీపొడి- కప్పు, నువ్వుల పొడి- అరకప్పు, ఎండు కొబ్బరి తురుము- అరకప్పు, మినపప్పు- చెంచా, ఆవాలు- చెంచా, ఎండుమిర్చి- రెండు, జీలకర్ర- చెంచా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ధనియాలపొడి- చెంచా, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, కారం- రెండు చెంచాలు, నూనె- నాలుగు చెంచాలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
తయారీ: బీరకాయల్ని కడిగి చెక్కు తీసి, పెద్ద ముక్కలుగా కోసి మధ్యలో గుజ్జుని చెంచాతో తీసేయాలి. అప్పుడవి గొట్టాల్లా ఉంటాయి. ఒక గిన్నెలో ఉల్లిపాయముద్ద, టొమాటోగుజ్జు, పల్లీపొడి, నువ్వులపొడి, ఎండుకొబ్బరి తురుము, కారం, ఉప్పు వేసి ముద్దగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బీరకాయ ముక్కల్లో కూరాలి. కుక్కర్‌ని స్టౌపై పెట్టి.. నూనెపోసి వేడెక్కాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. తర్వాత బీరముక్కలు ఉంచాలి. బీరముక్కల్లో స్టఫ్‌ చేయగా మిగిలిన గుజ్జుని ఈ ముక్కలపై వేసి కుక్కర్‌మూత పెట్టేయాలి. రెండు విజిల్స్‌  రాగానే కట్టేసేయొచ్చు. రుచికరమైన గుత్తిబీరకాయ రెడీ.


టొమాటో భర్వా

కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- మూడు, ఉప్పు- తగినంత, కారం- రెండు చెంచాలు, ధనియాలపొడి- రెండు చెంచాలు, పసుపు- అరచెంచా, ఆమ్‌చూర్‌పొడి- అరచెంచా, పచ్చిమిర్చి- 1, సోంపు- అరచెంచా, టొమాటోలు- ఆరు, నూనె- రెండు చెంచాలు, జీలకర్ర- అరచెంచా, ఆవాలు- పావుచెంచా, కొత్తిమీర- కొద్దిగా
తయారీ: ఉడికించిన బంగాళాదుంపల్ని మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. దీనికి కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఆమ్‌చూర్‌, సోంపు వేసి అన్నింటినీ కలపాలి. ఇప్పుడు టొమాటోలని శుభ్రం చేసి ముచ్చికల దగ్గర, చాకుతో కోసి లోపలి గుజ్జుని  తీసి పక్కన పెట్టుకోవాలి. టొమాటోల్లో బంగాళాదుంప మిశ్రమాన్ని  నింపాలి. స్టౌపై పాన్‌ పెట్టి, నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి అవి కూడా వేగాక టొమాటోలని ఉంచి మూతపెట్టేయాలి. టొమాటోల్లోంచి తీసిన గుజ్జులో బంగాళాదుంప మిశ్రమాన్ని కొద్దిగా కలిపి దీనిని మెత్తగా మిక్సీ పట్టి పాన్‌లో వేసుకోవాలి. దీనికి కాసిని నీళ్లు, కారం, పసుపు, ధనియాలపొడి, ఉప్పు వేసి మూత పెట్టి టొమాటోలని ఉడికించుకుంటే కూర సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని