Updated : 29 Jan 2023 00:23 IST

చపాతీ చేయండి.. బిర్యానీలో వేయండి!

క్యాలీఫ్లవర్‌ చుట్టూ ఉండే ఆకులు కూడా వండుకోవచ్చని, ఆరోగ్యకరమని విన్నాను. నిజమేనా? వాటిని ఎలా వండుకోవాలి?      

పద్మావతి, నెల్లూరు

నిజమే క్యాలిఫ్లవర్‌ ఆకులు దాని పువ్వుకంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం నిండుగా ఉండే ఆహారం ఇది. అందుకే దీనిని కూరల్లో భాగం చేసుకోవచ్చు. తక్కిన ఆకుకూరలతో కలిపి వండుకోవచ్చు. లేదంటే పెసరపప్పుతోకానీ, కందిపప్పుతోకానీ కలిపి వండుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలతో తాలింపు వేసుకుని.. సన్నగా ఆకుని తరిగి తోటకూర వేపుడు చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు. మధ్యలో గట్టిగా ఉండే ఈనెలు తీసేసి తక్కిన ఆకుని సన్నగా తరిగి చపాతీ, పూరీ పిండిలో కలపొచ్చు. సన్నగా తురిమిన ఆకులని సూపులు, సలాడ్లలో కూడా వాడుకోవచ్చు. చింతపండు వేసి మగ్గించి పచ్చడిగా రుబ్బుకోవచ్చు. అలాగే వడలు, గారెల్లో కూడా కొత్తిమీరతోపాటు ఈ ఆకులని వేసుకోవచ్చు. ఉప్మా, కిచిడీ, బిర్యానీల్లో పుదీనా ఆకులు వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు. ఆకులని శుభ్రంగా కడిగి తుడిచి జిప్‌లాక్‌ బ్యాగులో వేస్తే ఐదురోజుల వరకూ నిల్వ ఉంటాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్‌ని నిరోధించే శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని పారేయకుండా వీలైనంతవరకూ వాడుకోవడానికే చూద్దాం.

శ్రీదేవి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు