వీటి దుంప తెంచండి..

ఘాటు ముల్లంగి పడందే సాంబార్‌కి రుచేది? పప్పుచారుకి.. కరకరలాడే చేమదుంప వేపుడు తోడయితే అద్భుతం అనాల్సిందే! ఇవేనా ఒక్కో దుంపది ఒక్కో రుచి. పోషకాల్లోనూ పైవరుసలో ఉండే వీటిని ఇలా వండుకుని చూడండి.

Published : 29 Jan 2023 00:04 IST

ఘాటు ముల్లంగి పడందే సాంబార్‌కి రుచేది? పప్పుచారుకి.. కరకరలాడే చేమదుంప వేపుడు తోడయితే అద్భుతం అనాల్సిందే! ఇవేనా ఒక్కో దుంపది ఒక్కో రుచి. పోషకాల్లోనూ పైవరుసలో ఉండే వీటిని ఇలా వండుకుని చూడండి...

మూలే పరోటా

కావాల్సినవి: గోధుమపిండి- 2 కప్పులు, నెయ్యి లేదా నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత

స్టఫింగ్‌ కోసం: ముల్లంగి- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, కారం- తగినంత, గరంమసాలా- పావుచెంచా

తయారీ: ముంద]ుగా ఉప్పు వేసుకుని చపాతీపిండిని కలిపి ఆ ముద్దని పక్కన పెట్టుకోవాలి. ముల్లంగిని, పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని పావుగంటపక్కన పెట్టేయాలి. ఆ తర్వాత దానిలోని నీరంతా పిండేసుకోవాలి. ఉప్పు, కారం, గరంమసాలా వేసి కలపాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకుని గుండ్రంగా ఒత్తుకొని దానిలో కొద్దిగా ముల్లంగి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకుంటే స్టఫ్‌ బయటకు వచ్చేస్తుంది. కాస్త చాలు. అంచులని మూసేసి వాటిని నెమ్మదిగా ఒత్తుకుని పెనంపై నెయ్యి లేక నూనెతో రెండువైపులా కాల్చుకోవడమే. వీటిని గడ్డ పెరుగుతోకానీ, మంచి పచ్చడితో కానీ తింటే భలే రుచిగా అనిపిస్తాయి.


కప్పా

కావాల్సినవి: కర్రపెండ్లం దుంపలు- రెండు, ఉప్పు- తగినంత గ్రైండ్‌ చేయడానికి: కొబ్బరి ముక్కలు- కప్పు, జీలకర్ర- చెంచా, వెల్లుల్లి రెబ్బలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, పసుపు- తగినంత తాలింపు కోసం: నూనె- రెండు చెంచాలు, ఆవాలు- చెంచా, ఉల్లిపాయలు- రెండు, ఎండుమిర్చి- మూడు, కరివేపాకు- రెబ్బ

తయారీ: కర్రపెండ్లంపైన తొక్క తీసేసి.. ముక్కలు చేసుకుని, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు వార్చి వాటిని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కడాయిలో రుబ్బిన కొబ్బరి మిశ్రమం, ఉడికించిన కర్రపెండ్లం ముక్కలు వేసుకుని కూర చిక్కగా అయ్యేంతవరకూ పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, ఎండుమిర్చితో తాలింపు వేసుకోవాలి. అందులో ఉల్లిపాయముక్కలు వేసుకుని అవి ఎర్రగా వేగాక కర్రపెండ్లం మిశ్రమం వేసుకుని కలిపి మరో ఐదారు నిమిషాలు ఉడికించుకుంటే కప్పా సిద్ధం.


దిల్లీ స్పెషల్‌ చిలగడ దుంపల చాట్‌

కావాల్సినవి: చిలగడ దుంపలు- 500గ్రా, కాలా చాట్‌ మసాలా- అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత, జీలకర్రపొడి- అరచెంచా, నల్ల ఉప్పు- అర చెంచా, పంచదార- చెంచా, దానిమ్మగింజలు- మూడు చెంచాలు, మీఠా చట్నీ- నాలుగు చెంచాలు

తయారీ: చిలగడ దుంపల్ని శుభ్రం చేసి కుక్కర్‌లో మరీ మెత్తగా కాకుండా చక్కని పదునులో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసి... ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  ఈ ముక్కలకి నల్లుప్పు, మామూలు ఉప్పు, జీలకర్ర పొడి, చాట్‌మసాలా, పంచదార వేసుకుని కలపాలి. ఆఖరుగా మీఠాచట్నీ వేసుకుని కలపాలి. దానిపై దానిమ్మగింజలు వేసుకుని అలంకరించుకుంటే చాట్‌ సిద్ధం.

మిఠాచట్నీ: అర కప్పు చింతపండు గుజ్జుకి కప్పు బెల్లం, తగినంత ఉప్పు, అర చెంచా కారం, పావుచెంచా జీలకర్రపొడి వేసి ఉడికించుకుంటే మీఠాచట్నీ సిద్ధం.


ముల్లంగి పచ్చడి

కావాల్సినవి: ముల్లంగి తురుము- కప్పు, నూనె- నాలుగు చెంచాలు, సెనగపప్పు- చెంచా, ఎండుమిర్చి- ఐదు, చింతపండు- కొద్దిగా, ఉప్పు- తగినంత, వెల్లుల్లి- 4రెబ్బలు, ఉల్లిపాయ- ఒకటి, ఆవాలు- అరచెంచా, కరివేపాకు- రెబ్బ,

తయారీ: ఒక పాన్‌లో కొద్దిగా నూనె పోసి అందులో సెనగపప్పు, ఎండు మిర్చి, చింతపండు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పాన్‌లోనే మరికాస్త నూనె పోసుకుని అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి వచ్చేంతవరకూ వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మరో చెంచా నూనె వేసి వేడెక్కాక అందులో ముల్లంగి తురుము, ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. మిక్సీలో వేయించిన సెనగపప్పు, మిర్చి, చింతపండు, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి తరుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరిగా ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.


చామదుంపల వేపుడు

కావాల్సినవి: చామదుంపలు- పావుకిలో, బియ్యప్పిండి- చెంచా, మైదా- చెంచా, మొక్కజొన్న పిండి- చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, కారం- చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అరచెంచా జీలకర్రపొ డి- పావు చెంచా, ధనియాలపొడి- చెంచా, గరంమసాలా- పావు చెంచా, నూనె- తగినంత, ఉల్లిపాయలు- రెండు

తాలింపుకోసం: సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బ.

తయారీ:  చామ దుంపల్ని కుక్కర్‌లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించుకుని పొట్టు తీసేయాలి. ఒక గిన్నెలోకి బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, మైదా, అల్లంవెల్లుల్లి, ఉప్పు, కారం, గరంమసాలా, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఇందులో ఉడికించిన దుంపల్ని వేసి అన్నింటికీ మిశ్రమం పట్టేలా కలపాలి. వీటిని నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కాస్త నూనె వేసుకుని అందులో పైన చెప్పిన తాలింపు గింజలు వేసుకుని అందులో మిక్సిలో కచ్చాపచ్చాగా దంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చామదుంప ముక్కల్ని కూడా వేసి బాగా కలిపితే కరకరలాడే చామదుంపల వేపుడు సిద్ధమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని