ఆరోగ్యం.. సల్లగుండ!

ఎండాకాలం అంటే చల్లని మజ్జిగే గుర్తుకొస్తుంది! ఈ మజ్జిగతో కమ్మని కూరలు కూడా చేసుకోవచ్చు.. శరీరానికి చల్లదనాన్ని... పోషకాలని అందించే ఆ కూరలేంటో చూద్దాం రండి.

Published : 19 Feb 2023 00:10 IST

ఎండాకాలం అంటే చల్లని మజ్జిగే గుర్తుకొస్తుంది! ఈ మజ్జిగతో కమ్మని కూరలు కూడా చేసుకోవచ్చు.. శరీరానికి చల్లదనాన్ని... పోషకాలని అందించే ఆ కూరలేంటో చూద్దాం రండి..  


సొరకాయ చల్లపులుసు

కావాల్సినవి: లేత సొరకాయ ముక్కలు- పావుకప్పు, మునక్కాడ ముక్కలు- మూడు, ఉల్లిపాయ- 1, పసుపు- కొద్దిగా, పెరుగు- రెండు కప్పులు, నీళ్లు- కప్పు, కొబ్బరికోరు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, ఆవాలు- పావు చెంచా, మెంతులు- పావు చెంచా, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- రెబ్బ, ఎండుమిర్చి- 2, నూనె- అరచెంచా

తయారీ: కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. పెరుగుని ఉండల్లేకుండా చిలికి పెట్టుకుని ఇందులో కొబ్బరి పేస్ట్‌ కలపాలి. సొరకాయ, మునక్కాడ ముక్కల్ని పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. స్టౌపై కడాయిపెట్టి నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి  వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు కూడా వేసి ఎర్రగా అయ్యేంతవరకూ వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కల్ని కలపాలి. అవన్నీ బాగా కలిపాక స్టౌ కట్టేసి కొద్దిగా వేడి చల్లారనిచ్చి చిలికిన పెరుగుని ఇందులో కలిపి మూత పెట్టేయాలి. ఓ ఐదునిమిషాలకు ఆ వేడికి చక్కని సొరకాయ చల్ల పులుసు సిద్ధమవుతోంది.


సెనగపిండితో

కావాల్సినవి: బెండకాయలు- ఆరు, వంకాయ- 1, ఉల్లిపాయ- 1, బంగాళాదుంప- 1, సొరకాయ ముక్కలు- పావు కప్పు, క్యారెట్‌- 1, చిక్కటి మజ్జిగ- 3 కప్పులు, సెనగపిండి- 4 చెంచాలు, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి పేస్ట్‌- చెంచా, నూనె- నాలుగు చెంచాలు

తయారీ: స్టౌ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు వేసి వేగాక.. కాయగూర ముక్కలు, పచ్చిమిర్చిపేస్ట్‌ వేసి వేయించి కాసిని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంతవరకూ ఉడకనివ్వాలి. చిలికి పెట్టుకున్న పెరుగులో సెనగపిండి వేసి ఉండల్లేకుండా కలపాలి. ఈ పెరుగుని కాయగూరల్లో వేసి ఉడికించుకోవాలి. అన్నం, జొన్నరొట్ట్టె, చపాతీల్లోకి బాగుంటుందీ కూర.  


ఆంధ్ర మజ్జిగ పులుసు

కావాల్సినవి: పెరుగు- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, నీళ్లు- రెండు కప్పులు, నెయ్యి- చెంచా, మినపప్పు- అరచెంచా, సెనగపప్పు- అరచెంచా, జీలకర్ర- అరచెంచా, మెంతులు- పావుచెంచా, ఎండుమిర్చి-1, కరివేపాకు- రెబ్బ, వెల్లుల్లి- రెండు, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- రెండు, ఉల్లిపాయ- 1, పసుపు- పావుచెంచా

తయారీ: పెరుగులో తగినంత ఉప్పు, నీళ్లు వేసి చిలికి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌ పెట్టుకుని అందులో నెయ్యి వేసి  ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపుతో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనిచ్చి చివరిగా పసుపు వేసి దింపేయాలి. చల్లారాక చిలికి పెట్టుకున్న మజ్జిగ కూడా వేసి కలిపితే రుచికరమైన ఆంధ్రా స్టైల్‌ మజ్జిగ పులుసు సిద్ధం.


తోటకూరతో..

కావాల్సినవి: తోటకూర కట్టలు-2, పెరుగు- అర లీటరు, నీళ్ళు- పావు లీటరు, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- రెబ్బ, ఉప్పు- తగినంత, అల్లం- చిన్నముక్క, వెల్లులి- 5 రెబ్బలు, ఆవాలు- చెంచా, జీలకర్ర- చెంచా, మెంతులు- అర చెంచా, సెనగపప్పు- చెంచా, మినపప్పు- చెంచా, ఎండుమిర్చి- రెండు, పసుపు- పావుచెంచా, నూనె-
2 చెంచాలు,

తయారీ: అల్లం, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత తోటకూర తరుగు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 3-4 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. కాసిని నీళ్ళు పోసి మూత పెట్టి సన్నమంట మీద పొడిగా పొడిగా అయ్యేదాకా పూర్తిగా మగ్గనిచ్చి దింపేయాలి. పెరుగుని బాగా చిలికి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి అందులో చల్లార్చుకున్న తోటకూర వేసి కలిపితే కూర రెడీ.


మెంతి మజ్జిగ

కావాల్సినవి: పెరుగు- కప్పు, నీళ్లు- అరకప్పు, తాలింపు కోసం: నూనె- చెంచా, మినపప్పు- అరచెంచా, ఆవాలు- అరచెంచా, జీలకర్ర- చెంచా, మెంతులు- అరచెంచా, వాము- అరచెంచా, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- రెబ్బ, ఉప్పు- రుచికి తగినంత

తయారీ: పెరుగుని ఉండల్లేకుండా చిలికి పెట్టుకోవాలి. దీనికి తగినన్ని నీళ్లు, ఉప్పు కలపాలి. స్టౌ వెలిగించి, ఒక పాత్రలో కొద్దిగా నూనె పోసుకుని వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. మినపప్పు వేసి రంగు మారేంతవరకూ ఆగాలి. ఆ తర్వాత వాము, జీలకర్ర, మెంతి గింజలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టౌ కట్టేయాలి. తాలింపు చల్లారాక పెరుగు కలిపితే రుచికరమైన మెంతి మజ్జిగ సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు