సీమ చింత మేలు కొండంత!

సీమచింతకాయల పేరు విన్నారా! వీటినే గుబ్బకాయలు, పులిచింతకాయలు అని కూడా అంటారు. మీరు పల్లెటూళ్లో పుట్టుంటే వీటి గురించి వేరే పరిచయమే అవసరం లేదు.

Published : 30 Apr 2023 00:49 IST

సీమచింతకాయల పేరు విన్నారా! వీటినే గుబ్బకాయలు, పులిచింతకాయలు అని కూడా అంటారు. మీరు పల్లెటూళ్లో పుట్టుంటే వీటి గురించి వేరే పరిచయమే అవసరం లేదు. వేసవి సెలవుల్లో రోడ్లపై ఆడుకుంటూ వీటిని కోసుకొని తిన్న రోజులెన్నో ఉండి ఉంటాయి కదూ! ఈ కాలంలో విరివిగా దొరికే సీమచింత ఎంత రుచిగా ఉంటుందో.. అన్ని ప్రయోజనాలూ అందిస్తుంది. పచ్చివయితే వగరుగా, పండువైతే తియ్యగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు తెల్లగా, పక్వానికి వచ్చాక నిండు గులాబి రంగులో చూడటానికి భలే అందంగా ఉంటాయివి. పొలాల్లో, గట్లవెంబడి, రోడ్లపక్కన ఎక్కువగా దొరుకుతాయి. ఈ చెట్టు పొడవుగా ఉండి, ముళ్లతో ఉంటుంది. నీటి శాతం అధికంగా ఉండే వీటిలో పోషక విలువలు దండిగా ఉంటాయి. క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, నియాసిన్‌, విటమిన్‌ సి దీంట్లో అధికంగా ఉంటాయి. ఈ కాయలు తింటే నోట్లో వచ్చే పూత సమస్యలు తగ్గుతాయి. కాయలే కాదండోయ్‌ విత్తనాలూ పనికొస్తాయ్‌... నల్లగా ఉండే ఈ గింజల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. వీటిల్లో కొవ్వు శాతం తక్కువగానూ, ఫైబర్‌ ఎక్కువగానూ ఉంటుంది. కాబట్టి బరువు పెరుగుతారనే భయం లేకుండా డైటింగ్‌ చేసే వారూ హాయిగా తినొచ్చు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయి. గర్భిణులు వీటిని తీసుకుంటే కావల్సిన క్యాల్షియం అందుతుంది. నీరసాన్ని తగ్గించడమే కాకుండా, మలబద్ధకాన్నీ దూరం చేస్తుంది.


వేపుడు..

కావల్సిన పదార్థాలు: పచ్చి సీమ చింతకాయలు- పావుకేజీ, ఉల్లిపాయలు- రెండు (తరిగి పెట్టుకోవాలి), పచ్చిమిర్చి- నాలుగు, కరివేపాకు- రెబ్బ, వెల్లుల్లి- అయిదు రెబ్బలు దంచి పెట్టుకోవాలి, ఉప్పు- తగినంత, కారం- తగినంత, గుడ్డు- ఒకటి, తాలింపు గింజలు- చెంచా

తయారీ:  బాండీలో నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. దాంట్లో గింజలు తీసేసిన సీమ చింతకాయలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక గుడ్డు సొన వేసుకోవాలి. అదీ మగ్గాక ఉప్పు, కారం వేసి దింపుకోవటమే.. గుబ్బకాయల ఫ్రై రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని