పచ్చి పులుసుగా..రుచులు మెచ్చగా!

క్షణాల్లో వండేయొచ్చు.. నూనెలు, మసాలాల గోల ఉండదు. రుచిలో రాజీలేదు. దేని గురించి అనుకుంటున్నారా? తేలిగ్గా చేసుకునే పచ్చిపులుసు గురించి.

Updated : 04 Jun 2023 02:51 IST

క్షణాల్లో వండేయొచ్చు.. నూనెలు, మసాలాల గోల ఉండదు. రుచిలో రాజీలేదు. దేని గురించి అనుకుంటున్నారా? తేలిగ్గా చేసుకునే పచ్చిపులుసు గురించి. అలాగని అలుసొద్దండోయ్‌!  వేర్వేరు పదార్థాలతో చేసుకొనే ఈ పచ్చిపులుసులని మీరూ ప్రయత్నించండి...


పచ్చిమామిడితో

కావాల్సినవి: పచ్చి మామిడికాయలు- 2, నీళ్లు- 2 కప్పులు, ఉల్లిపాయ- 1(ముక్కలు), ఎండుమిర్చి- 2, పచ్చిమిర్చి- రెండు, నూనె- చెంచా, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- చెంచాన్నర, ఉప్పు- రుచికి తగినంత, బెల్లం- 2 చెంచాలు
తయారీ: కుక్కర్‌లో మామిడికాయలని తగినన్ని నీళ్లుపోసి మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క, టెంక తీసేసి గుజ్జుని వేరుచేసి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించి స్టౌ కట్టేయాలి. ఒక గిన్నెలోకి మామిడికాయ గుజ్జు, తగినంత నీరు, ఉప్పు, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలిపి.. దీనికి తాలింపు కలుపుకోవడమే. వేడి అన్నంలోకి బాగుంటుంది. పోషకాలపరంగానూ మంచిది.


పల్లీ పచ్చిపులుసు

కావల్సినవి: పల్లీలు- అరకప్పు, నల్ల నువ్వులు- చెంచా, బెల్లం- చెంచాన్నర, వెలుల్లి రెబ్బలు- నాలుగు, కారం- చెంచాన్నర, పసుపు- అర చెంచా, ధనియాల పొడి- 2 చెంచాలు, చింతపండు గుజ్జు- రెండు చెంచాలు, నీళ్లు-  2 కప్పులు, ఉప్పు- రుచికి తగినంత, నూనె- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఎండు మిరపకాయ- 1, ఆవాలు, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- 2 రెబ్బలు, కొత్తిమీర తరుగు- చెంచాన్నర
తయారీ: బాణలిలో పల్లీలని తక్కువ మంట మీద బాగా వేయించి చల్లారాక పొట్టు తీసుకోవాలి. వేయించిన పల్లీలు, నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలపొడి అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్‌ చేసి, తగినంత నీరు కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా కలపాలి. కడాయిలో నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇందులోకి గ్రైండ్‌ చేసిన మిశ్రమం, తగినంత ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే చాలు.
చివరిగా కొత్తిమీర తరుగు వేసుకుంటే వేడి అన్నంలోకి పల్లీ పులుసు బాగుంటుంది.


టొమాటోతో(ఒడియా స్టైల్‌)

కావాల్సినవి: టొమాటోలు- నాలుగు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి-2, కొత్తిమీర తరుగు- చెంచాన్నర, ఉడికించిన బంగాళాదుంప- ఒకటి, ఉప్పు- రుచికి తగినంత,
తయారీ: టొమాటోలని ఫోర్క్‌తో గుచ్చి గ్రిల్‌పైన ఉంచి స్టౌమీద పెట్టి అన్నివైపులా కాల్చుకోవాలి. ఇలా వెల్లుల్లిరెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆలుగడ్డని కూడా కాల్చాలి. ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కాలిన నల్లని పొరని చేత్తో తీసుకోవాలి. కొత్తిమీర తరుగుతోపాటు ఒక గిన్నెలోకి వీటిని తీసుకుని తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఈ పచ్చిటొమాటో పులుసుని పకాలీబాత్‌తో అంటే చద్దన్నంతో కలిపి తింటారు. రోటీల్లోకి కూడా బాగుంటుంది. ఆరోగ్యప్రదం కూడా.


నువ్వులు పచ్చిపులుసు

కావాల్సినవి: నువ్వులు - 50 గ్రా, పల్లీలు- 50 గ్రా, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, పచ్చి మిరపకాయలు- రెండు, ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర తరుగు- చెంచాన్నర, ఉప్పు- తగినంత, కారం- చెంచా, బెల్లం- చెంచాన్నర, చింతపండు గుజ్జు- 2 చెంచాలు
తయారీ: ముందుగా నువ్వులు, పల్లీలు, జీలకర్రని విడివిడిగా వేయించుకొని అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కావలసినంత చింతపండు గుజ్జు వేసుకుని, కావాల్సిన పరిమాణంలో నీళ్లు కలుపుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, బెల్లం వేసుకుంటే నువ్వుల పచ్చిపులుసు సిద్ధం. నోటికి రుచిగా చాలా బాగుంటుంది.


వంకాయతో

కావాల్సినవి: నూనె- 2 చెంచాలు, వంకాయలు- రెండు, పచ్చిమిర్చి- 4, నీళ్లు- తగినన్ని, ఆవాలు- అరచెంచా, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- రెబ్బ, పసుపు- పావుచెంచా, చింతపండు రసం- కప్పు, నువ్వులు- చెంచా, ఉల్లిపాయ- 1,
ఉప్పు - రుచికి తగినంత
తయారీ: వంకాయలని కాల్చడానికి గ్రిల్‌లాంటిదాన్ని తీసుకోవాలి. వంకాయలకి కొద్దిగా నూనెరాసి, పచ్చిమిర్చి కూడా తీసుకుని గ్రిల్‌పై ఉంచి అన్నివైపులా కాల్చుకోవాలి. ఇవి చల్లారాక పొట్టు తీసేసి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి స్టౌ కట్టేయాలి. ఒక గిన్నెలో చింతపండు రసం, తగినన్ని నీళ్లు, మెదిపిన వంకాయ, పచ్చిమిర్చి మిశ్రమం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి చివరిగా తాలింపు వేసి కలుపుకోవాలి. నువ్వులను వేయించి, చల్లారాక పొడికొట్టి దాన్ని పచ్చి పులుసులో వేసి కలపాలి. ఈ వంకాయ పచ్చిపులుసు అన్నంలోకి బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని