థోరన్‌ తిన్నారా..

మునగాకు పోషకాల గని, ఔషధాల నిధి. బలాన్నిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. 

Updated : 30 Jun 2024 11:40 IST

తోటకూర, పాలకూర వంటివి తరచూ తింటాం కానీ.. మునగాకును పెద్దగా పట్టించుకోం. నిజానికి ఇది పోషకాల గని, ఔషధాల నిధి. బలాన్నిస్తుంది, రోగనిరోధకశక్తిని పెంచుతుంది, ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. అంత మంచి మునగాకుతో ఈ వెరైటీలు చేసి చూడండి!

 

థోరన్‌

కావలసినవి: మునగాకు - 4 కప్పులు, కొబ్బరి తురుము - కప్పు, ఉల్లిపాయ ముక్కలు - కప్పున్నర, ఉప్పు - రుచికి సరిపడా, ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి తరుగు - చెంచా చొప్పున, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 3, కరివేపాకు - 2 రెబ్బలు
తయారీ: మునగాకును కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. మిక్సీ జార్‌లో కొబ్బరి తురుము, అర కప్పు ఉల్లిముక్కలు, పసుపు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి వేసి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు వేయాలి. అవి చిటపట లాడుతున్నప్పుడు జీలకర్ర, కరివేపాకు, మిగిలిన ఉల్లిముక్కలను జోడించాలి. అవి కాస్త వేగాక.. మునగాకు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ.. పది నిమిషాల తర్వాత కొబ్బరి మిశ్రమం జతచేయాలి. ఇంకో ఏడు నిమిషాల తర్వాత దించేస్తే.. ఘుమఘుమలాడే ‘మునగాకు థోరన్‌’ సిద్ధం.


మునగ మఖానా

కావలసినవి: ఫూల్‌ మఖానా - కప్పు, మునగాకు పొడి - టేబుల్‌ స్పూన్, నెయ్యి - రెండు చెంచాలు, ఛాట్‌ మసాలా - అర చెంచా, ఉప్పు - రుచికి సరిపడా
తయారీ: కడాయిలో మఖానాను కలియ తిప్పుతూ సన్న సెగ మీద వేయించాలి. నాలుగైదు నిమిషాల తర్వాత ఒకటి చేతిలోకి తీసుకుని నొక్కిచూడండి- సాగకుండా విరిగితే చక్కగా వేగినట్లు. వీటిని గిన్నెలోకి తీసి.. అదే కడాయిలో నెయ్యి, మునగాకు పొడి, ఛాట్‌ మసాలా, ఉప్పు, వేయించిన ఫూల్‌ మఖానా వేసి.. నిమిషం వేయించి దించేయండి. ఇది వేడిగా ఉన్నప్పుడే కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. తర్వాత తినాలనుకుంటే గాలి చొరబడని సీసాలో భద్రం చేయాలి.


మునగాకు పప్పు

కావలసినవి: కందిపప్పు, మునగాకు - కప్పు చొప్పున, ఉల్లి తరుగు - అర కప్పు, చింతపండు - నిమ్మకాయంత, పచ్చిమిర్చి ముక్కలు - టేబుల్‌ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర చెంచా, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, వెల్లుల్లి తరుగు - ముప్పావు చెంచా, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర - చెంచా చొప్పున, ఇంగువ - అర చెంచా
తయారీ: కందిపప్పు, మునగాకులను రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తెరిచి చారు గరిటెతో మెత్తగా మెదపాలి. దీనికి కొన్ని నీళ్లు, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, జోడించి ఉడికించాలి. రెండు పొంగులు వచ్చాక దించేయాలి. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేస్తే సరి.. రుచికరమైన మునగాకు పప్పు రెడీ.


ఆలూ మొరింగా సబ్జీ

కావలసినవి: మునగాకు - 2 కప్పులు, బంగాళదుంపలు - 3, ఉల్లితరుగు - పావు కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, తరిగిన పచ్చిమిర్చి - టేబుల్‌ స్పూన్, వెల్లుల్లి తరుగు - చెంచా, జీలకర్ర - ఒకటిన్నర చెంచా, గరంమసాలా - అర చెంచా, కారం - ముప్పావు చెంచా, పసుపు, ఇంగువ - పావు చెంచా చొప్పున
తయారీ: బంగాళదుంపలు చెక్కు తీసి, అంగుళమంత ముక్కలు కోయాలి. కడాయిలో నూనె వేడయ్యాక జీలకర్ర.. అది వేగాక.. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేయాలి. ఉల్లి దోరగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. నాలుగు నిమిషాల తర్వాత మునగాకు జతచేసి.. మధ్యమధ్యలో కలియ తిప్పుతూ ఇంకో ఆరేడు నిమిషాలు వేయించాలి. చివర్లో కారం, గరంమసాలా జోడించి కలియబెట్టి దించేస్తే సరిపోతుంది.


మునగాకు పచ్చడి

కావలసినవి: మునగాకు, కొబ్బరి తురుము - కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 8, అల్లం ముద్ద - చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - రెండు చెంచాలు, ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, ఇంగువ - పావు చెంచా
తయారీ: కడాయిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె కాగనిచ్చి పచ్చి మిర్చి, మునగాకులను ఒక నిమిషం వేయించాలి. ఎక్కువ వేగకూడదు. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి.. కొబ్బరి తురుము, అల్లం ముద్ద, ఉప్పు, అర కప్పు నీళ్లు జోడించి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మిగిలిన నూనె వేడిచేసి.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేసి, నిమ్మరసం కలిపితే సరి.. వహ్వా అనిపించే మునగాకు పచ్చడి తయారైపోతుంది.


పరోటా

కావలసినవి: గోధుమపిండి, మునగాకు - కప్పు చొప్పున, అల్లం ముద్ద - చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, జీలకర్ర, కారం, గరంమసాలా - అర చెంచా చొప్పున, వాము, పసుపు - పావు చెంచా చొప్పున, నూనె - చెంచా, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: మునగాకు కడిగి, పావుగంట నీళ్లలో ఉంచి, తర్వాత నీళ్లు తీసేయాలి. ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మునగాకు, అల్లం ముద్ద, ఉప్పు, జీలకర్ర, కారం, గరంమసాలా, వాము, పసుపు, నూనె వేసి కొన్ని నీళ్లతో బాగా కలపాలి. ఈ పిండిని ఒక అరగంట పక్కనుంచి, మరోసారి కలిపి.. చపాతీల కంటే కొంచెం మందంగా రొట్టెలు వత్తుకోవాలి. అన్నీ అయ్యాక.. పెనం వేడిచేసి.. నెయ్యితో పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. వీటికి చెట్నీ లేదా గ్రేవీ ఏదైనా బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని