నోరూరించే రూగడా..

రూగడా.. ఝార్ఖండ్‌ వాసుల వంటకం. దీన్ని ఫుటక లేదా పుటట అని కూడా అంటారు. ఇది మష్రూమ్‌ జాతికి చెందింది. పర్వతాల పైనా, ఆ చుట్టుపక్కలా పెరుగుతుంది.

Published : 07 Jul 2024 00:39 IST

రూగడా.. ఝార్ఖండ్‌ వాసుల వంటకం. దీన్ని ఫుటక లేదా పుటట అని కూడా అంటారు. ఇది మష్రూమ్‌ జాతికి చెందింది. పర్వతాల పైనా, ఆ చుట్టుపక్కలా పెరుగుతుంది. ఇదెలా చేయాలంటే- పావు కిలో రూగడాకి ఒక ఉల్లిపాయ, రెండు టొమాటోలు, అల్లం అంగుళం ముక్క, వెల్లుల్లి ఏడెనిమిది రెబ్బలు, మూడు పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, టేబుల్‌స్పూన్‌ నూనె, చెంచా చొప్పున మిరియాలపొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర తీసుకోవాలి. కాస్త పెద్ద శనగల్లా ఉండే రూగడాలను మూడుసార్లు కడిగి శుభ్రం చేయాలి. లేదంటే మురికి వదలదు. వీటిని సగానికి కోయాలి. ఉల్లి, టొమాటోలను కాస్త పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలను మెత్తగా నూరాలి. కడాయిలో నూనె కాగాక.. జీలకర్ర, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, ఉల్లి తరుగు, అల్లం-వెల్లుల్లి-మిర్చి ముద్ద, టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక.. రూగడా వేసి వేయించాలి. మిరియాలపొడి, ధనియాల పొడి, కారం, గరంమసాలా పొడి, ఉప్పు, పసుపు వేసి కలియ తిప్పాలి. కొన్ని నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించి, దగ్గరగా అయ్యాక దించేయాలి. రూగడా అన్నం, చపాతీ.. ఎందులోకైనా బాగుంటుంది. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని