ఆవిరావురుమంటూ....

పొగలుకక్కుతూ రైలుని పరుగులెత్తిస్తుంది! సెగలుచిమ్ముతూ సొగసరి అందాన్ని హెచ్చిస్తుంది.. అంతేనా ఆవిరికి రుచిని రెట్టింపు చేసే శక్తీ ఉంది.. పోషకాలని ఆవిరికాకుండా కాపాడి.. వంటకాల గుణాన్ని పెంచుతుంది. అదిరిపోయే రుచిని కట్టబెట్టి పదార్థాన్ని పసందుగా తినేలా చేస్తుంది. ఆశలు ఆవిరైతే నిరుత్సాహం .. ఆహారం ఆవిరిదైతే ఉత్సాహం కావాలంటే ఈ వెరైటీలు....

Updated : 20 Sep 2022 15:17 IST

పొగలుకక్కుతూ రైలుని పరుగులెత్తిస్తుంది! సెగలుచిమ్ముతూ సొగసరి అందాన్ని హెచ్చిస్తుంది.. అంతేనా ఆవిరికి రుచిని రెట్టింపు చేసే శక్తీ ఉంది.. పోషకాలని ఆవిరికాకుండా కాపాడి.. వంటకాల గుణాన్ని పెంచుతుంది. అదిరిపోయే రుచిని కట్టబెట్టి పదార్థాన్ని పసందుగా తినేలా చేస్తుంది. ఆశలు ఆవిరైతే నిరుత్సాహం .. ఆహారం ఆవిరిదైతే ఉత్సాహం కావాలంటే ఈ వెరైటీలు వండి వడ్డించుకోండి!

ఆవిరిపై చేపలకూర

కావాల్సినవి: చేపముక్కలు లేదా చిన్న చేపలు- ఎనిమిది, కొబ్బరికోరు- నాలుగు చెంచాలు, కొత్తిమీర- కట్ట, జీలకర్ర- పావుచెంచా, అరిటాకులు- ఎనిమిది, పచ్చిమిర్చి- ఆరు, వెల్లుల్లి రెబ్బలు- పది, నిమ్మరసం- ఆరు చెంచాలు, ఉప్పు- తగినంత, పసుపు- తగినంత 
తయారీ: వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో చేపలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని ఓ పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొత్తిమీర, కొబ్బరికోరు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి వీటన్నింటిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అరటి ఆకులపై ఒక్కో చేపనీ పెడుతూ దానిపై రుబ్బి పెట్టుకున్న పేస్ట్‌ని తగినంత వేసి అరటి ఆకులని అరటినారతో చక్కగా విడిపోకుండా ప్యాక్‌ చేసుకోవాలి. ఇడ్లీపాత్ర లేదా ఏదైనా ఒక పాత్రలో కప్పున్నర నీళ్లు పోసుకుని అవి మరిగిన తర్వాత మరొక పాత్రలో ఈ చేపముక్కలని ఉంచి ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాల్లో చేపలు ఉడికిపోతాయి. నూనె, మసాలాలు లేని ఈ కూర రుచిగానే కాదు... ఒమెగా పోషకాలనీ పుష్కలంగా అందిస్తుంది.

ఎగ్‌ పుడింగ్‌

కావాల్సినవి: గుడ్లు- రెండు, పంచదార- 30గ్రా, పాలు- పావులీటరు
తయారీ: ఒక పాత్రలో గుడ్లసొన తీసుకోవాలి. పాలని గోరువెచ్చగా కాచాలి. ఈ గోరువెచ్చని పాలని, గుడ్లసొనలో నెమ్మదిగా వేసుకుంటూ చివరిగా పంచదార కూడా వేసుకోవాలి. ఫోర్క్‌తో కానీ చెంచాతో కానీ నురగ వచ్చేంతవరకూ బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని సిల్వర్‌ఫాయిల్‌తో పూర్తిగా మూసేయాలి. ఈ పాత్రని ఇడ్లీపాత్రలో ఉంచి పావుగంటపాటు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తుంటే ఆవిరి బయటకు పోయి చక్కగా ఉడుకుతుంది. ఈ స్వీట్‌ వేడిగా తినొచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక కూడా తినొచ్చు.

స్టీమ్‌ బనానా కేక్‌

కావాల్సినవి: పండిన అరటిపండ్లు- ఐదు, బియ్యప్పిండి- కప్పున్నర, పంచదార- ఆరు చెంచాలు, ఉప్పు- పావుచెంచా, వెనిల్లా పరిమళం- పావుచెంచా, ఫుడ్‌కలర్‌(పసుపు)- రెండు చుక్కలు, సాస్‌ కోసం: కొబ్బరిపాలు- కప్పు, పంచదార- అరకప్పు, నీళ్లు- అరకప్పు, మొక్కజొన్నపిండి- చెంచా లేదా టాపియోకా ఫ్లోర్‌ (కర్రపెండలం పిండి)- చెంచా
తయారీ: అరటిపండ్లని మెత్తగా మెదుపుకోవాలి. ఒక పాత్రలో ఈ గుజ్జుని తీసుకుని దానిలో ఉప్పు, పంచదార వేసి బాగా కలిపి ఐదు నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. దీనికి బియ్యప్పిండి, నీళ్లు, వెనిల్లా పరిమళం, ఫుడ్‌కలర్‌ వేసి ఒకదానితో ఒకటి బాగా ఉండల్లేకుండా కలుపుకోవాలి. వెడల్పుగా, లోతుగా ఉండే పాత్ర ఒక దాన్ని తీసుకుని దానికి అడుగున నెయ్యి రాయాలి. ఆ పాత్రలో అరటిపండు మిశ్రమం వేసుకోవాలి. కుక్కర్‌ లేదా ఇడ్లీపాత్రలో కాసిని నీళ్లుపోసి...ఆ ఆవిరి మీద అరటిపండు మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి ఇరవై నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఈలోపు మరొకపాత్రలో మొక్కజొన్న పిండి, నీళ్లు, కొబ్బరిపాలు, పంచదార, ఉప్పు వేసి అన్నీ కలిపి మిశ్రమం దగ్గరకు వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. కేక్‌ని స్టౌమీద నుంచి దింపి చల్లారిన తర్వాత సాస్‌తో కలిపి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.

ఇన్‌స్టెంట్‌ రవ్వ ఇడ్లీ

కావాల్సినవి: ఎర్రగోధుమరవ్వ- కప్పు లేదా బొంబాయిరవ్వ- కప్పు, పెరుగు- అరకప్పు, క్యారెట్‌- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, కరివేపాకు- రెబ్బ, ఈనోసాల్ట్‌- ముప్పావుచెంచా, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని, నూనె- కొద్దిగా,  తాలింపు కోసం: ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, నెయ్యి- కొద్దిగా, జీడిపప్పులు- నాలుగు
తయారీ: మందపాటి పాత్రలో కొద్దిగా నూనె వేసి అందులో రవ్వని ఐదు నిమిషాలపాటు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వలో ఆ తాలింపు, క్యారెట్‌ తురుము, కొత్తిమీర తురుము వేసుకోవాలి. అందులోనే పెరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి. ఇరవై నిమిషాలపాటు పక్కన పెడితే రవ్వ నీటిని పీల్చుకుంటుంది. చివరిగా ఈనో సాల్ట్‌ వేసుకుంటే పిండి సిద్ధమవుతుంది. ఇడ్లీ పాత్రలకి నూనె రాసి అందులో పిండి వేసుకుని ఆవిరిమీద ఇడ్లీలని ఉడికించుకోవాలి.

రైస్‌ ఢోక్లా

కావాల్సినవి: బియ్యప్పిండి- 200గ్రా, బొంబాయి రవ్వ- 30గ్రా, పెరుగు- 100గ్రా, పంచదార- రుచికి తగినంత, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అరచెంచా, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, నీళ్లు- తగినన్ని, ఉప్పు- తగినంత, నిమ్మరసం- తగినంత
తయారీ: ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయిరవ్వ, పెరుగు, పంచదార, చెంచా నూనె వేసి మెత్తగా ఉండల్లేకుండా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం, ఇంగువ వేసి రాత్రంతా ఉంచాలి. ఇడ్లీపాత్రలో తగినన్ని నీళ్లు వేసుకుని వేడిచేసుకోవాలి. కొద్దిగా లోతుగా ఉండే పళ్లెం లేదా కంచంలో పిండిని పోసుకుని ఆవిరిమీద ఇరవైనిమిషాల పాటు ఉడికించుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడాక రెండు చెంచాల నీళ్లు వేసి ఈ తాలింపుని బియ్యప్పిండి ఢోక్లాలపై వేయాలి. చివరిగా కొబ్బరికోరు, కొత్తిమీరవేసి వడ్డించుకుంటే రుచిగా ఉంటాయి.
* మైక్రోవేవ్‌ లేదా మామూలు పద్ధతిలో వంట చేసినప్పటితో పోలిస్తే... ఆవిరిమీద ఉడికించినప్పుడు 80 శాతం ఫ్లేవనాయిడ్లు అధికంగా అందుతాయి. ముఖ్యంగా సి విటమిన్‌ని కోల్పోకుండా ఉంటాం.

* ఇడ్లీపిండిని... పనసాకుల్లో ఉంచి ఆవిరిమీద ఉడికించే వంటకాన్ని ‘పొట్టిక్కలు’ అంటారు. రుచిలోనూ, పోషకాల్లోనూ కూడా ముందుంటుందీ వంటకం.

* బిర్యానీ ఆకుల్లో... పనసపండ్ల గుజ్జు, వరిపిండి, కొబ్బరి వేసి ఆవిరిమీద ఉడికించే వంటకాన్ని ‘చెక్కఅడ’ అంటారు.
* నూనెల రూపంలో ఎక్కువ కొవ్వు చేరదు కాబట్టి... కెలొరీలు అదుపులో ఉంటాయి. గుండెకు ఆ ఆహారం మేలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని