ప్రాన్స్‌ విందాలూ

ఇదొక గోవా వంటకం.  విందాలూ అనేది పోర్చుగీసు పదం. అక్కడ స్థానికంగా దొరికే మసాలాలతో నాన్‌వెజ్‌ను మారినేట్‌ చేయడాన్నే విందాలూగా వ్యవహరిస్తారు.  విందాలూ పేస్ట్‌ అన్ని సూపర్‌ మార్కెట్‌లలోనూ దొరుకుతుంది.

Updated : 05 Dec 2021 06:32 IST

ఇదొక గోవా వంటకం.  విందాలూ అనేది పోర్చుగీసు పదం. అక్కడ స్థానికంగా దొరికే మసాలాలతో నాన్‌వెజ్‌ను మారినేట్‌ చేయడాన్నే విందాలూగా వ్యవహరిస్తారు.  విందాలూ పేస్ట్‌ అన్ని సూపర్‌ మార్కెట్‌లలోనూ దొరుకుతుంది. దీన్ని వాడుకుంటూ చికెన్‌, మటన్‌, ప్రాన్స్‌... ఇలా రకరకాలుగా  రెసిపీని తయారుచేసుకోవచ్చు. మసాలాలతో ఘాటుగా... కొబ్బరి పాల వల్ల స్వీటుగా... రెండు రకాల రుచులతో భోజనప్రియుల నోరూరిస్తుందీ రెసిపీ. దీన్ని అన్నం, నాన్‌, చపాతీ, పరాఠా.. ఇలా వేటితోనైనా తినొచ్చు.

కావాల్సినవి: రొయ్యలు- అర కిలో, వైట్‌ వెనిగర్‌- మూడు పెద్ద చెంచాలు, ఉల్లిపాయ, టొమాటో- ఒక్కోటి చొప్పున (తరగాలి), అల్లం తరుగు- అర చెంచా, వెల్లుల్లి తరుగు- పావు చెంచా, జీలకర్ర పొడి- చెంచా, కశ్మీరీ మిర్చీ- మూడు, కొబ్బరిపాలు- అర కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- రెండు పెద్ద చెంచాలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు.

తయారీ:  రొయ్యలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, కశ్మీరీ మిర్చీ, అల్లంవెల్లుల్లిలను వెనిగర్‌లో పావుగంట నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి పేస్ట్‌ చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు వేసి మెత్తగా మారేవరకు మూడు నాలుగు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసిన పేస్ట్‌ వేసి మీడియం మంట మీద సుమారు మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మరో అయిదు నిమిషాలు ఉడికించాలి. రొయ్యలు, ఉప్పు జత చేసి మరి కాసేపు మగ్గించాలి. కొబ్బరిపాలు పోసి తక్కువ మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకుని అన్నంతో కలిపి తింటే ఆహా అనకుండా ఉండలేరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని