రాగి ముద్ద.. జొన్నరొట్టె.. తలకాయ కూర!

కొవిడ్‌ తర్వాత నగరాల్లో ఆహార అలవాట్లు చాలా మారాయి. ఆరోగ్యం కోసం పాత ఆహార పద్ధతులనే అంతా అనుసరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కర్నూలులోని బి క్యాంపులో ఏర్పాటు చేసిన ‘లక్ష్మీస్‌ మిల్లెట్‌ ఫుడ్‌ కోర్ట్‌’ ప్రత్యేక గుర్తింపు పొందింది. చిరుధాన్యాలతో చేసే రుచికరమైన

Updated : 17 Apr 2022 05:21 IST

కొవిడ్‌ తర్వాత నగరాల్లో ఆహార అలవాట్లు చాలా మారాయి. ఆరోగ్యం కోసం పాత ఆహార పద్ధతులనే అంతా అనుసరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కర్నూలులోని బి క్యాంపులో ఏర్పాటు చేసిన ‘లక్ష్మీస్‌ మిల్లెట్‌ ఫుడ్‌ కోర్ట్‌’ ప్రత్యేక గుర్తింపు పొందింది. చిరుధాన్యాలతో చేసే రుచికరమైన అల్పాహారాన్ని జనం లొట్టలేసుకుని తింటున్నారు. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కావడంతో క్రీడాకారులు, ఉద్యోగులతో ఈ హోటల్‌ ఉదయం పూట కిక్కిరిసిపోతుంది. ఆదివారం అయితే ఇక చెప్పనక్కర్లేదు. 

కర్నూలు నగరంలోని సిల్వర్‌ జూబ్లీ కళాశాల ఎదురుగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానాన్ని ఆనుకుని ఉన్న ఓ చిన్న హోటల్‌ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. చిరుధాన్యాల విశిష్టత, అందులో ఏ చిరుధాన్యం ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరాలు... పీచు, మాంసకృత్తులు, ఖనిజాలు (ఐరన్‌, క్యాల్షియం) ఎంతెంత మోతాదులో ఉంటాయో తెలియజేస్తూ ఓ బోర్డు హోటల్‌ ముందు దర్శనమిస్తుంది. ఈ హోటల్‌లో ఉదయం రాగి, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, సజ్జలు, పెసలు, అండు కొర్రలతో రకరకాల ఇడ్లీలు, దోశలు, ఉప్మా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా రాగి అంబలి, జొన్న అంబలి తయారు చేసి అమ్ముతున్నారు. నువ్వుల లడ్డు, రాగి లడ్డు, జొన్న, కొర్ర, అరికెలతో చేసిన మురుకుల (చక్రాలు) వంటి చిరుతిళ్లూ ఇక్కడ దొరుకుతాయి.

అమ్మ చేతి వంటలా..
కర్నూలుకు చెందిన మధుబాబు నాయుడు బీటెక్‌ చదివి వెబ్‌ డిజైనర్‌గా కొంత కాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 2019లో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని అందించాలన్న ఆలోచనతో చిరుధాన్యాల అల్పాహారం మొదలుపెట్టారు. మధుబాబు తల్లి లక్ష్మమ్మ పాత పద్ధతిలో తాను ఇంట్లో వండి పెట్టినట్లుగానే, హోటల్‌లోనూ తానే వంట మాస్టర్‌ అవతారమెత్తారు. చిరుధాన్యాలతో చేసిన ఆహారానికి మరింత రుచిని జోడించేందుకు పల్లీ చట్నీ, వెల్లుల్లి, కరివేపాకు పొడులను సొంతగా తయారు చేస్తున్నారు. ఆదివారం, మంగళవారం రాగి ముద్ద, జొన్న రొట్టెలతో తలకాయకూర, బోటీ వంటి మాంసాహారం ఇక్కడ ప్రత్యేకత. మీరూ రుచి చూస్తారా మరి.

- యడ్లపాటి బసవ సురేంద్ర, ఈనాడు, కర్నూలు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని