మామిడి రుచుల మాయ!

పండ్లలో సెలబ్రిటీ హోదా దేనికైనా ఉందంటే అది మామిడిపండుకే! దీని రాకకోసం ఏడాదంతా ఆశగా ఎదురుచూసే అభిమానులుంటారంటే ఆశ్చర్యం లేదు. ఈ ఇష్టానికి మరికొన్ని ఇష్టమైన రుచులని

Updated : 12 Jun 2022 00:05 IST

పండ్లలో సెలబ్రిటీ హోదా దేనికైనా ఉందంటే అది మామిడిపండుకే! దీని రాకకోసం ఏడాదంతా ఆశగా ఎదురుచూసే అభిమానులుంటారంటే ఆశ్చర్యం లేదు. ఈ ఇష్టానికి మరికొన్ని ఇష్టమైన రుచులని జోడించి ఈ వంటకాలు ప్రయత్నించండి. ఇంటిల్లిపాదీ మిమ్మల్ని పొగడ్తలతో  ఆకాశానికి ఎత్తకపోతే అడగండి...


ఆమ్‌రస్‌ పూరీ

కావాల్సినవి: మామిడిపండ్లు- రెండు, పంచదార- రెండు చెంచాలు, యాలకులపొడి- పావుచెంచా, ఉప్పు- పావుచెంచా, పిస్తాపలుకులు- కొద్దిగా, కుంకుమపువ్వు- చిటికెడు

తయారీ: మామిడిపండ్లని శుభ్రం చేసి చెక్కుతీసేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇందులోనే పంచదార, ఉప్పు, యాలకులపొడి కూడా వేసి మరో సారి మిక్సీ పట్టించాలి. చివరిగా కుంకుమపువ్వు, పిస్తాపలుకులు వేసుకోవాలి. ఇది ఆమ్‌రస్‌. దీనికి పూరీలు మంచి కాంబినేషన్‌. ఆమ్‌రస్‌పూరీ గుజరాత్‌, మహారాష్ట్ర వంటిచోట్ల ఇష్టంగా తింటారు.


కేసరి

కావాల్సినవి: బొంబాయి రవ్వ-కప్పు, నెయ్యి- పావుకప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, పంచదార- అరకప్పు, మామిడిపండు-ఒకటి, యాలకులపొడి- అరచెంచా, అలంకరణ కోసం: నెయ్యి-చెంచా, జీడిపప్పులు- కొద్దిగా.

తయారీ: మామిడిపండుని చెక్కు తీసేసి ముక్కలని మిక్సీలో వేసుకుని పేస్ట్‌ చేసి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్‌లో చెంచా నెయ్యి వేసి అందులో జీడిపప్పులని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో పావుకప్పు నెయ్యి వేసి కరిగించుకుని అందులో బొంబాయి రవ్వని దోరగా వేయించాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి అవి మరుగుతున్నపుడ[ు పంచదార వేసి కరిగించుకోవాలి. ఈ నీళ్లలో వేయించుకున్న రవ్వని పోస్తూ, ఉండలు కట్టకుండా కలియతిప్పుకోవాలి. చూడటానికి హల్వాలా అయ్యేంత వరకూ ఉంచి అందులో మామిడిపండు గుజ్జుని వేసి కలుపుకోవాలి. కాసేపటికి ఈ మిశ్రమం పాత్ర అంచుల నుంచి వేరవుతుంది. అప్పుడు దీనిని వేరే పాత్రలోకి తీసుకుని వేయించిపెట్టుకున్న జీడిపప్పులతో అలంకరించుకుంటే కేసరి సిద్ధం.


మ్యాంగో షెర్‌బత్‌

కావాల్సినవి: మామిడిపండ్లు- రెండు, ఉప్పు- చిటికెడు, పంచదార- అరకప్పు, నిమ్మరసం- నాలుగు చెంచాలు, పుదీనాఆకులు- నాలుగు, నీళ్లు- మూడుకప్పులు

తయారీ: మామిడిపండ్లని బాగా శుభ్రం చేసుకుని తొక్కతీసేసి ముక్కలు కోసుకోవాలి. మిక్సీలో మామిడిపండు ముక్కలు, పంచదార, ఉప్పు, నిమ్మరసం, నీళ్లు వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ రసాన్ని ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేసేటప్పుడు పుదీనా ఆకులు కూడా వేసి చేస్తే బాగుంటుంది.


లస్సీ

కావాల్సినవి: మామిడిపండు ముక్కలు- కప్పు, పెరుగు- కప్పు, పాలు- అరకప్పు, పంచదార- రెండు చెంచాలు, యాలకుల పొడి- చిటికెడు, దాల్చిన చెక్కపొడి- చిటికెడు

తయారీ: దాల్చిన చెక్కపొడి తప్పించి మిగిలిన అన్నింటిని మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. మ్యాంగో లస్సీ సిద్ధం. దీనిని ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేసేటప్పుడు దాల్చినచెక్కపొడి పైన చల్లుకుంటే రుచిగా ఉంటుంది. ఎండ నుంచి ఉపశమం కలిగిస్తుంది.


అమర్‌ఖండ్‌

కావాల్సినవి: చిక్కని పెరుగు- రెండు కప్పులు, మెత్తని పంచదార పొడి- అరకప్పు, యాలకులపొడి- చిన్నచెంచా, మామిడిపండు గుజ్జు- కప్పు, పిస్తా పలుకులు- చెంచా, తరిగిన బాదం పలుకులు- చెంచా, కుంకుమపువ్వు- చిటికెడు, గోరువెచ్చని పాలు- చెంచాన్నర

తయారీ: పెరుగుని ఒక వస్త్రంలో ఉంచి అందులోని నీరంతా పోయేలా ఒక చోట వేలాడదీయాలి. ఆ తర్వాత గట్టిగా ఉన్న పెరుగుని చెంచాతో మెత్తగా మెదుపుకొని అందులో మామిడిపండు గుజ్జు, పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా కుంకుమపువ్వు వేసి ఉంచితే ఐదునిమిషాలకు చక్కని రంగు వస్తుంది. ఈ పాలను, బాదం, పిస్తా పలుకులని పెరుగు మిశ్రమంపై వేస్తే అమర్‌ఖండ్‌ సిద్ధం అయినట్టే. దీనిని చల్లగా తింటే బాగుంటుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని