ఆకేసి.. పప్పేసి!

ఆకుకూరలంటే... తోటకూర, గోంగూర, పాలకూర ఇవేకదా అనేయొద్దు. మనకు తెలియనవి యాభైరకాలకు పైగా ఆకుకూరలున్నాయ్‌!

Updated : 04 Sep 2022 09:59 IST

ఆకుకూరలంటే... తోటకూర, గోంగూర, పాలకూర ఇవేకదా అనేయొద్దు. మనకు తెలియనవి యాభైరకాలకు పైగా ఆకుకూరలున్నాయ్‌! అన్నీ కాకపోయినా కొన్నయినా ప్రయత్నిద్దాం. అద్భుతమైన వాటి ఆరోగ్యప్రయోజనాలు అందుకుందాం..


మునగాకు పొడి..

కావాల్సినవి: నువ్వులు- కప్పు, నీడపట్టున ఆరబెట్టిన మునగాకులు- కప్పు, మినపప్పు- ఒకటిన్నర చెంచా, ఉప్పు- తగినంత, ఎండుమిర్చి- నాలుగు, ఇంగువ- చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ధనియాలు- చెంచా, జీలకర్ర- పావుచెంచా, సెనగపప్పు- చెంచా.
తయారీ: స్టౌ వెలిగించి ఒక పాన్‌లో నువ్వుల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొంచెం నూనె వేసుకుని వేడెక్కాక అందులో ఎండుమిర్చి, ఇంగువ, మినపప్పు, సెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి, వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడదే పాన్‌లో మరికొంచెం నూనె వేసుకుని అందులో మునగాకుని మరీ ఎక్కువగా కాకుండా దోరపదునుతో వేయించుకోవాలి. అన్నీ చల్లారాక.. మునగాకు తప్పించి తక్కిన వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆకు కూడా వేసి పొడికొట్టుకోవాలి. రుచికరమైన కారప్పొడి సిద్ధం.
ఈ పొడి రక్తహీనత రాకుండా చేస్తుంది. కంటిచూపుని మెరుగు పరుస్తుంది.


తుమ్మికూర పప్పు

కావాల్సినవి: కందిపప్పు- కప్పు, సన్నగా తరిగిన తుమ్మికూర- కప్పు, టొమాటో- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, చింతపండు గుజ్జు- చెంచా, పసుపు- చిటికెడు, కారం- చెంచా, ఉప్పు- తగినంత
పోపు సామగ్రి: ఆవాలు- అరచెంచా, జీలకర్ర- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, ఇంగువ- చిటికెడు, నూనె- రెండు చెంచాలు
తయారీ: కాడలు తీసేసి శుభ్రం చేసిన తుమ్మి ఆకులని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వాటిని పప్పుతోపాటు కడిగి పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.
ఇంగువతో తాలింపు వేసుకున్న తర్వాత.. చింతపండు గుజ్జు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని ఐదారు నిమిషాలు ఉడికించి దింపేస్తే తుమ్మికూర పప్పు సిద్ధం.

చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.


కొండపిండాకుతో

కావాల్సినవి: కొండ పిండాకు- కట్ట, ఉల్లిపాయముక్కలు- కప్పు, ఎండుమిర్చి- మూడు, పచ్చిమిర్చి- రెండు, చింతపండు గుజ్జు- రెండు చెంచాలు, నానబెట్టిన పెసర పప్పు- అరకప్పు, వెల్లుల్లిరెబ్బలు- ఐదు, ఆవాలు- అరచెంచా, జీలకర్ర- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- తగినంత.  
తయారీ:  స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి అది వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేంతవరకూ వేయించుకోవాలి. అప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత చింతపండురసం వేసి కలపాలి. చివరిగా శుభ్రం చేసిన కొండపిండాకు, ఉప్పు వేసి బాగా ఉడికించుకుంటే కూర సిద్ధం.

దీనిని పాషాణబేధి అని కూడా అంటారు. మూత్రపిండాల్లో రాళ్లుంటే  కరిగిపోతాయి. పెసరపప్పు, సెనగపప్పుతో కలిపి తినొచ్చు.


వామాకు పచ్చడి

కావాల్సినవి: వాము ఆకులు- కప్పు, సెనగపప్పు- రెండు చెంచాలు, మినప్పప్పు- చెంచా, ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, వెల్లుల్లి రెబ్బలు- 4, ఎండుమిర్చి- 4, చింతపండు గుజ్జు- చెంచా, నూనె- తగినంత, పోపు సామగ్రి: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు
తయారీ: స్టౌ వెలిగించి బాణలిలో కొద్దిగా నూనె పోసి సెనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో శుభ్రం చేసుకున్న వామాకులని వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. స్టౌకట్టేసి అవన్నీ చల్లారాక ముందుగా సెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో వాము ఆకులు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. చివరగా పోపు వేసుకుంటే పచ్చడి తయారవుతుంది.

జలుబు చేసి బాధపడుతున్న వారికి మంచి మందు. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని