Published : 18 Sep 2022 00:28 IST

ఆవపెడితే అదుర్స్‌!

చింతపండు పులిహోరకి ఆఖర్న..ఆవ అద్దారనుకోండి! అబ్బో.. ఆ రుచి నాలుకే కాదు మనసుకి కూడా హత్తుకుంటుంది. అదే ఆవని పనసపొట్టుకి చేర్చారనుకోండి... ఆకలిని అరువు తెచ్చుకుని తింటారు.. ఆవ వీటికే కాదు... నీచు వంటకాలకి కూడా అంతే  ప్రత్యేకమైన రుచిని ఆపాదిస్తుంది.. మీ రోజువారీ వంటకాలకి కూడా ఇలా ఆవపెట్టి చూడండి...  


బెంగాలీ చేపల కూర

కావాల్సినవి: రోహు చేప- ఐదు ముక్కలు, కొబ్బరి కోరు- మూడు చెంచాలు, ఆవాలు- మూడు చెంచాలు, గసగసాలు- నాలుగు చెంచాలు, ఉప్పు- తగినంత, ఆవనూనె- మూడు చెంచాలు, పచ్చిమిర్చి- ఐదు, పసుపు- తగినంత, కరివేపాకు- రెబ్బ
తయారీ: చేప ముక్కల్ని శుభ్రం చేసి తడిలేకుండా చెయ్యాలి. వీటికి పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, గసగసాల్ని ఓ గంటపాటు నానబెట్టి ఉంచాలి. ఇందులోనే కొబ్బరి కోరు కూడా వేసి, మిక్సీలో మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. స్టౌపై పాన్‌ పెట్టి ఆవనూనె వేసి వేడిచేసుకోవాలి. ఇందులో చేపముక్కల్ని రెండు వైపులా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకుని, మరికాస్త నూనె వేసుకుని అందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న ఆవ మిశ్రమం వేసి.. ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో చేపముక్కలు, తగినంత ఉప్పు, కరివేపాకు, సరిపడ నీళ్లు వేసి మూతపెట్టేయాలి. మరో ఐదారు నిమిషాలకు చక్కని రుచితో చేపలకూర సిద్ధమవుతుంది.


క్యాబేజీతో..

కావాల్సినవి: క్యాబేజీ- ఒకటి, ఆవాలు- చెంచా, ఎండుమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- రెబ్బ, కారం- పావుచెంచా తాలింపు సామగ్రి: సెనగపప్పు- అరచెంచా, మినప్పప్పు- అరచెంచా, ఇంగువ- చిటికెడు, నూనె- తగినంత, జీలకర్ర- అరచెంచా
తయారీ: క్యాబేజిని సన్నగా తురుముకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు వార్చుకుని క్యాబేజీని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఎండుమిర్చి, ఆవాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్‌ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని వేడిచేసుకోవాలి. ఇందులో సెనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, జీలకర్ర వేసి చిటపటలాడేంతవరకూ వేయించుకుని తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉడికించిన క్యాబేజీ, ఉప్పు, కారం వేసి కలిపి కాసేపు ఉడికించి చివరిగా ఆవపొడి వేసి మూతపెట్టాలి. మూడు నిమిషాలకల్లా క్యాబేజీ కూర రెడీ.


చింగారి

కావాల్సినవి: రొయ్యలు- అరకేజీ, పసుపు- అరచెంచా, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- నాలుగు, ఆవాలు- చెంచా, గసగసాలు- చెంచా, కారం- అరచెంచా, కొబ్బరికోరు- అరకప్పు, ఆవనూనె- మూడు చెంచాలు, గిలక్కొట్టిన పెరుగు- చెంచాన్నర
తయారీ: ఓ పదినిమిషాల ముందు గసగసాలు, ఆవాల్ని పావుకప్పు నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి. ఈలోపు రొయ్యల్ని శుభ్రం చేసి సిద్ధం చేసుకోవాలి. వీటిపై కాసింత ఉప్పు, పసుపు వేసుకొని పక్కనపెట్టుకోవాలి. ఆవాలు, గసగసాల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవి బాగా నలిగాక... కొబ్బరికోరు, రెండు పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించుకోవాలి. స్టౌ వెలిగించి... పాన్‌లో రెండు చెంచాల ఆవనూనె వేసి వేడిచేసుకోవాలి. తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, రొయ్యిల మిశ్రమాన్ని కూడా వేసి మూతపెట్టి రొయ్యల్ని ఉడికించుకోవాలి. చివరిగా గిలక్కొట్టిన పెరుగు వేసి మూతపెట్టేయాలి. మరో రెండు నిమిషాలయ్యాక కూర దించేయాలి.


అరటికాయతో..

కావాల్సినవి: అరటికాయ- ఒకటి, ఆవాలు- రెండు చెంచాలు, పసుపు- పావుచెంచా, నువ్వుల నూనె లేదా ఆవనూనె- చెంచా, ఉప్పు- తగినంత, మినప్పప్పు- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, పచ్చిమిర్చి- ఏడు, అల్లం- అంగుళం ముక్క, కొబ్బరికోరు- మూడు చెంచాలు
తయారీ: ముందుగా కుక్కర్‌లో లేదా పాన్‌లో నీళ్లు, ఉప్పు, పసుపు వేసి అందులో అరటికాయని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. మిక్సీలోఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి తురుము, నచ్చితే కొద్దిగా బియ్యపురవ్వ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పాన్‌ పెట్టుకుని నూనె పోసుకుని వేడెక్కాక మినపప్పు, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడేంతవరకూ వేయించుకోవాలి. ఇందులో మిక్సీ పట్టుకున్న ఆవమిశ్రమం వేసి తక్కువ మంట మీద వేయించుకోవాలి. తగినంత ఉప్పు, ఉడికించిన అరటికాయని చెంచాతో చిదుముకొని ఇందులో వేసి కలపాలి. పచ్చి వాసన పోయేంతవరకూ వేయించుకుని చివరిగా పైనుంచి కొంచెం ఆవనూనె వేసుకుని దించుకుంటే రుచి ప్రత్యేకంగా ఉంటుంది.


తోటకూరతో..

కావాల్సినవి: సన్నగా తరిగిన తోటకూర- రెండున్నర కప్పులు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, పసుపు- పావుచెంచా, చింతపండు- నిమ్మకాయంత, బెల్లం- చెంచాన్నర, బియ్యప్పిండి- చెంచా, ఎండుమిర్చి- ఒకటి, ముప్పావుచెంచా- ఆవాలు, ఉప్పు- తగినంత, తాలింపులోకి: నూనె- చెంచా, ఆవాలు- అరచెంచా, జీలకర్ర- అరచెంచా, మెంతులు- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, మినప్పప్పు- చెంచా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఎండుమిర్చి- ఒకటి  
తయారీ: ఆవాలు, ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని పొడిచేసుకోవాలి. అడుగు మందంగా ఉండే కడాయి తీసుకుని.. నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ వేసుకుని చిటపటలాడేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత తోటకూర తరుగు, ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి ఐదునిమిషాలు కూరని మగ్గనివ్వాలి. అందులో చింతపండు రసం, బెల్లం వేసుకుని పదినిమిషాలు ఉడికించుకుంటే పచ్చివాసన పోతుంది. చివరిగా బియ్యప్పిండి కూర చిక్కబడ్డాక.. అందులో ఆవపిండి వేసి కలపాలి. సన్నమంట మీద ఉడికించి కూర దించేయడమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts