రుచులకు... అండా దండా!

ఇంట్లో కాయగూరలు లేకపోయినా ఫర్వాలేదు... నాలుగు గుడ్లు ఉంటే చాలు బోలెడు భరోసా. మనసుపడితే ఆమ్లెట్‌... తీరిక ఉంటే ఉక్కురు. ఇవేమీ కాదనుకుంటే ఎగ్‌బోండా. ఒక్కటేంటి.. పోషకాల రాజులాంటి గుడ్డుతో బోలెడు ప్రయోగాలతో ఇంటిల్లిపాదినీ ఫిదా చేయొచ్చు..

Published : 09 Oct 2022 00:04 IST

ఇంట్లో కాయగూరలు లేకపోయినా ఫర్వాలేదు... నాలుగు గుడ్లు ఉంటే చాలు బోలెడు భరోసా. మనసుపడితే ఆమ్లెట్‌... తీరిక ఉంటే ఉక్కురు. ఇవేమీ కాదనుకుంటే ఎగ్‌బోండా. ఒక్కటేంటి.. పోషకాల రాజులాంటి గుడ్డుతో బోలెడు ప్రయోగాలతో ఇంటిల్లిపాదినీ ఫిదా చేయొచ్చు..

* ఉదయం పూట అల్పాహారంతో పాటు ఓ గుడ్డు తిని చూడండి. గుండె ఆరోగ్యానికి మంచిదంటున్నాయి అధ్యయనాలు.

* గుడ్డు న్యూట్రీ డెన్స్‌ ఆహారం. అంటే తక్కువ మొత్తంలో తిన్నా.. ఎక్కువ పోషకాలు అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి ప్రొటీన్లు నిండుగా అందిస్తుంది కాబట్టి బరువు తగ్గాలను కొనే వారికి సహ కరిస్తూ చక్కని కండ బలాన్ని ఇస్తుంది.


గుడ్డు పచ్చడి

కావాల్సినవి: గుడ్లు- మూడు, కారం- రెండున్నర చెంచాలు, పసుపు- పావుచెంచా, గరంమసాలా- చెంచాన్నర, ఉప్పు- తగినంత, నిమ్మరసం- మూడు చెంచాలు(పులుపు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరో చెంచా కూడా వేసుకోవచ్చు), ఉల్లిపాయ- ఒకటి, నూనె- మూడు చెంచాలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి పలుకులు- చెంచా చొప్పున

తయారీ: గుడ్లని ఉడికించుకుని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, అరచెంచా కారం, కొద్దిగా ఉప్పు, అరచెంచా గరంమసాలా, చెంచా నిమ్మరసం, చెంచా నీళ్లు వేసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. గుడ్లకి టూత్‌పిక్‌తో అక్కడక్కడా గుచ్చి... ఈ మిశ్రమాన్ని పట్టించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో చెంచాన్నర కారం వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. మసాలా పట్టించిన గుడ్లని చాకుతో ముక్కలుగా తరగాలి. పచ్చసొనని వేరుగా పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని వేడెక్కాక ఈ గుడ్డు ముక్కలని, పచ్చసొనని బాగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకుని, కడాయిలో... మరికాస్త నూనె వేసుకుని వేడెక్కాక అల్లం, వెల్లుల్లి పలుకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ కారం వేసుకుని పచ్చివాసన పోయి దగ్గరకు వచ్చేంతవరకూ వేయించుకుని స్టౌ కట్టేయాలి. చల్లారాక మిగిలిన నిమ్మరసం వేసుకోవాలి. చివరిగా వేయించుకున్న గుడ్డు ముక్కల్ని వేసుకుని కలపాలి. నిల్వ ఉంచాలి అనుకొనేవాళ్లు పచ్చసొన వేయకుండా తక్కినవి వేసుకుంటే మేలు. అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది.


ఎగ్‌ చాట్‌

కావాల్సినవి: గుడ్లు- మూడు, ఉల్లిపాయముక్కలు- నాలుగు చెంచాలు, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం- చెంచా, పసుపు- చిటికెడు, మిరియాల పొడి- చెంచా, మొక్కజొన్న పిండి- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- పావుచెంచా, కరివేపాకు- రెబ్బ, నిమ్మరసం- చెంచా

తయారీ: గుడ్లని ఉడికించి పొట్టు తీసేసి...రెండు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, కారం, మిరియాలపొడి, పసుపు, మొక్కజొన్నపిండి వేసుకుని అన్నింటినీ కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని అల్లంవెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా ఉండకూడదు. అందుకు తగినట్టుగా నీళ్లు కలపాలి. రెడీ చేసి పెట్టుకున్న గుడ్లని ఈ మిశ్రమంలో ముంచాలి. స్టౌ వెలిగించి.. కొద్దిగా నూనె పోసుకుని అందులో మసాలా పట్టించిన గుడ్లని ఉంచి చెదిరిపోకుండా రెండు వైపులా వేయించు కోవాలి. వీటిని వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన గుడ్లపై ఉంచితే ఎగ్‌చాట్‌ సిద్ధం.


జున్ను ముక్కల కూర

కావాల్సినవి: గుడ్లు- ఆరు, ఉప్పు-తగినంత, మిరియాలపొడి- అరచెంచా, పసుపు-తగినంత,  మిరియాలు- చెంచా, యాలకులు- రెండు, ఎండుమిర్చి- ఎనిమిది, దాల్చినచెక్క- చిన్నది, లవంగాలు- మూడు, ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, నూనె- ఐదు చెంచాలు, అల్లంముక్క- చిన్నది, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- మూడు, గసగసాలు- చెంచా, టొమాటో- ఒకటి, పెరుగు- అరకప్పు, కరివేపాకు- రెబ్బ, కొత్తిమీర తురుము- చెంచా

తయారీ: ముందుగా గుడ్లని పగలకొట్టి ఆ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టాలి. ఇందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, పసుపు వేసి కలపాలి. ఒక పొడవాటి గ్లాసు తీసుకుని దీని లోపలి వైపు నూనె రాసి అందులో ఈ సొన వేసుకోవాలి. కొద్దిగా వెలితి ఉంచాలి. ఆవిరిపై పన్నెండు నిమిషాలపాటు ఉడికించుకుంటే చక్కగా పనీర్‌లా తయారవుతుంది. దీనిని ముక్కలుగా కోసుకోవాలి. ఒక పాన్‌లో.. రెండు చెంచాల నూనె పోసుకుని అందులో మిరియాలు, ఎండుమిర్చి, దాల్చిని, లవంగాలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు యాలకులు, అల్లం, వెల్లుల్లి వేసుకుని బాగా వేగాక ఉల్లిపాయముక్కలు, టొమాటో, మిర్చి, ఉప్పు వేసుకుని మూతపెట్టి ఉడికించుకోవాలి. ఇవి చల్లారాక పెరుగుతో కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక... అందులో మిక్సీపట్టుకున్న మిశ్రమాన్ని పావుగంటపాటు ఉడికించుకోవాలి. అప్పుడు గడ్డముక్కల్ని కూడా వేసుకుని మూతపెట్టేయాలి. పది నిమిషాలకు కూర రెడీ అవుతుంది.


మసాలా ఆమ్లెట్‌

కావాల్సినవి: గుడ్లు- రెండు, ఉప్పు- తగినంత, కారం- పావుచెంచా, గరంమసాలా- పావుచెంచా, ధనియాలపొడి- పావుచెంచా, జీలకర్రపొడి- పావుచెంచా కన్నా తక్కువ, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు- చెంచా, ఉల్లిపాయముక్కలు- చెంచా, పసుపు- తగినంత, క్యాప్సికమ్‌ ముక్కలు- చెంచా, మొజరెల్లా చీజ్‌ తురుము- చెంచా, కొత్తిమీర తురుము- అరచెంచా, పచ్చిమిర్చి ముక్కలు- పావుచెంచా, నూనె- తగినంత

తయారీ: ఒక గిన్నెలోకి గుడ్ల సొన, మసాలా పొడులు తీసుకుని బాగా కలిపి అందులోనే కొత్తమీర సహా మిగతా కాయగూరముక్కలు కూడా వేసుకుని కలపాలి. పెనంపై ఆమ్లెట్‌ వేసి కొద్దిగా కాలిన తర్వాత మొజరెల్లా చీజ్‌ తురుముని చల్లి పైన మూత పెట్టాలి. రెండు వైపు కూడా కాల్చుకుంటే మసాలా ఆమ్లెట్‌ సిద్ధం.


పనియారం

కావాల్సినవి: గుడ్లు- నాలుగు, మిరియాల పొడి- అరచెంచా, ఉప్పు- తగినంత, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, క్యాప్సికమ్‌- ఒకటి, క్యారెట్‌- ఒకటి, బంగాళాదుంప- ఒకటి, కారం- అరచెంచా, ధనియాలపొడి- అరచెంచా, పసుపు- చిటికెడు, గరంమసాలా- పావుచెంచా, నూనె- వేయించడానికి సరిపడ, కొత్తిమీర తురుము- రెండు చెంచాలు

తయారీ: కాయగూరలన్నింటినీ సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి నూనె పోసుకొని.. అందులో ముందుగా ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. తర్వాత మిర్చి, క్యారెట్‌, బంగాళాదుంపముక్కలు వేసి వేయించుకోవాలి. చివరిగా క్యాప్సికమ్‌ ముక్కలు వేసుకుని ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేసుకుని పచ్చివాసన పోయేంతవరకూ వేయించి దింపి
చల్లార్చుకోవాలి. ఒక పాత్రలో గుడ్లని కొట్టి అందులో మిరియాలపొడి వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన కాయగూరల మిశ్రమంలో కలిపి కొత్తిమీర కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌపై గుంట పొంగనాల (పనియారం) పాత్రని ఉంచి.. అందులో నూనె పోసి, ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వీటిని తిరిగేసి కూడా కాల్చుకుంటే ఎగ్‌ అప్పే లేదా ఎగ్‌ పనియారం సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు