చవులూరించే... చేప సమోసా!

సమోసాలో ఆలూ ఉండటం కొత్తేం కాదు. అదే కారం, కారంగా.. రొయ్యలో, చికెనో, చేపలో తగిలితే? సమోసాల్లో నాన్‌ వెజ్జా.. అంటారా? అవును ఈ ‘రుచి సమోసా’ స్టాల్లో అవే ప్రత్యేకం...

Updated : 05 Feb 2023 00:55 IST

సమోసాలో ఆలూ ఉండటం కొత్తేం కాదు. అదే కారం, కారంగా.. రొయ్యలో, చికెనో, చేపలో తగిలితే? సమోసాల్లో నాన్‌ వెజ్జా.. అంటారా? అవును ఈ ‘రుచి సమోసా’ స్టాల్లో అవే ప్రత్యేకం...

మోసా అంటే ప్రాణం పెట్టే ఆహారప్రియులు చాలామందే ఉంటారు. వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా మొత్తం 12 రకాల రుచుల్లో ఇక్కడ సమోసాలు దొరుకుతాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్‌స్టాండ్‌కి దగ్గర్లో ఉంటుందీ దుకాణం. నోరూరించే ఆలూ సమోసాతోపాటు రొయ్యలు, చికెన్‌, గుడ్డు, మటన్‌, చేప, చీజ్‌, కార్న్‌, పన్నీర్‌, ఉల్లిపాయ, పుట్టగొడుగు.. ఇలా పన్నెండు రకాల సమోసాలు దొరుకుతాయి. పదిహేడు సంవత్సరాల క్రితం విజయవాడ నుంచి వచ్చిన లక్ష్మి ఉల్లి, ఆలూ సమోసాలతో మొదలు పెట్టి ప్రస్తుతం ఇలా పన్నెండు రకాల సమోసాల్ని ఆహార ప్రియులకి రుచి చూపుతున్నారు. ఇక్కడే తినే వాళ్లు ఒకటో రెండో సమోసాలు తింటారు. కానీ పార్సిళ్లు మాత్రం చాలానే వెళతాయి. ‘ఓ వంద రూపాయల కార్న్‌ సమోసా... పార్సిల్‌’, ‘ఓ ఇరవై అయిదు చీజ్‌ చికెన్‌ సమోసా  పార్సిల్‌’ అనే ఆర్డర్లు, హడావుడే ఎక్కువగా ఉంటుంది. ఆరు రకాల నాన్‌ వెజ్‌ సమోసాలు, ఆరు రకాల వెజ్‌ సమోసాలని రెండు బాండీలలో వేరు వేరుగా వేయించి వేడివేడిగా అందిస్తున్నారు. ‘కుటుంబ పోషణ కోసం ఎనిమిదేళ్ళ వయసులో నేను నేర్చుకున్న సమోసా తయారీ నా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి దోహద పడింది. రుచి, నాణ్యతలో శ్రధ్ద పెట్టడం వల్లే ఇది సాధ్యం అయ్యింది’ అంటారు లక్ష్మి. మొదట తానే ప్రారంభించినప్పటికీ భర్త శ్రీనివాసరావు చేదోడుగా నిలవడంతో వ్యాపారం పెరిగిందన్నారామె. కరకరలాడే ఈ సమోసాలు ప్లేటుకి రెండు, కొన్ని మూడు కూడా ఇస్తారు. ఏ సమోసాతో అయినా ఉప్పు చల్లిన మిర్చి, ఉల్లిపాయ ముక్కలతో తిని ఆహా అనాల్సిందే.

వసంత్‌కుమార్‌ ఘంటశాల, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని