సోయా.. రుచుల మాయ!

ఇంట్లో ఏం లేకపోతే.. మీల్‌మేకర్లు ఉరఫ్‌ సోయా వడియాలు ఉంటే చాలు రుచులతో మాయాజాలం చేసేయొచ్చు. నాన్‌వెజ్‌ రుచిని తలపించే ఈ సోయాతో మంచూరియాలు, బిర్యానీలు చేసి  ఇంట్లో మంచి మార్కులు కొట్టేయొచ్చు. పోషకాలు నిండుగా ఉండే సోయా వంటకాలివి.. 

Updated : 05 Feb 2023 00:49 IST

ఇంట్లో ఏం లేకపోతే.. మీల్‌మేకర్లు ఉరఫ్‌ సోయా వడియాలు ఉంటే చాలు రుచులతో మాయాజాలం చేసేయొచ్చు. నాన్‌వెజ్‌ రుచిని తలపించే ఈ సోయాతో మంచూరియాలు, బిర్యానీలు చేసి  ఇంట్లో మంచి మార్కులు కొట్టేయొచ్చు. పోషకాలు నిండుగా ఉండే సోయా వంటకాలివి..  


మీల్‌మేకర్‌ ఫ్రై

కావాల్సినవి: సోయాచంక్స్‌- రెండు కప్పులు, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- మూడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ఉప్పు- తగినంత, కొత్తమీర తరుగు- చెంచా, నూనె- 4చెంచాలు, ఆవాలు- తాలింపుకోసం, కరివేపాకురెబ్బ- ఒకటి, కారం- చెంచా, ధనియాలపొడి- 2 చెంచాలు, జీలకర్రపొడి- పావు చెంచా, గరంమసాలా- అరచెంచా, పసుపు- పావుచెంచా, మిరియాలపొడి- పావుచెంచా

తయారీ: కొద్దిగా ఉప్పువేసిన వేడినీళ్లలో సోయాచంక్స్‌ని పావుగంటపాటు నానబెట్టుకోవాలి. తర్వాత.. చంక్స్‌ని పిండి పక్కనపెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెెక్కాక అందులో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. సోయాచంక్స్‌ వేసి కలిపి పావుకప్పు నీరుపోసి మూతపెట్టి ఆ నీళ్లన్నీ ఇగిరిపోనివ్వాలి. ఆ తర్వాత మసాలా పొడులన్నీ వేసుకుని మరో రెండు చెంచాల నూనె వేసుకుని మంట పెంచి చంక్స్‌ని వేయించుకోవాలి. ఆ పొడులు అందుబాటులో లేకపోతే... చికెన్‌ మసాలా వేసి వేయించుకున్నా సరిపోతుంది.


కట్‌లెట్‌

కావాల్సినవి: మీల్‌మేకర్‌- కప్పు, ఉడికించిన బంగాళ దుంపలు- రెండు, అల్లం- చిన్నముక్క, ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- చెంచా, కారం- చెంచా, గరంమసాల- అరచెంచా, ధనియాలపొడి- అర చెంచా, ఆమ్‌చూర్‌పొడి- అరచెంచా, చాట్‌ మసాల- అరచెంచా, బ్రెడ్‌పొడి- ముప్పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా,  బైడింగ్‌కి కావల్సినవి: మైదా- రెండు చెంచాలు, కార్న్‌ ఫ్లోర్‌- రెండు చెంచాలు, నీళ్లు- పావు కప్పు

తయారీ: మీల్‌మేకర్‌ని పావుగంట పాటు వేడినీళ్లలో నానబెట్టి.. వాటిల్లోని నీరంతా పిండేయాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి చిన్నముక్కలు చేసుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకుని ఉడికించిన బంగాళదుంపల్ని చేత్తో మెదుపుకొని వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కారం, గరంమసాల, ధనియాల పొడి, చాట్‌మసాల, ఆమ్‌చూర్‌పొడి, తగినంత ఉప్పు వేసి ముద్దగా కలపాలి. నచ్చిన ఆకృతిలో కట్‌లెట్‌లుగా చేసి పక్కన పెట్టుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌, మైదాలలో తగినన్ని నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె పోసి డీప్‌ ఫ్రైకి తగ్గట్టుగా వేడి చేయాలి. ఇపుడు కట్‌లెట్లని మైదా మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్‌పొడిలో దొర్లించి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా  వేయించుకోవాలి. వీటిని గ్రీన్‌ చట్నీ లేదా టొమాటో సాస్‌తో సర్వ్‌ చేసుకోవచ్చు.


మంచూరియా

కావాల్సినవి: సోయాచంక్స్‌- రెండు కప్పులు, నీళ్లు- 4 కప్పులు, మైదా- పావుకప్పు, మొక్కజొన్నపిండి- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, ఉప్పు, మిరియాలపొడి- రుచికి తగినంత, నూనె- ఒకటిన్నర కప్పు, గ్రేవీకోసం: నూనె- నాలుగు చెంచాలు, వెల్లుల్లి పలుకులు- రెండు చెంచాలు, అల్లం తురుము- చెంచా, పచ్చిమిర్చి తురుము- చెంచా, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు- అరకప్పు, వైట్‌ వెనిగర్‌- చెంచా, సోయాసాస్‌- చెంచా, చిల్లీసాస్‌- 2 చెంచాలు, టొమాటో సాస్‌- 2 చెంచాలు, ఉప్పు- తగినంత, నీళ్లు- కప్పు, ఉల్లిపొరక- ఒక కాడ

తయారీ: ఒక పాన్‌లో నీళ్లు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని సోయాచంక్స్‌ మృదువుగా అయ్యేంతవరకూ ఉడికించుకుని తర్వాత నీళ్లు వార్చి చంక్స్‌లోని నీరంతా పోయేలా పిండేయాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె పోసుకుని అందులో సోయాచంక్స్‌ని వేసి కరకరలాడేలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, మిరియాలపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, వేయించిన సోయాచంక్స్‌ వేసుకుని కలుపుకోవాలి. వీటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక గ్రేవీ కోసం.. ఒక పాన్‌లో కొద్దిగా నూనెపోసి అందులో వెల్లుల్లి పలుకులు, అల్లం, పచ్చిమిర్చి పలుకులు వేసి నిమిషం పాటు వేయించుకోవాలి. మాడిపోనివ్వద్దు. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌ ముక్కలు, వెనిగర్‌, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటోసాస్‌ వేసి మరో నిమిషంపాటు వేయించాలి. ఎక్కువ సేపు వేయిస్తే ముద్ద అయిపోతాయి. ఇందులో కప్పు నీళ్లు కాస్త ఉప్పు వేసి అవి దగ్గరకు వస్తున్నప్పుడు అందులో సోయా చంక్స్‌ వేసి రెండు నిమిషాలు ఉంచితే మంచూరియా సిద్ధం.


సోయా, క్యాబేజీ కూర

కావల్సినవి: సన్నగా తరిగిన క్యాబేజీ తరుము- కప్పు, మీల్‌ మేకర్స్‌- కప్పు, కారం- చెంచా, ధనియాల పొడి- చెంచా, పసుపు- పావుచెంచా, జీలకర్ర- అర చెంచా, ఉల్లిపాయ- 1, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, టొమాటోలు- రెండు, పచ్చిమిర్చి- మూడు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- చెంచా

తయారీ: ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి కాస్త ఉప్పు కూడా వేసి సోయా ముక్కలను పావుగంటపాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు లేకుండా మీల్‌ మేకర్స్‌ని పిండుకోవాలి. స్టౌపై కడాయి పెట్టుకొని చెంచా నూనె పోసి వేడిచేయాలి. మీల్‌ మేకర్స్‌ను బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో మరో చెంచా నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపాక, సన్నగా తరిగిన టొమాటో ముక్కలను వేసి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు తరిగిన క్యాబేజీ, వేయించి పెట్టుకున్న సోయా ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 10నిమిషాలు సన్నమంటపై ఉడికించుకోవాలి. దింపాక కొత్తిమీర చల్లుకుంటే సరి. ఈ కూర రోటీ, అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.


సోయా రైస్‌

కావల్సినవి: మీల్‌మేకర్‌- కప్పు, ఉల్లిపాయలు- రెండు, నానబెట్టిన బఠానీలు- పావుకప్పు, బిర్యానీ ఆకు- ఒకటి, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- అరచెంచా, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, గడ్డ పెరుగు- రెండు చెంచాలు, సన్న బియ్యం- రెండు కప్పులు, టొమాటో- ఒకటి, లవంగాలు- రెండు, దాల్చినచెక్క- చిన్నది, పసుపు- పావుచెంచా, నీళ్లు- నాలుగు కప్పులు, నెయ్యి- మూడు చెంచాలు, నిమ్మరసం- చెంచా

తయారీ: బియ్యాన్ని 10 నిమిషాలు నీళ్లలో నానబెట్టుకోవాలి. మీల్‌ మేకర్లని వేడి నీళ్లలో 20 నిమిషాలపాటు నాననివ్వాలి. స్టౌపై కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, లవంగాలు ,చెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, బఠానీలు వేసి కలియబెట్టాలి. కాసేపటి తర్వాత నీళ్లు పిండేసిన మీల్‌ మేకర్లని కడాయిలో వేసుకోవాలి. తర్వాత పెరుగు, బియ్యం, పసుపు వేసి సరిపడా నీళ్లు, ఉప్పు వేయాలి. చివర్లో నిమ్మరసం కూడా వేసి మూత పెట్టి మూడు విజిల్స్‌ రానివ్వాలి. దాన్ని మరో గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి మీల్‌ మేకర్‌ రైస్‌ రెడీ! దీన్ని రైతాతో తింటే అద్భుతం అనాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని