కట్టా.. మీఠా.. రుచి అదుర్స్!
కొంచెం తీపి... కొంచెం పులుపు కలిస్తే చిరుతిళ్ళు, కూరలు... భలే రుచిగా ఉంటాయి. ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లో చేసుకునే మరికొన్ని రుచులు చూసేద్దాం!
కొంచెం తీపి... కొంచెం పులుపు కలిస్తే చిరుతిళ్ళు, కూరలు... భలే రుచిగా ఉంటాయి. ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లో చేసుకునే మరికొన్ని రుచులు చూసేద్దాం!
చికెన్..
కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్- పావుకేజీ, పైనాపిల్- పావుకప్పు, తరిగిన క్యాప్సికం- ఒకటి, పైనాపిల్ గుజ్జు- ఒకకప్పు, తరిగిన ఉల్లికాడలు- కొద్దిగా, తేనె- చెంచా, వెనిగర్- ఒకచెంచా, తరిగిన వెల్లుల్లి- ఒకచెంచా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా, కార్న్‌ఫ్లోర్- రెండు చెంచాలు, మైదా- పావుకప్పు, ఉప్పు- తగినంత, కారం- తగినంత, మిరియాల పొడి- ఒకచెంచా, పంచదార- ఒకచెంచా, సోయాసాస్, టొమాటో సాస్- ఒకచెంచా చొప్పున, గుడ్డు- ఒకటి.
తయారీ: చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో గుడ్డు సొన, మైదా, కార్న్‌ఫ్లోర్ రెండు చెంచాలు, మిరియాలపొడి వేసి కలిపి పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసి అది వేడయ్యాక దాంట్లో చికెన్‌ను పకోడిల్లా వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయిలో రెండు చెంచాల నూనె వేసి అందులో క్యాప్సికం, పైనాపిల్ ముక్కలు వేసి విడివిడిగా దోరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని అందులోనే తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తర్వాత పైనాపిల్ గుజ్జు, టొమాటో సాస్, సొయా సాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. తర్వాత తేనె, పంచదార వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. ఆపై చికెన్‌ను అందులో వేసి కలియతిప్పాలి. నిమిషం పాటు ఉడికించి ఉల్లికాడలు వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
వంకాయతో..
కావల్సిన పదార్థాలు:వంకాయలు- పావుకేజీ, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, కారం- తగినంత, ఆవనూనె- రెండు చెంచాలు, పసుపు- కొద్దిగా, ధనియాల పొడి- ఒకచెంచా, అల్లం, పచ్చిమిర్చి పేస్టు- రెండు చెంచాలు, టొమాటో గుజ్జు- ఒక కప్పు, కరివేపాకు- కొద్దిగా, గరంమసాలా- ఒక చెంచా, పచ్చికొబ్బరి పేస్టు- రెండు చెంచాలు, బెల్లం- 50గ్రాములు, నల్లఉప్పు- కొద్దిగా, చింతపండు గుజ్జు- పావుకప్పు, కొత్తిమీర- కొద్దిగా.
తయారీ: ముందుగా వంకాయలను నాలుగు భాగాలుగా మధ్యలోకి గాటు పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక వంకాయలు వేసి వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఆవనూనె వేసి అల్లం, పచ్చిమిర్చి పేస్టును వేసి వేగనివ్వాలి. తర్వాత గరంమసాలా, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి వేగనివ్వాలి. దాంట్లో టొమాటో గుజ్జువేసి నీళ్లు మొత్తం ఇగిరే వరకూ మగ్గనివ్వాలి. తర్వాత వంకాయలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పచ్చికొబ్బరి, బెల్లం తురుము, కరివేపాకు, నల్లఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవాలి.
మినప వడియాల పులుసు..
కావల్సిన పదార్థాలు: నప వడియాలు- ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ- ఒకకప్పు, పచ్చిమిర్చి- మూడు, కారం- తగినంత, ఉప్పు- తగినంత, కరివేపాకు- కొద్దిగా, పోపుదినుసులు- కొద్దిగా, టొమాటో ముక్కలు- ఒక కప్పు, కొత్తిమీర- కొద్దిగా, చింతపండు గుజ్జు- పావుకప్పు, బెల్లం- 50గ్రాములు, నూనె- తగినంత, ధనియాల పొడి- ఒక చెంచా.
తయారీ: కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని కాగనివ్వాలి. దాంట్లో వడియాలు వేసి ఎర్రగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. కారం, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం, వడియాలు, కొత్తిమీర, ధనియాలపొడి వేసి నిమిషం పాటు ఉడికించి దింపుకోవాలి. అంతే సర్వ్ చేసుకోవటమే..
కలగూర..
కావల్సిన పదార్థాలు: క్యాప్సికం- ఒకటి, బంగాళదుంపలు- రెండు, క్యారెట్- ఒకటి, బీన్స్- కొద్దిగా, క్యాలిఫ్లవర్- కొద్దిగా, పనీర్- 100గ్రాములు, పచ్చి బఠానీ- పావుకప్పు, బేబీకార్న్- పావుకప్పు, టొమాటో ముక్కలు- ఒకకప్పు, ధనియాల పొడి- ఒకచెంచా, గరంమసాలా- ఒకచెంచా, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, కారం- తగినంత, కొత్తిమీర- కొద్దిగా, చింతపండు గుజ్జు- పావుకప్పు, బెల్లం- 50గ్రాములు, మీగడ- రెండు చెంచాలు, అల్లం, వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ఉల్లిపాయలు పెద్దవి- రెండు, పచ్చిమిర్చి- మూడు.
తయారీ: ముందుగా కూరగాయలను తరిగి కడాయిలో తగినంత నూనె వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టి అదే మూకుట్లో పనీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. వాటిని గిన్నెలోకి తీసుకొని కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి, టొమాటో ముక్కలు ఆపై ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలుపుకోవాలి. దాంట్లో కూరగాయ ముక్కలు, చింతపండు గుజ్జు, బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత చివర్లో మీగడ, కొత్తిమీర వేసి కలపాలి. అంతే మిక్స్‌డ్ వెజ్ కర్రీ రెడీ..
చిలగడదుంప పులుసు..
కావల్సిన పదార్థాలు: చిలగడదుంపలు- పావుకేజీ, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు, టొమాటో ముక్కలు- ఒకకప్పు, పెరుగు- రెండు చెంచాలు, కారం- తగినంత, ఉప్పు- తగినంత, ధనియాలపొడి- అరచెంచా, గరంమసాలా- అరచెంచా, నూనె- తగినంత, ఆవాలు- కొద్దిగా, జీలకర్ర- కొద్దిగా, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, బెల్లం- 50గ్రాములు.
తయారీ: చిలగడదుంపలను పొట్టు తీసి, ముక్కలుగా కోసి నీళ్లలో వేసుకోవాలి. కడాయిలో కూరకి సరిపడా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, మసాలా పొడులు వేసి కలపాలి. టొమాటో ముక్కలు, గిలకొట్టిన పెరుగు వేసి మగ్గనివ్వాలి. తర్వాత చిలగడదుంప ముక్కలు వేసి మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు వేయాలి. చివర్లో బెల్లం, కొత్తిమీర వేసి ఒక నిమిషం ఉడికించి సర్వ్ చేసుకోవటమే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం