కాల్చండి కమ్మగా...

వణికించే చలి ఓపక్క... వేడివేడిగా పొగలుకక్కే చికెన్‌ కబాబ్‌ ఓ పక్క ఇవి చాలు.. ఆహారప్రియుల కళ్లముందు స్వర్గం కనిపించడానికి! పైగా ఇప్పుడు కబాబ్‌లు కావాలంటే.. మునుపటిలా హోటల్‌కి వెళ్లి గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే.. గ్రిల్‌ తీయండి బొగ్గు రాజేయండి... దోరదోరగా ముక్కలు కాల్చేయండి..

Published : 27 Nov 2017 16:47 IST

కాల్చండి కమ్మగా...

వణికించే చలి ఓపక్క... వేడివేడిగా పొగలుకక్కే చికెన్‌ కబాబ్‌ ఓ పక్క ఇవి చాలు.. ఆహారప్రియుల కళ్లముందు స్వర్గం కనిపించడానికి!
పైగా ఇప్పుడు కబాబ్‌లు కావాలంటే.. మునుపటిలా హోటల్‌కి వెళ్లి గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే.. గ్రిల్‌ తీయండి
బొగ్గు రాజేయండి... దోరదోరగా ముక్కలు కాల్చేయండి.. ఏ కెచప్‌తోనో.. మిర్చీసాస్‌తోనో కలిపి తినేయండి..

బార్బిక్యూ, బీబీక్యూ... గ్రిల్డ్‌, కబాబ్‌, టిక్కా, సీకులు పేర్లు ఏవైనా రుచి మాత్రం అదే. ఒక్కసారి నాలుకపై పడిందా... మనసుని అంటుకుని వదలదే! అదే కబాబ్‌ల గమ్మత్తు. అందుకే వారంలో ఒక్కసారైనా కబాబ్‌ తినమని మనసు ఒకటే పోరుపెడుతుంది. అయితే అస్తమాను హోటల్‌కో, రెస్టరెంట్‌కో వెళ్లడం అంటే ఖర్చుతో కూడిన పనే. అదే ఇంట్లోనే చేసుకోవడం తెలిస్తే రుచితోపాటూ, ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది.

నూనె తక్కువ... రుచి ఎక్కువ...
మిక్సీ, గ్రైండర్‌, ఒవెన్‌లానే ఇప్పుడు చాలా ఇళ్లలో పర్సనల్‌ గ్రిల్‌ తప్పనిసరి వస్తువు అయిపోయింది. కూరవండాలంటే ఉల్లిపాయలు తరిగి... మూకుడు పెట్టి అబ్బో పెద్దపని. అదే కబాబ్‌ అయితేనా? గ్రిల్‌ తీసి కాసిని బొగ్గులు రాజేస్తే సరి. స్కూయర్‌ లేదా వూసలకి మసాలా పట్టించిన మాంసం ముక్కలు గుచ్చి దోరగా కాల్చేయొచ్చు. అంతకంటే సులభంగా అయిపోవాలంటే బొగ్గులపై గ్రిల్‌ పెట్టి చేపలూ, రొయ్యలు పెట్టి చూడండి. నిమిషాల్లో రుచికరమైన సీఫుడ్‌ సిద్ధం. బస్‌.. గ్రిల్డ్‌ ఫుడ్‌ తయారీలో ఇంతకన్నా దాపరికం ఏం లేదు. కాకపోతే... ఏ బొగ్గులమీద వండుతున్నారూ, ఏ గ్రిల్‌ వాడుతున్నారు, ఏ మసాలాలు వాడుతున్నారో అందులో కాసిని కిటుకులు తెలిశాయో మీరూ బార్బిక్యూ ఎక్స్‌పర్ట్‌ అయిపోవచ్చు.

బొగ్గులతో సహా.. ఆన్‌లైన్‌లో..
బొగ్గులు మనకెక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? బయట దొరికితే సరే... లేకపోతే ఆమెజాన్‌లో ‘చార్‌కోల్‌ స్టార్టర్‌ కిట్‌’ దొరుకుతోంది. ఇందులో పదార్థాలు పట్టుకోడానికి ఉపయోగించే టాంగ్స్‌ దగ్గర నుంచి మసాలాలు పట్టించేందుకు ఉపయోగపడే బ్రష్‌, బొగ్గులూ, వాటిని వెలిగించేందుకు చిమ్నీ స్టార్టర్‌ వంటివన్నీ ఈ కిట్‌లో ఉంటున్నాయి. ఆర్డర్‌ చేసిన వెంటనే ఈ కిట్‌లు మనింటికి చేరిపోతున్నాయి. పర్సనల్‌ గ్రిల్స్‌ రెండు వేల రూపాయల నుంచే అందుబాటులో ఉన్నాయి. రుచుల్లో వైవిధ్యం కోరుకునే వారు చాలామంది తేలిగ్గా అయ్యే ఈ వంటకాలని ప్రయత్నిస్తున్నారు.

రుచిని పెంచేద్దాం
గ్రిల్డ్‌ పదార్థాలకు చక్కని రుచి రావాలంటే.. గల్లుప్పు, కొత్తిమీర, దాల్చిన చెక్కపొడి, జీరాపొడి వంటి వాటిని మసాలాలుగా జోడిస్తే వాటి రుచి రెట్టింపు అవుతుంది.
బొగ్గులపై నిమ్మ తొక్కలూ, బిర్యానీ ఆకు, థైమ్‌ వంటివి చల్లితే పదార్థాలకు వివిధ ఫ్లేవర్లు సొంతమవుతాయి.
కబాబ్‌లను కెచప్‌, స్వీటీచిల్లీసాస్‌, చిల్లీసాస్‌లతో తింటే ఆ రుచి భలేగా ఉంటుంది.

‘మొదట్లో నగరంలో ఇంతగా కబాబ్స్‌ దుకాణాలు ఉండేవి కావు. దేవరకద్ర వెళ్లి తినొచ్చేవాడిని. అంతదూరం వెళ్లడం ఎందుకు.. ఇంట్లోనే చేసుకోలేమా అనే ఆలోచన వచ్చి సొంత ప్రయత్నం చేశా. అప్పట్లో ఆన్‌లైన్‌ అమ్మకాలు లేవు.. ఉస్మానియా ఆసుపత్రి దగ్గర బట్టీ, బొగ్గులూ, సీకులూ దొరికితే కొని సొంత ప్రయత్నాలు మొదలుపెట్టా. పదేళ్లుగా నేను చేసే కబాబ్స్‌కు మా ఇంట్లో, బంధువుల్లో ఫ్యాన్స్‌ సంఘాలే ఉన్నాయి. వారానికోసారి రెండు కిలోల బ్రాయిలర్‌ చికెన్‌ తెస్తా. నూనె వాడే ప్రసక్తే లేదు. అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం పట్టిస్తా బస్‌! గెట్‌టుగెదర్లూ, పిక్నిక్‌లప్పుడు గ్రిల్‌ వెంటపెట్టుకుని వెళ్లిపోవడమే’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన కబాబ్‌ లవర్‌ భుజంగరెడ్డి.

ఎక్కువ కొవ్వు చేరదు..
బొగ్గులపై వండే ఆహారానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. చికెన్‌, మటన్‌ వంటి వాటిల్లో సహజంగానే కొంత కొవ్వు ఉంటుంది. అలాంటి వాటికి మరికొంత కొవ్వు చేర్చకుండా ఇలా గ్రిల్‌పై వండుకోవడం మంచిదే. కెలొరీలు చేరకుండా ఉంటాయి. అయితే కాయగూరల విషయానికి కొచ్చేసరికి ఈ విధానంలో కొన్ని విటమిన్లని కోల్పోయే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతల మీద వండటం ఇలా జరుగుతుంది. పాత రోజుల్లో తేగలూ, చిలగడ దుంపలూ ఇలానే పొయ్యిలో వేసి కాల్చుకుని తినేవారు.

- శ్రీదేవి జాస్తి, పోషకాహార నిపుణురాలు

* సూర్యుడు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయి, చలి ఎక్కువయ్యే వేళ అమెరికాలో సామూహికంగా అందరూ బయటకు వచ్చి ఎండలో కూర్చుని ఈ గ్రిల్స్‌పై పదార్థాలు కాల్చుకుని తింటూ ఫుడ్‌ ఫెస్టివల్స్‌ జరుపుకుంటారు.
* బొగ్గుల్లో కొన్ని పెద్దగా పొగ రావు.. వేడిని మాత్రం బాగానే ఉత్పత్తి చేస్తాయి. అలాంటి వాటినే ఉపయోగించుకోవాలి. బొగ్గులకన్నా... చిన్న చెక్క పెల్లెట్స్‌, చిప్స్‌, చంక్స్‌ వంటివి ఇంకా మంచివి. బొగ్గు, మసి అనుకునేవారికి ఎలక్ట్రికల్‌ గ్రిల్స్‌ కూడా దొరుకుతున్నాయి.

పనీర్‌తో..

 పనీర్‌- 200 గ్రా, ఉప్పు- తగినంత, పసుపు- కొద్దిగా, నూనె- చెంచా, టొమాటో కెచప్‌- చెంచా, కారం- చెంచా

తయారీ: పనీర్‌ ముక్కలని కావాల్సిన పరిమాణంలో క్యూబ్స్‌ మాదిరిగా తరిగిపెట్టుకుని తడి లేకుండా చూసి ఒక పాత్రలో వేసుకోవాలి. ఈ ముక్కలకి ఉప్పు, పసుపు, నూనె, కారం, కెచప్‌ పట్టించి ఓ పావుగంట పక్కన పెట్టేయాలి. తర్వాత వాటిని స్కూయర్స్‌కి గుచ్చుకుని గ్రిల్‌ పాన్‌పై పెట్టి నూనె స్ప్రే చేసి కాల్చుకుంటే పదినిమిషాల్లో గ్రిల్డ్‌ పనీర్‌ సిద్ధం.

చికెన్‌ కబాబ్‌

బోన్‌లెస్‌ చికెన్‌- పావుకిలో, నిమ్మరసం- కొద్దిగా, ఆవనూనె లేదా ఆలివ్‌నూనె- చెంచాడు, పెరుగు- రెండు చెంచాలు, వైట్‌పెప్పర్‌- కొద్దిగా, కారం- చెంచా, గరంమసాలా- చెంచా

తయారీ: ఒక పాత్రలో చికెన్‌ని తీసుకుని దానికి ఉప్పు, నిమ్మరసం, పెరుగు, ఆవనూనె, పెప్పర్‌, కారం పట్టించి మూడు గంటల పాటూ పక్కనపెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉన్నా మంచిదే. తర్వాత వాటిని వూసలకి గుచ్చి గ్రిల్‌పై కాల్చుకోవడమే. దీనిని స్వీట్‌చిల్లీసాస్‌తో తింటే బాగుంటుంది.

పైనాపిల్‌ టిక్కా...

అనాస ముక్కలు- ఒక కప్పు(రెండు సెంటీమీటర్ల మందంతో), కారం- కొద్దిగా, ఉప్పు- కొద్దిగా, చాట్‌ మసాలా- అరచెంచా, నూనె- కొద్దిగా

తయారీ: ఒక కప్పులో అనాసముక్కలతో పాటూ అన్నింటినీ వేసి కలుపుకొని ఇరవైనిమిషాలపాటూ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్కూయర్‌కి గుచ్చుకుని గ్రిల్‌ మీద కాల్చుకుంటే ఇరవై నిమిషాలకు పైనాపిల్‌ టిక్కా సిద్ధం.

చేపలతో..

ముల్లులేని చేపలు(సందువా, అపోలో మేలు)- పావుకిలో చిన్నముక్కలుగా తరగాలి, పెరుగు- పావుకప్పు, నిమ్మరసం- చెంచా, కారం- చెంచా, గరంమసాలా- చెంచా, మెంతి గింజలు- నాలుగైదు, జీలకర్ర- చెంచాన్నర, కొత్తిమీర- కట్ట, ఉప్పు- కొద్దిగా, చెక్క స్కూయర్స్‌ మూడు- అరగంటపాటూ నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలి.

తయారీ: అప్పటికప్పుడు జీలకర్రనీ, మెంతులని దోరగా వేయించుకుని పొడికొట్టుకుని పెట్టుకోవాలి. ఈ పొడి చేపలపై చల్లి బాగా కలుపుకోవాలి. దీనికి నిమ్మరసం, గరంమసాలా, పెరుగు, కారం, ఉప్పు కలిపి అరగంట పాటూ పక్కన పెట్టుకోవాలి.

చేపలని చెక్క స్కూయర్స్‌కి గుచ్చి గ్రిల్‌పై పెట్టాలి. చేప త్వరగా ఉడికిపోతుంది కాబట్టి అటూ ఇటూ తిప్పుతూ దగ్గరుండి కాల్చుకోవాలి. ఇలా అయితే ఓ పదినిమిషాల్లో చేప ఉడికి బీబీక్యూ ఫిష్‌ రెడీ అవుతుంది.

రొయ్య కబాబ్‌

పొట్టు వలిచి శుభ్రం చేసిన రొయ్యలు- అరకిలో, నిమ్మరసం- రెండు చెంచాలు, వంటనూనె- రెండు చెంచాలు, వెల్లుల్లి పలుకులు- చెంచా, కారం- రెండు చెంచాలు, జీలకర్ర పొడి- అరచెంచా, ఉప్పు- అరచెంచా, మిరియాలపొడి- పావుచెంచా, మిర్చీ ఫ్లేక్స్‌- కొద్దిగా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు

తయారీ: ఒక పాత్రలో నూనె తప్పించి తక్కినవన్నీ వేసి చివరిగా రొయ్యలూ, నూనె కూడా వేసి కలియతిప్పి అరగంటపాటూ పక్కనపెట్టేయాలి. తర్వాత వాటిని ఒక స్కూయర్‌కి గుచ్చి రెండు వైపులా తిప్పుతూ ఐదైదు నిమిషాల చొప్పున కాల్చితే రొయ్యల కబాబ్‌ సిద్ధం. కొత్తిమీర తరుగు చల్లుకుని చిల్లీసాస్‌తో కలిపి తిని చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని