అంకాపూర్‌ నాటుకోడి అదుర్స్‌

అసలే అది నాటుకోడి.. ఇక ఆ రుచికి కల్వంలో దంచిన మసాలాలు తోడయితే ఆ ఘుమఘుమలు ఎలా ఉంటాయో తెలుసా?

Published : 10 Dec 2017 01:49 IST

పక్కాలోకల్‌

అంకాపూర్‌ నాటుకోడి అదుర్స్‌

అసలే అది నాటుకోడి.. ఇక ఆ రుచికి కల్వంలో దంచిన మసాలాలు తోడయితే ఆ ఘుమఘుమలు ఎలా ఉంటాయో తెలుసా? ఊహుఁ చెప్పడంకష్టం. అయినా.. చదవబోతూ రుచెందుకు అడుగుతారు లెండి? అంకాపూర్‌ నాటుకోడి కూరని వండివార్చాం చదవండి...
నిజామాబాద్‌ జిల్లా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది నిజాంసాగర్‌ జలాశయం. బోధన్‌ చక్కెర కర్మాగారం. వీటితోపాటూ విత్తన ఉత్పత్తిలో ఆదర్శంగా నిలిచిన అంకాపూర్‌ గ్రామం. నిజామాబాద్‌-ఆర్మూరు ప్రధాన రహదారిపై ఉన్న ఈ గ్రామానికి  దేశీ కోడి కూర(నాటు కోడికూర) తయారీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకత నిజామాబాద్‌ ఎల్లలు దాటి.. దేశవిదేశాలకు పాకింది.
విలేకరినని చెప్పి...
ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 1985లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫియట్‌ కారును నడుపుకుంటూ ఒక్కరే అంకాపూర్‌కు వచ్చి విలేకరినని చెప్పి నాటుకోడి మాంసం రుచి చూసి ఫిదా అయ్యారు. ఆ తరువాత తమ గ్రామానికి వచ్చింది ఎమ్మెల్యే అని తెలిసి గ్రామస్థులు చాలా సంతోషించారట. ఈ విషయాలను కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో అంకాపూర్‌ వచ్చినప్పుడు గుర్తుచేసుకున్నారు. ఆయన మాత్రమే కాదు ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ రుచికి ఫిదా అయ్యారు.
నలభై ఏళ్లుగా అదే రుచి...
నలభై ఏళ్ల క్రితం ఆ ఊరికి ఈ రుచిని పరిచయం చేసింది పెద్ద రామాగౌడ్‌. ఆయన చేసిన నాటుకోడి కూర రుచిని చూసిన ఆ ఊరి గ్రామ పెద్దలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ హోటల్‌ను ప్రారంభించాలని కోరారు. ఇలా అంకాపూర్‌ దేశీ చికెన్‌ ప్రాశస్త్యం మొదలైంది. పెద్దరామాగౌడ్‌ 20 ఏళ్ల పాటు దేశీచికెన్‌ తయారీలో చేయితిరిగిన వక్తిగా గుర్తింపు పొందారు. ఇదే సమయంలో మూడు, నాలుగేళ్ల వ్యవధిలో అంకాపూర్‌ గ్రామానికి చెందిన దుబ్బాగౌడ్‌, బోయ బొర్రన్నలు దేశీచికెన్‌ తయారీలో పేరు గడించారు. పెద్ద రామాగౌడ్‌ మరణించడంతో ఈయన కుమారుడు మల్లాగౌడ్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అంకాపూర్‌ రుచులను అందిస్తూ మాంసాహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు. నలుగురికి సరిపడా అన్నం, ఒక నాటుకోడి కూర.. ఒక ప్యాక్‌ కింద అందిస్తారు. ప్రస్తుతం దీని ధర రూ.550. అంకాపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఐదు కి.మీ పరిధిలో ఉన్న గ్రామస్థులు ఆర్డర్లపై వండి స్వయంగా సరఫరా చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తే తెల్లవారుజామునే లేచి కోడికూర సిద్ధం చేసి పంపుతారు. ప్రస్తుతం గ్రామంలో పదకొండు కోడికూర తయారీ కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్‌లో మూడు ఉన్నాయి.

మసాలాలు ప్రత్యేకం.. 

ఇళ్ళల్లో, హోటళ్ళలో వాడే మసాలాలకు భిన్నంగా వీరు మసాలా దినుసులను వాడతారు. తరిగిన ఉల్లిగడ్డలు, దంచిన అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు ప్రధానంగా ఉపయోగిస్తారు. వాటితోపాటూ కల్వంలో దంచిన ఎండు కొబ్బరి తురుము, పల్లీల పొడి, యాలకులు, లవంగాలు, సాజీర, కొత్తిమీర ఈ రుచికి ప్రధాన కారణం. కూర తయారీలో సంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తారు. కల్వంలో వేసి దంచుతారు.

- గోనుగుంట్ల సోమనాథ్‌, ఈనాడు, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని