కాజా బిర్యాని.. వండకుండానే కొనేసుకుంటారు!

కొబ్బరి చెట్ల మధ్యలోంచి, ఓ సాయంత్రపు వేళ.. రయ్‌మంటూ....

Published : 25 Mar 2018 01:24 IST

కాజా బిర్యాని.. వండకుండానే కొనేసుకుంటారు!
పక్కాలోకల్‌

కొబ్బరి చెట్ల మధ్యలోంచి, ఓ సాయంత్రపు వేళ.. రయ్‌మంటూ వెళుతున్న మోటార్‌సైకిల్‌కి ఒక్కసారిగా బ్రేక్‌ పడుతుంది. అక్కడ దంచికొట్టే మసాలా వాసనల్ని ఆస్వాదిస్తూ శ్వాస ఆనందిస్తుంది. ఆ వెంటే నోట్లో నీళ్లూరతాయి. కాళ్లు అప్రయత్నంగా కాజా బిర్యానీ సెంటర్‌లోకి నడిచేస్తాయి. ఓ మాంచి ధమ్‌ బిర్యానీ రుచి చూసేందుకు సిద్ధపడుతూ...
పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఇప్పుడైతే ధమ్‌ బిర్యానీ మామూలే కావచ్చు. దాదాపుగా పదిహేనేళ్ల కిందట, రుచికరమైన ధమ్‌బిర్యాని అన్నిచోట్లా దొరికేది కాదు. గోదారోళ్లకైతే అప్పటికి ఈ రుచి గురించి పెద్దగా తెలియదు. అలాంటి సమయంలో వాళ్లకు అద్దిరిపోయే రుచితో ధమ్‌ బిర్యానీని పరిచయం చేసింది ‘కాజా బిర్యానీ’. కాజా అనగానే జీడిపప్పులు కానీ వేసి ఈ బిర్యానిని చేస్తారేమో అనుకునేరు. అదేంకాదు కాజా అనేది ప్రాంతం పేరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు వెళ్లే రోడ్డులో పదిహేను నిమిషాలు ప్రయాణిస్తే కాజ అనే చిన్న ఊరొస్తుంది. మామూలుగా అయితే ఈ ఊరి పేరు ఎవరికీ తెలిసి ఉండేది కాదేమో. కానీ ఇక్కడ దొరికే బిర్యానీతోనే ఈ చిన్న పల్లె పేరు భలే ఫేమస్‌ అయిపోయింది. ఫలితంగా ఆ దుకాణానికీ ‘కాజా బిర్యానీ’ అనే పేరొచ్చేసింది. ఈ దుకాణం యజమాని పేరు మేళం రామాంజనేయులు. చికెన్‌తో పంజాబీ ధమ్‌ బిర్యానీ చేయడం నేర్చుకుని ‘శ్రీరామ్‌ పంజాబీ బిర్యానీ’ పేరుతో దీన్ని చిన్న పూరి పాకలో ప్రారంభించారు. కొంత కాలానికే ఆయన చేతి బిర్యానీ రుచి, ఆ ప్రత్యేకమైన మసాలా ఘాటు స్థానికులందరికీ తెగ నచ్చేసింది.
తారలు మెచ్చిన ఆయిల్‌లెస్‌ బిర్యాని...
చిరంజీవి, శ్రీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌, సిద్ధార్థ, ప్రభాస్‌...వంటి తారలు ఈ బిర్యానీని రుచి చూసి ఫిదా అయిపోయినవారే. వీరే కాదు.. ఈ చుట్టుపక్కల షూటింగులకొచ్చే చాలా యూనిట్ల వాళ్లు ప్యాకప్‌ చెప్పేయగానే ఈ బిర్యాని పార్శిళ్లు తెప్పించుకుని తినేందుకు ఉవ్విళ్లూరతారు. ఈ చిన్న పల్లెకు దగ్గర్లోనే గోదావరి, దాని తీరంలో చాలా రిసార్టులు ఉన్నాయి. అక్కడికి వచ్చే పర్యటకులంతా ఈ బిర్యానీ రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అన్నట్టు ఇందులో నూనె ఉపయోగించరు. చికెన్‌ కోసం వాడే మారినేషన్‌లో నేతిని వాడతారు. దాంతోనే ధమ్‌ చేస్తారు కాబట్టి ప్రత్యేకించి నూనె వాడరు. బిర్యానీ గిన్నె పొయ్యి ఎక్కక ముందే బిర్యానీ పొట్లాలు ముందుగా బుక్‌ అయిపోయేవి. లైన్‌లో నిలబడి టోకెన్లు ముందుగా తీసుకున్న వారికే తయారైన తర్వాత బిర్యానీ ప్యాకెట్‌ చేతికొచ్చేది. పక్క ఊర్లలో, పట్టణాల్లో కూడా పోటీగా ధమ్‌ బిర్యానీ సెంటర్లు అందుబాటులోకి వచ్చినా దీని డిమాండ్‌ దీనిదే.

- వి.వై.దీపిక పద్మశ్రీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని