ఇది అరబిక్‌ సంప్రదాయమంది

మధ్యలో పెద్దకంచం. ఆ కంచం మధ్యలో పొగలుకక్కే లేత పొట్టేలు మాంసం, వేడివేడి బిర్యాని. చుట్టూ నలుగురైదుగురు కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తుంటారు. ఆ వంటకం పేరు ‘మంది’. యెమన్‌, కువైట్‌వంటి గల్ఫ్‌దేశాల తర్వాత ‘మంది’ రుచిని అద్భుతంగా వండి వారుస్తున్న నగరం హైదరాబాద్‌...

Published : 15 Apr 2018 01:38 IST

పక్కాలోకల్‌
ఇది అరబిక్‌ సంప్రదాయమంది

మధ్యలో పెద్దకంచం. ఆ కంచం మధ్యలో పొగలుకక్కే లేత పొట్టేలు మాంసం, వేడివేడి బిర్యాని. చుట్టూ నలుగురైదుగురు కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తుంటారు. ఆ వంటకం పేరు ‘మంది’. యెమన్‌, కువైట్‌వంటి గల్ఫ్‌దేశాల తర్వాత ‘మంది’ రుచిని అద్భుతంగా వండి వారుస్తున్న నగరం హైదరాబాద్‌...

ఖరీదైన భోజనాల బల్లలు, నూనెలు, మసాలాలు దట్టించిన ఘుమఘుమలు, హెటెక్‌ కిచెన్‌లు... ఇలా సాధారణంగా మనకు కనిపించే హోటల్‌ సంస్కృతికి భిన్నంగా ఉంటుంది మంది హోటల్‌ సంస్కృతి. పెద్ద కంచంలో లేత పొట్టేలు మాంసం లేదా చికెన్‌తో కలిపి మంది రైస్‌ వడ్డిస్తారు. ముగ్గురు, నలుగురు కలిసి ఒకే కంచంలో నేలమీద కూర్చుని తింటారు. ఇదీ మంది స్టైల్‌. నూనెలు, మసాలాలు ఉండకపోవడం, తాజా మాంసాన్ని వండి చేయడం ఈ వంటకం ప్రత్యేకం. ప్రత్యేకంగా నిర్మించిన బట్టీల్లో నిప్పుల మీద బాండీ ఉంచి అందులో పొట్టేలు మాంసాన్ని కాల్చడం, లేదా ఆవిరిమీద కొన్ని గంటల పాటు ఉడికించడం ద్వారా మందిని తయారుచేస్తారు. ‘ఇందులో ఎక్కడా నూనె వాడకం ఉండదు. మసాలాలు కూడా ఎక్కువగా ఉండవు. మాంసం ఉడికించిన నీటితో ఈ ప్రత్యేకమైన అన్నాన్ని వండుతారు. చూడ్డానికి బిర్యానీలా ఉన్నా ఈ రుచి భిన్నంగా ఉంటుంది. కంచానికి నెయ్యి రాసి అందులో వేడివేడి మంది అన్నంతోపాటుపైన నేతిలో వేయించిన ఉల్లిపాయలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటు పైన్‌నట్స్‌ని వడ్డిస్తారు. చికెన్‌ లేదా పొట్టేలు మాంసాని విడిగా వడ్డిస్తార’ని అంటున్నారు మంది తయారీలో చేయితిరిగిన అంతర్జాతీయ చెఫ్‌ షేక్‌అహ్మద్‌యూసఫ్‌.

ఒకే కంచంలో తింటారు...
‘ఇది స్వచ్ఛమైన అరేబియా వంటకం. యెమన్‌, కువైట్‌ వంటి నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకం. యెమన్‌ నుంచి వచ్చిన అరబ్బీలు బార్కాస్‌ ప్రాంతంలో స్థిరపడ్డంతో..వాళ్లు ఇష్టంగా చేసుకునే మందీ వంటకం మనకీ పరిచయం అయ్యింది. కేవలం పరిచయం కావడంతో సరిపెట్టుకోలేదు. అందరి మనసుని దోచుకుంది. ఇక్కడ వండే మంది రుచి చూడ్డంకోసం కర్నాటక, ముంబయి, గుజరాత్‌ ప్రాంతాల నుంచి కూడా వస్తారు. మొదట్లో బార్కాస్‌లో అతి తక్కువ సంఖ్యలో ఉన్న మందీలు ప్రస్తుతం టోలీచౌకీ, హైటెక్‌సిటీ, గచ్చీబౌలీ ప్రాంతాల్లో విస్తరించాయి. నూనె, మసాలాలు లేకపోవడంతో ఐటీ ఉద్యోగులు, ఫిట్‌నెస్‌ కోరుకునే కుర్రకారు ఇష్టపడే వంటకంగా మారిపోయింద’ని అంటున్నారు యమ్‌యమ్‌ట్రీ పేరుతో పన్నెండేళ్లుగా మందిని నిర్వహిస్తున్న ఈశ్వర్‌, అబ్దుల్లాబిన్‌జియాద్‌లు. గూగుల్‌, కార్వి, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థల నుంచి వచ్చే భోజనప్రియులు మటన్‌ మందిని ఇష్టంగా తింటున్నారు.

- నాగరాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని