సంగట్లో సంగతులెన్నో

పొలంకాడ.. మోటరు ఆడతాఉంటే నీళ్లలో కాళ్లు తడుపుతా... చేతిలో వేడివేడి సంగటిని ఊరిమిండితో తింటావుంటే ఉంటాది నా సామి రంగా! సంగటి చేశాను... ఇంట్లో కూరేం లేదయ్యో! ఎందుకులే... ఆ తెల్లవాయి కారం నెయ్యందుకో... ఇంతకంటే రుచేముంటుంది. నిప్పుల మీద వంకాయలు, మిరపకాయలు కాల్చి బజ్జి చేశాను వదినా.. మీ అన్న యాటకూరకంటే ఇష్టంగా తింటాడు వీటిని సంగటితో! అల్లుడొచ్చాడు కదా ఏంజేసినావ్‌ అక్కా... మొన్న కోసిన యాటవి ఎండుముక్కలున్నాయి కదా.. సంగట్లోకి ఇంగేంకావాలి... స్వర్గమే చెబుతా ఉంటేనే నోట్లో నీళ్లూరే.. ఈ తిండికి. అన్నిచోట్ల ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉండారు. సంగటి, దాంట్లోకి వేసుకొని తినే కూరలకీ ఒక ప్రత్యేకమైన రుచి ఉండాది. వాటి గొప్పేంటి? వాటిని చేసేదెలా? చదుకోండి మరి!

Published : 15 Apr 2018 01:49 IST

సంగట్లో సంగతులెన్నో

పొలంకాడ.. మోటరు ఆడతాఉంటే నీళ్లలో కాళ్లు తడుపుతా... చేతిలో వేడివేడి సంగటిని ఊరిమిండితో తింటావుంటే ఉంటాది నా సామి రంగా!
సంగటి చేశాను... ఇంట్లో కూరేం లేదయ్యో! ఎందుకులే... ఆ తెల్లవాయి కారం నెయ్యందుకో... ఇంతకంటే రుచేముంటుంది.
నిప్పుల మీద వంకాయలు, మిరపకాయలు కాల్చి బజ్జి చేశాను వదినా.. మీ అన్న యాటకూరకంటే ఇష్టంగా తింటాడు వీటిని సంగటితో!
అల్లుడొచ్చాడు కదా ఏంజేసినావ్‌ అక్కా... మొన్న కోసిన యాటవి ఎండుముక్కలున్నాయి కదా.. సంగట్లోకి ఇంగేంకావాలి... స్వర్గమే
చెబుతా ఉంటేనే నోట్లో నీళ్లూరే.. ఈ తిండికి. అన్నిచోట్ల ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉండారు. సంగటి, దాంట్లోకి వేసుకొని తినే కూరలకీ ఒక ప్రత్యేకమైన రుచి ఉండాది. వాటి గొప్పేంటి? వాటిని చేసేదెలా? చదుకోండి మరి!

రాగి సంగటి: రాగిసంగటికి సన్నబియ్యం అవసరం లేదు. లావుగా మోటుగా ఉండే ఏ బియ్యమైనా బాగానే ఉంటాయి. బియ్యాన్ని ఇరవైనిమిషాల పాటు ముందుగా నానించి ఉంచాలి. సంగటి చేయడానికి బియ్యంలో నాలుగో వంతు రాగిపిండి సరిపోతుంది. ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత నీళ్లు మొత్తం అందులోకి ఇంకిపోతాయి. అప్పుడు రాగిపిండి వేసి తెడ్డుకట్టె(గరిటె)తో కలిపి సిమ్‌లో ఉంచి మూతపెట్టాలి. ఐదునిమిషాల పాటు ఉంచిన తర్వాత మరో ఐదునిమిషాలు మూతతీసేసి సిమ్‌లో ఉంచితే రాగిపిండి మెత్తగా ఉడికిపోతుంది. నీళ్లు ఇంకకుండా రాగిపిండి వేస్తే రాగిపిండి గడ్డలు కడుతుంది.

నెయ్యితో తెల్లవాయి కారం 

  కావాల్సినవి: ఎండు మిరపకాయలు- 15, పచ్చి కరివేపాకు- కట్ట, జీలకర్ర- చెంచా, మిరియాలు- చెంచా, ఎండుకొబ్బరి- చిప్పలో సగం, వెల్లుల్లి- రెండు పెద్దవి, ఉప్పు- కొద్దిగా.
తయారీ: కళాయిలో పైన చెప్పిన అన్నింటిని బాగా వేయించుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుని మెత్తగా దంచుకోవడమే. దీన్ని నెయ్యితో కలిపి సంగటిలోకి కలుపుకొంటే రుచిగా ఉంటుంది. అన్నంలోకి కూడా తినొచ్చు. 

ఊరుమిండి

కావాల్సినవి: ధనియాలు- అర చెంచా, పచ్చిమిర్చి- పది, ఉల్లిపాయ- ఒకటి, కరివేపాకు- రెండు రెమ్మలు,  జీలకర్ర- అరచెంచా, చింతపండు- కొద్దిగా, ఉప్పు- తగినంత 
తయారీ: ముందుగా వేరుసెనగలని వేయించి పెట్టుకోవాలి. నీళ్లు లేకుండా ధనియాలు, మిర్చి, జీలకర్ర, కరివేపాకు వేయించి పెట్టుకోవాలి. చివరిగా పల్లీలు, చింతపండు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు ఆఖరున వేసుకుంటే నోటికి తగులుతూ బాగుంటాయి. 

చింతాకు పొడి

చింతచిగురు- కప్పు(మరీ ముదురు, లేత కాకుండా మధ్యస్తంగా ఉన్న దానిని తీసుకుని ఎండబెట్టాలి). పల్లీలు- పావుకిలో, ఎండు మిరపకాయలు- పది, వెల్లుల్లిపాయ- ఒకటి, ఉప్పు- తగినంత 
తయారీ: ఎండిన చింతచిగురుని చేత్తో నల్చితే పుల్లలు వంటివి ఉంటే పక్కకు పోతాయి. దీనిని కళాయిలో మధ్యస్థంగా మంట ఉంచి వేయించి పెట్టుకోవాలి. పల్లీలు, ఎండుమిరప కూడా వేయించుకుని, పచ్చివెల్లుల్లి వేసుకుని చింతచిగురుని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి దంచుకోవాలి.

ఎండుముక్కల కూర 

తాజా మటన్‌కి ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లంవెల్లుల్లి పట్టించి ఎండలో మూడు రోజుల పాటూ ఎండపెట్టుకోవాలి. వీటిని ఎండుముక్కలు అంటారు. 
దంచడానికి కావాల్సినవి: ఎండుముక్కలు- కప్పు, ఎండుమిరప- ఐదు, ధనియాలు- రెండు చెంచాలు, ఎండుకొబ్బరి- చిన్నముక్క. ఎండుముక్కలు కాకుండా తక్కిన వాటిని దోరగా వేయించి దంచి పెట్టుకోవాలి. చివరిగా ఎండుముక్కలు కూడా వేసి దంచాలి. 
కూరకోసం: ఉల్లిపాయ- ఒకటి, టమాటాలు- రెండు, ఉప్పు, నూనె- కొద్దిగా తయారీ: కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసుకోవాలి. పచ్చిమటన్‌ వండటానికంటే దీనికి తక్కువే పడుతుంది. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని, టామటాలు వేయాలి. పచ్చివాసన పోయిన తర్వాత దంచిపెట్టుకున్న ఎండు ముక్కలు కూడా వేసి బాగా కలిపి ముక్కలు మునిగేంతవరకూ నీళ్లు పోసుకోవాలి. ఇవి ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది కుక్కర్‌ నాలుగైదు విజిల్స్‌ వచ్చిన తర్వాత దింపుకోవాలి. నీళ్లు అన్నిపోయి ముద్దకూరలా అయితేనే ఇది బాగుంటుంది. 

వంకాయ బజ్జి 

కావాల్సినవి: ఎండు మిరపకాయలు- పది. వీటిని నిప్పుల మీద కాల్చాలి. అలా వీలుకాకపోతే స్టౌమీద సిమ్‌లో ఉంచి కూడా కాల్చొచ్చు. లేదంటే పాత పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. వంకాయలు- రెండు, టామాటా- ఒకటి, వీటిని నిప్పుల మీద కాల్చి చేత్తో కాల్చాలి. తెల్లగడ్డ (వెల్లుల్లిపాయ)- ఒకటి, దీనిని కాల్చాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయ- ఒకటి కాల్చినది. 
తయారీ: వీటిని కాల్చడం అంటే ఏదో పేరుకు కాదు మొత్తం ఉడికిపోవాలి. కాలి నల్లగా అయిన పొట్టుని జాగ్రత్తగా వేరుచేసుకోవాలి. వీటిని చిన్న మట్టి కుండలో తీసుకుని ఎండుమిర్చితో కలిపి అన్నింటిని పప్పు గుత్తితో కానీ చేత్తో కానీ నల్చాలి. వెల్లుల్లిపాయను పప్పుగుత్తితో చితక్కొట్టి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకుని టీ కప్పు నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుకు తగినంత ఉప్పు కలిపి నల్చిన వంకాయ గుజ్జులో వేసి కలుపుకోవాలి. 

నాటుకోడి పులుసు

నాటుకోడిమాంసం- కిలో, ఉల్లిపాయలు- రెండు(పెద్దవి), పసుపు- అరచెంచా, ఉప్పు- తగినంత, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- రెండుచెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు, యాలకులు- రెండు, దాల్చిన చెక్క- మూడు, ఎండుమిర్చి- ఏడు, నూనె- ఐదుచెంచాలు, తాజా కొబ్బరి- రెండు చెంచాలు, గసగసాలు- అరచెంచా, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లిగడ్డ- ఒకటి(చిన్నది),  మిరియాలు- అరచెంచా
తయారీ: కొబ్బరి, గసగసాలు, అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలని(కొన్ని ముక్కలు పెట్టుకోవాలి) నూరుకుని ముద్ద చేసుకుని ఉంచాలి. ఇలాచి, దాల్చిని, మిరియాలు, కొద్దిగా గసగసాలు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో నూనె పోసి ఉల్లిపాయలు వేయించి పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం నూరిపెట్టుకున్న ముద్దను వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కారం, ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత నీరు పోసి ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూ అవసరం అయితే మరికొంచెం నీళ్లు పోసుకోవాలి. చివరిగా పొడిచేసిపెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి.

చిత్రాలు: - సుందర్‌, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని