చికెనాకు కూర!

ఆదివారం.. చికెన్‌ అంటే ఎగిరిగంతేస్తారు! అదే ఆకుకూరలంటే? అబ్బే ముఖం రంగులు మారిపోతుంది. అందుకే ఈ సారి ఇష్టమైన చికెన్‌ని పోషకాల ఆకుకూరలని కలిపి రుచిగా వండుకుందాం. చికెన్‌లోని ప్రొటీన్లని, ఆకుకూరల్లోని పీచుని కలిపి అందుకుందాం. చికెన్‌తో కలిపి ఆకుకూరల సంబరాలు చేసుకుందాం..

Published : 13 May 2018 02:13 IST

చికెనాకు కూర!

ఆదివారం.. చికెన్‌ అంటే ఎగిరిగంతేస్తారు! అదే ఆకుకూరలంటే? అబ్బే ముఖం రంగులు మారిపోతుంది. అందుకే ఈ సారి ఇష్టమైన చికెన్‌ని పోషకాల ఆకుకూరలని కలిపి రుచిగా వండుకుందాం. చికెన్‌లోని ప్రొటీన్లని, ఆకుకూరల్లోని పీచుని కలిపి అందుకుందాం. చికెన్‌తో కలిపి ఆకుకూరల సంబరాలు చేసుకుందాం..

* మాంసంలో ప్రొటీన్లు అధికం. పీచు అస్సలు ఉండదు. పిల్లలకు ప్రొటీన్లు, పీచు పుష్కలంగా అందాలంటే చికెన్‌ ఆకుకూరల కాంబినేషన్‌ చక్కని పరిష్కారం. ఈ కూరల నుంచి విటమిన్‌ ఎ, విటమిన్‌ సి పుష్కలంగా అందుతాయి.
* కొత్తిమీర, పుదీనా, మేథి వంటి ప్రత్యేకమైన రుచి లేదా ఫ్లేవర్‌(పరిమళం)ఉండే ఆకుకూరలని చికెన్‌కి జోడిస్తే ఆ కాంబినేషన్‌ చాలా బాగుంటుంది.
* ఎప్పుడైనా ఆకుకూరల్ని కొన్న రోజే వాడొద్దు. కారణం మార్కెట్‌లో ఆకుకూరలు తాజాగా, పచ్చగా కనిపించడానికి స్ప్రేలు వాడుతున్నారు. వాటి ప్రభావం పోవాలంటే 24 గంటలు ఉంచి ఆ తర్వాత ఉప్పు వేసి కడుక్కుని వాడుకోవాలి.


తోటకూరతో..

కావాల్సినవి: చికెన్‌- పావుకిలో, తోటకూర తరుగు- రెండుకప్పులు, ఎండుమిర్చి- నాలుగు, దంచిన ధనియాలు- చెంచా, కారం- చెంచా, పసుపు- చెంచా, ఉప్పు- తగినంత, కొబ్బరికోరు- పావుకప్పు, నూనె- తగినంత, ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా
తయారీ: కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఎండుమిర్చి, ధనియాలపొడి వేయాలి. అవి వేగాక అందులో ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించాలి. ఇందులో చికెన్‌, కారం, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లుపోసి మాంసాన్ని ఉడికించుకోవాలి. అప్పుడు తోటకూరని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. తోటకూర ఉడికి నీరంతా పోయిన తర్వాత చివరిగా కొబ్బరికోరు వేసి దింపుకోవాలి. 

 


గోంగూర చికెన్‌

కావాల్సినవి: గోంగూర- రెండు కట్టలు, కారం- రెండు చెంచాలు, పసుపు- పావుచెంచా, అల్లంవెల్లుల్లిముద్ద- చెంచా, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, కొత్తిమీర కట్ట- ఒకటి, పచ్చిమిర్చి- మూడు, నూనె- తగినంత, చికెన్‌- అరకేజీ, గరం మసాలాపొడి- చెంచా, ధనియాల పొడి- చెంచా, బిర్యానీ ఆకు- ఒకటి, లవంగాలు- మూడు, దాల్చినచెక్క- ఒకటి, జీలకర్ర- అరచెంచా, గసగసాలు, జీడిపప్పుకలిపి నూరిన ముద్ద- చెంచాన్నర, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా చికెన్‌కి చెంచా నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు కలిపి మారినేట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి అందులో పచ్చిమిర్చి, గోంగూర వేసి వేయించి మిక్సీలో మెత్తగా నూరుకోవాలి. గసగసాలు, జీడిపప్పుని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడయ్యిన తర్వాత అందులో బిర్యానీఆకు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసి వేయించిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ ఉండాలి. ఇందులో మారినేట్‌ చేసిన చికెన్‌, గరంమసాలా వేసి, తగినంత ఉప్పు, కొద్దిగా నీరుపోసి ఉడికించుకోవాలి. దీనికి జీడిపప్పు ముద్ద కూడా వేసి బాగా కలిపిన తర్వాత చివరిగా గోంగూర ముద్ద వేసి దగ్గరకు వచ్చిన తర్వాత దింపుకోవాలి. 


పుదీనా చికెన్‌

కావాల్సినవి: చికెన్‌- అరకేజీ, ముందుగా చికెన్‌ని మారినేట్‌ చేసుకుని ఉంచుకోవాలి. ఇందుకోసం ముందుగా చికెన్‌లో కొద్దిగా పసుపు, చెంచా కారం, చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్‌, చెంచా ధనియాల పొడి, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. పుదీనా కట్ట, పావుకప్పు కొత్తిమీర, చిన్న కొబ్బరిముక్క, నాలుగు పచ్చిమిర్చి తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
తయారీ: ఒక కడాయిలో రెండు పెద్ద చెంచాల నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి మారినేట్‌ చేసిన చికెన్‌ని వేసుకోవాలి. చికెన్‌ ఉడికిన తర్వాత పుదీనా వేస్ట్‌ వేసి బాగా కలిపి మళ్లీ మూతపెట్టుకోవాలి. చికెన్‌ ఉడికిన తర్వాత దీనికి కొద్దిగా గరంమసాలాపొడి, ధనియాల పొడి వేసి కలిపి దింపుకోవాలి. 


పాలకూర, సెనగపప్పుతో..

కావాల్సినవి: పాలకూర- రెండు కట్టలు, మెంతికూర- కట్ట, గరంమసాలా- చెంచాన్నర, నూనె- మూడు చెంచాలు, అల్లంముక్కలు- చెంచాన్నర, జీలకర్ర- చెంచా, సెనగపప్పు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా, ఉల్లిపాయలు చిన్నవి- రెండు, టమాట- ఒకటి, కారం- చెంచా, సొరకాయముక్కలు- పావుకప్పు
తయారీ: ముందుగా నాన్‌స్టిక్‌పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, అల్లం, సెనగపప్పు, ఉప్పు, పసుపు తగినన్ని నీళ్లు వేసి మూతపెట్టేయాలి. సెనగపప్పు ఉడుకుతున్న సమయానికి ఉల్లిపాయలు, సొరకాయముక్కలు, పాలకూర తరుగు, మెంతి ఆకులు వేసి మూతపెట్టేయాలి. అవి రంగుమారిన సమయానికి టమాటాలు కూడా వేయాలి. కాయగూరలన్నీ బాగా ఉడకనివ్వాలి. ఈ లోపు మాంసానికి ఉప్పు, కారం, గరంమసాలా పట్టించి పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. కాయగూరలన్నింటిని బ్లెండర్‌తో మెత్తగా చేసుకుని అందులో మారినేట్‌న చేసిన చికెన్‌ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. వేడిగా తింటే బాగుంటుంది.


మేథి చికెన్‌

కావాల్సినవి: మెంతికూర- రెండు కట్టలు, కొత్తిమీర కట్ట, చికెన్‌- పావుకిలో, ధనియాల పొడి- చెంచా, పసుపు- అరచెంచా, పచ్చిమిర్చి- మూడు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- రెండు చెంచాలు, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- మూడు, జీలకర్ర- చెంచా, పెరుగు- రెండు చెంచాలు, గరంమసాలా- రెండు చెంచాలు, కారం- చెంచాన్నర, ఉప్పు- తగినంత
తయారీ: కడాయిలో నూనెవేసి వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో చెంచాన్నర అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ధనియాలపొడి, పచ్చిమిర్చి, కొద్దిగా టమాటా ముక్కలు, చికెన్‌, పెరుగు వేసుకోవాలి. నీరుపోసి మూతపెట్టేయాలి. చికెన్‌ మ్తొతం ఉడికిన తర్వాత దీనికి మెంతి ఆకులు, కొత్తిమీర కలుపుకోవాలి. మెంతికూర ఉడికిన తర్వాత దింపుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని