సూపర్‌... మచ్ఛీ!

ఇది వానాకాలం అనే కంటే.. చేపలకాలం అంటే బాగుంటుందేమో! వేసవికాలం కాబట్టి చప్పని వాటితోనో, చలువ చేసే వాటితోనో సరిపుచ్చుకున్నాం కానీ...నదులు, సముద్రాలు, చెరువులు నిండుగా నీటితో కళకళ్లాడే ఈ రోజుల్లో రుచికరమైన చేపలకి లోటేంటి చెప్పండి? మెచ్చిన చేపని ఎంచుకుని... నచ్చిన కూర వండుకుని కుమ్మేయండి మరి.. మెదడు పనితీరు చురుగ్గా ఉండాలన్నా...మతిమరుపు, ఒత్తిడి వంటివి మనల్ని వేధించకుండా ఉండాలన్నా ఆహారంలో ఒమెగా-3 ఆమ్లాలను మనం సమృద్ధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒమెగా-3 సమృద్ధిగా ఉండే చేపనూనెలు, చేపలతో చేసిన వంటకాలు అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి....

Published : 10 Jun 2018 02:59 IST

సూపర్‌... మచ్ఛీ!  

ఇది వానాకాలం అనే కంటే.. చేపలకాలం అంటే బాగుంటుందేమో! వేసవికాలం కాబట్టి చప్పని వాటితోనో, చలువ చేసే వాటితోనో సరిపుచ్చుకున్నాం కానీ...నదులు, సముద్రాలు, చెరువులు నిండుగా నీటితో కళకళ్లాడే ఈ రోజుల్లో రుచికరమైన చేపలకి లోటేంటి చెప్పండి? మెచ్చిన చేపని ఎంచుకుని... నచ్చిన కూర వండుకుని కుమ్మేయండి మరి..

మెదడు పనితీరు చురుగ్గా ఉండాలన్నా...మతిమరుపు, ఒత్తిడి వంటివి మనల్ని వేధించకుండా ఉండాలన్నా ఆహారంలో ఒమెగా-3 ఆమ్లాలను మనం సమృద్ధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒమెగా-3 సమృద్ధిగా ఉండే చేపనూనెలు, చేపలతో చేసిన వంటకాలు అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

కొరమీను వేపుడు

కావాల్సినవి: కొరమీను చేపలు- కేజీ, కొబ్బరి పొడి- రెండు చెంచాలు, జీలకరపొడి- చెంచా, ధనియాలపొడి- రెండు చెంచాలు, మెంతిపొడి- పావుచెంచా, పసుపు- తగినంత, కారం- చెంచా, అల్లంవెల్లుల్లిముద్ద- చెంచా, చింతపండుపులుసు- మూడు చెంచాలు, నిమ్మకాయ- ఒకటి, నూనె- వేయించడానికి సరిపడా, కొత్తిమీర- కట్ట, ఉప్పు- తగినంత 
తయారీ: ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకుని నిమ్మరసం ముక్కలకి పట్టించాలి. ఒక గిన్నెలో అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, జీలకరపొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండుపులుసు, కొద్దిగా నూనె వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చేపకు రెండు వైపులా పట్టించాలి. ఈ  చేపముక్కలని అరగంటపాటు పక్కనపెట్టుకుని పెనంమీద నూనె వేసుకుని నిదానంగా రెండువైపులా కాల్చుకోవాలి.  కొత్తిమీర, నిమ్మకాయముక్కలతో అలంకరించుకోవాలి. 

ఇగురు...  

కావాల్సినవి: కొరమీను- కేజీ, చింతపండు గుజ్జు- రెండు చెంచాలు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- ఆరు, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, టమాటా గుజ్జు- పావుకప్పు, ఉల్లిపాయ ముద్ద- చెంచా, కొత్తిమీర పేస్ట్‌- చెంచా, గరంమసాలా- అరచెంచా, పసుపు- కొద్దిగా, కారం- రెండు చెంచాలు, పెరుగు- చెంచా, నూనె- తగినంత, ఉప్పు- తగినంత 
తయారీ: ముందుగా చేపముక్కలను కొద్దిపాటి నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కొత్తిమీర పేస్ట్‌, ఉల్లిపాయ ముద్ద, టమాటా పేస్ట్‌ వేసి వేయించిన తర్వాత అందులో చింతపండు పులుసు పోసి పెరుగు, కారం, ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో వేయించుకున్న చేప ముక్కలని వేసి ఉడికించుకోవాలి. తర్వాత గరంమసాలా వేసి మూడు నిమిషాలు ఉడికించి చివరిగా కొత్తిమీర వేసుకుని వడ్డించుకోవాలి.

అపోలో

కావాల్సినవి: చందువా చేప- అరకేజి, నిమ్మకాయ- అరచెక్క, కొత్తిమీర తరుగు- అరకప్పు, పెరుగు- అరకప్పు, గుడ్డు- ఒకటి, మైదా- మూడోవంతు కప్పు, మొక్కజొన్నపిండి- మూడు చెంచాలు, మిరియాల పొడి- చెంచా, కరివేపాకు- 2రెబ్బలు, పచ్చిమిర్చి- ఆరు, క్యాప్సికం- సగం, ఫుడ్‌కలర్‌- చిటికెడు, నూనె- సరిపడా, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా చేపను రెండు అంగుళాల ముక్కలుగా కోసి వాటికి నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు కలిపి ముక్కలను అరగంటసేపు మారినేట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్డు గిలక్కొట్టి దానిలో మొక్కజొన్నపిండి, మైదా, రంగు కలిపి మారినేట్‌ చేసిన చేపముక్కల్ని పిండిలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో రెండు చెంచాల నూనె వేసి అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేయించి పెరుగు, డీప్‌ ఫ్రై చేసిన చేపముక్కల్ని కూడా వేసి పెరుగు ఇగిరి పోయేంతవరకూ వేయించుకుని తీసుకోవాలి. 

పత్రాని మచ్చి

కావల్సిన పదార్థాలు: చందువా చేపలు- రెండు చిన్నవి, కొబ్బరి తురుము- చెంచా, పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర తరుగు- పావుకప్పు, నిమ్మరసం- కొద్దిగా, వెల్లుల్లి- ఐదురెబ్బలు, జీలకర్రపొడి- చెంచా, అరిటాకులు- రెండు చిన్నవి, 
తయారీ: ముందుగా చేపలపై నిమ్మరసం, ఉప్పు చల్లి పావుగంటసేపు పక్కన ఉంచాలి. కొబ్బరి తురుము, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద కలిపి ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఒక్కో చేప ముక్కను ఒక్కో అరిటాకులో పెట్టి మసాలా పేస్టును ముక్కలకు రెండు వైపులా పట్టించాలి. అరిటాకుని పొట్లంలా మడిచి వాటిని దారంతో కట్టుకోవాలి. వాటిని ఆవిరిపై పది నిమిషాల పాటు ఉడికించి ప్లేట్‌లోకి తీసుకుని పొట్లం విప్పి సర్వ్‌ చేసుకోవాలి. 

కబాబ్‌

కావాల్సినవి: కొరమేను చేపలు(ముళ్లు తీసేయాలి)- అరకేజి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు, ఉల్లిపాయపేస్ట్‌- రెండు చెంచాలు, సెనగపిండి- ఆరు చెంచాలు, నూనె- మూడు చెంచాలు, కారం- అరచెంచా, ఉప్పు- తగినంత 
తయారీ: ముందుగా చేపముక్కల్ని కాసిని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ముక్కలు చల్లారాక చేత్తో మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలో ఉల్లిపాయ పేస్ట్‌, ఉప్పు, సరిపడా సెనగపిండి వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా చేత్తో కలుపుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసుకుని అరచేత్తో కబాబ్‌ల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి కబాబ్‌లను ముదురు గోధుమరంగులోకి వచ్చేంతవరకూ ఫ్రై చేసుకోవాలి. టమాట సాస్‌తో తింటే ఈ కబాబ్‌లు రుచిగా ఉంటాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని