వానకు సరిజోడి పకోడి

ఓ చల్లని సాయంత్రం... కాస్త వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి పకోడీలే. సులువుగా తయారయ్యే వీటిని ఇలా పిండి కలిపి.. అలా వేయించి వేడివేడిగా లాగించేయొచ్చు. ఇంకెందుకాలస్యం మొదలుపెట్టేద్దామా మరి...

Published : 11 Oct 2020 01:21 IST

ఓ చల్లని సాయంత్రం... కాస్త వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి పకోడీలే. సులువుగా తయారయ్యే వీటిని ఇలా పిండి కలిపి.. అలా వేయించి వేడివేడిగా లాగించేయొచ్చు. ఇంకెందుకాలస్యం మొదలుపెట్టేద్దామా మరి...


పాలకూరతో...

కావాల్సినవి: సెనగపిండి- కప్పు, పాలకూర- రెండు కట్టలు, బియ్యప్పిండి- అరకప్పు, వాము- టీస్పూన్‌, పసుపు- టీస్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడా.
తయారీ: పాలకూరను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి మిగిలిన పదార్థాలన్నీ వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. దీంట్లో కాస్త నూనె కలిపితే పకోడీలు కరకరలాడతాయి. చివరగా పాలకూరను వేసి పిండి దానికి పట్టేలా బాగా కలపాలి. పిండి తక్కువ, పాలకూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడెక్కాక పిండి పట్టించిన పాలకూరను వేసి వేయించాలి. ఈ పకోడీలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.


చికెన్‌తో...

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- పావుకేజీ, కార్న్‌ఫ్లోర్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి- అర టేబుల్‌స్పూన్‌, మైదా- టేబుల్‌స్పూన్‌, కారం- అర టేబుల్‌స్పూన్‌, ఉప్పు- సరిపడా, మిరియాల పొడి- అర టీస్పూన్‌, గరంమసాలా పొడి- టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌.
తయారీ: చికెన్‌ను చిన్నముక్కలుగా కోసుకుని, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసుకుని దీంట్లో మైదా, కార్న్‌ఫ్లోర్‌... మిగిలిన పదార్థాలన్నీ వేసి చికెన్‌ ముక్కలకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి చికెన్‌ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. మధ్యస్థంగా ఉండే మంట మీద వీటిని వేయిస్తే ముక్క లోపల కూడా బాగా ఉడుకుతుంది. వేయించిన చికెన్‌ పకోడీలను టిష్యూ పేపర్‌ మీద వేస్తే నూనె లాగేస్తుంది.


మొలకలతో...

కావాల్సినవి: నానబెట్టి మొలకలు వచ్చిన పెసలు- రెండు కప్పులు, నానబెట్టిన బఠానీ- అరకప్పు,  సన్నగా తరిగిన ఉల్లిపాయలు- నాలుగు, తరగిన పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- టీస్పూన్‌ ఉప్పు- సరిపడా, పసుపు- అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము- పావుకప్పు,
తయారీ: ముందుగా మొలకలు, బఠానీలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా పేస్టు చేయాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి ఈ మిశ్రమాన్ని తీసుకుని పకోడీల్లా వేయాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండోవైపు తిప్పి వేయించాలి. పెద్ద మంట మీద వేయిస్తే మధ్యలోకి విరిగిపోకుండా కరకరలాడుతూ వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని