వనభోజనం... రుచుల సమాహారం..!

కార్తికమాసం... వనభోజనాల సందడే సందడి. తీపి వంటకాలూ అన్నం వెరైటీలూ సరికొత్త కూరల సమాహారం..!

Published : 26 Jun 2021 17:03 IST

కార్తికమాసం... వనభోజనాల సందడే సందడి. తీపి వంటకాలూ అన్నం వెరైటీలూ సరికొత్త కూరల సమాహారం..!

పాలక్‌ టిక్కీ

కావలసినవి 
ఆలూ: పావుకిలో, కొత్తిమీర తురుము: అరకప్పు, బఠాణీ: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, పాలకూర కట్టలు: నాలుగు(చిన్నవి), సెనగపిండి: 3 టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌ పొడి: పావుకప్పు, అల్లంవెల్లుల్లి: ఒకటిన్నర టీస్పూన్లు, గరంమసాలా: అరటీస్పూను, ఆమ్‌చూర్‌ పొడి: పావుటీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం 
బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. విడిగా ఓ బాణలిలో సెనగపిండి వేసి, మంచి వాసన వచ్చేవరకూ వేయించి పక్కన ఉంచాలి. 
బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి అల్లంవెల్లుల్లి పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి. తరవాత బఠాణీలు, పచ్చిమిర్చి కూడా వేసి ఓ నిమిషం వేగాక కొద్దిగా నీళ్లు చిలకరించి బఠాణీలను ఉడకనివ్వాలి. ఇప్పుడు కడిగి, తరిగిన పాలకూర కూడా వేసి ఉడికించాలి. తరవాత గరంమసాలా, ఆమ్‌చూర్‌పొడి వేసి కలిపి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పాలకూర, బఠాణీ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తీయాలి. అందులోనే ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, సెనగపిండి వేసి కలపాలి. చివరగా బ్రెడ్‌పొడి కూడా వేసి కలిపి, గుండ్రని బిళ్లల్లా చేసుకుని పెనంమీద నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.

క్యారెట్‌ కలాకంద్‌

కావలసినవి 
క్యారెట్‌ లేదా గాజర్‌: అరకిలో, యాలకులపొడి: టీస్పూను, కండెన్స్‌డ్‌ మిల్క్‌: 200గ్రా., నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, చిక్కనిపాలు: లీటరు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పిస్తా, జీడిపప్పు: అలంకరణకు సరిపడా

తయారుచేసే విధానం 
మందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తరవాత నిమ్మరసం పిండి విరగ్గొట్టాలి. ఇప్పుడు పాలన్నీ పూర్తిగా విరిగిపోయిన తరవాత పలుచని బట్టలో వేసి వడగట్టాలి. తరవాత దీన్ని సంచిలా కట్టి ట్యాప్‌కు వేలాడదీయడంగానీ లేదా దానిమీద బరువు పెట్టిగానీ ఉంచాలి. 
క్యారెట్లు గ్రేటర్‌తో తురుముకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి తురిమిన క్యారెట్‌ వేసి వేయించాలి. తరవాత కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా ఉడికిన తరవాత పాలవిరుగుడు కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. 
మిశ్రమం చిక్కబడ్డాక యాలకులపొడి వేసి కలిపి దించాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో మిశ్రమాన్ని వేసి, పిస్తా, జీడిపప్పు ముక్కలు చల్లాలి. ఆరాక ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు పెట్టి, బయటకు తీసి ముక్కలుగా కోయాలి.

వాంగీబాత్‌

కావలసినవి 
బియ్యం: ఒకటిన్నర కప్పులు, మంచినీళ్లు: మూడున్నర కప్పులు, వంకాయలు: పావుకిలో, ఉల్లిపాయలు: నాలుగు, వాంగీబాత్‌ పౌడర్‌: టేబుల్‌స్పూను, పసుపు: అరటీస్పూను, నెయ్యి: 2 టీస్పూన్లు, బెల్లం తురుము: 2 టీస్పూన్లు, చింతపండుగుజ్జు: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, పల్లీలు: 3 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, మినప్పప్పు: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఇంగువ: అరటీస్పూను, నూనె: టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం 
బియ్యం మరీ మెత్తగా కాకుండా పలుకుగా వండాలి. 
ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోయాలి. వంకాయలు కూడా పొడవాటి ముక్కలుగా కోయాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ వేసి వేయించాలి. తరవాత పల్లీలు కూడా వేసి వేగాక, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. తరవాత క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేసి వేగాక, వంకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. తరవాత పసుపు, వాంగీబాత్‌ పొడి వేసి కలిపి, ఉడికించిన అన్నం వేసి కలిపి ఓ రెండు నిమిషాలు వేయించి దించాలి.

క్యాప్సికమ్‌ మసాలా

కావలసినవి 
క్యాప్సికమ్‌: రెండు, జీలకర్ర: పావుటీస్పూను, గరంమసాలా: టీస్పూను, అల్లం: చిన్నముక్క, కసూరిమెంతి: టీస్పూను, నూనె: 4 టీస్పూన్లు, ఉల్లిపాయ: రెండు, దనియాలపొడి: టేబుల్‌స్పూను, టొమాటోలు: రెండు, కారం: టీస్పూను, వెల్లుల్లి: ఆరు రెబ్బలు, పసుపు: పావుటీస్పూను

తయారుచేసే విధానం 
ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. 
క్యాప్సికమ్‌ను ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిముద్ద వేసి వేగాక కొద్దిగా నీళ్లు చిలకరించి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. తరవాత 
కసూరిమెంతి వేసి, కలిపి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని