తియ్యతియ్యని దీపావళి..!

రంగులముగ్గులూ పూలతోరణాలూ; దీపాలవెలుగులూ కాకరపువ్వొత్తుల కాంతులూ; లక్ష్మీపూజలూ తియ్యని రుచులూ... వాహ్‌, దీపావళి సందడే వేరు..!

Published : 26 Jun 2021 17:09 IST

రంగులముగ్గులూ పూలతోరణాలూ; దీపాలవెలుగులూ కాకరపువ్వొత్తుల కాంతులూ; లక్ష్మీపూజలూ తియ్యని రుచులూ... వాహ్‌, దీపావళి సందడే వేరు..!

రవ్వ ఖీర్‌

కావలసినవి 
చిక్కని మీగడ పాలు: లీటరు, బొంబాయిరవ్వ: పావుకిలో, పంచదార: అరకిలో, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, పిస్తా: రుచికి సరిపడా, కుంకుమపువ్వు: చిటికెడు, యాలకులు: రెండు 
తయారుచేసే విధానం 
యాలకులు పొడి చేయాలి. నాన్‌స్టిక్‌పాన్‌లో బొంబాయిరవ్వ వేసి వేయించి తీయాలి. తరవాత పాలు పోసి మరిగించాలి. ఇప్పుడు పాలు సిమ్‌లో పెట్టి, వేయించిన రవ్వ వేసి తిప్పుతూ ఉడికించాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తరవాత పంచదార వేసి కరిగించాలి. చివరగా కుంకుమపువ్వు, కాస్త నేతిలో వేయించిన బాదం, ఎండుద్రాక్ష, పిస్తా, జీడిపప్పు ముక్కలు వేసి కలిపి దించాలి.

బ్రెడ్‌ మాల్పువా

కావలసినవి 
బ్రెడ్‌ స్లైసులు: 8, మైదా: ఒకటిన్నర కప్పులు, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, పాలు: 2 కప్పులు, యాలకులు: రెండు, పంచదార: రెండున్నర కప్పులు, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా, జీడిపప్పు, బాదం, పిస్తా: రుచికి సరిపడా 
తయారుచేసే విధానం 
బాణలిలో రెండుంపావు కప్పుల పంచదార వేసి మునిగేవరకూ నీళ్లు పోసి, చిక్కని పాకం వచ్చేవరకూ మరిగించాలి. 
ఓ గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, యాలకులపొడి, మిగిలిన పంచదార వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు లేదా పాలు పోసి పకోడీల పిండిలా పలుచగా కలిపి మూతపెట్టి ఓ అరగంటసేపు పక్కన ఉంచాలి. బ్రెడ్‌ స్లైసుల్ని గుండ్రంగా కత్తిరించాలి. 
బాణలిలో నూనె పోసి కాగాక బ్రెడ్‌స్లైసుల్ని పిండి మిశ్రమంలో ముంచి వేయించి తీసి పాకంలో వేసి పది నిమిషాలు ఉంచి తీయాలి. ఇలాగే అన్నీ చేయాలి. చివరగా జీడిపప్పు, బాదం, పిస్తా సన్నగా తరిగి మాల్పువాల మీద చల్లి అందించాలి.

పల్లీల లడ్డూ

కావలసినవి 
పల్లీలు: కప్పు, బెల్లం తురుము: కప్పు, యాలకులపొడి: పావుటీస్పూను, అటుకులపొడి: అరకప్పు, నువ్వులపొడి: అరకప్పు 
తయారుచేసే విధానం 
పల్లీలు, నువ్వులు విడివిడిగా వేయించాలి. చల్లారాక పల్లీల పొట్టు తీసి మిక్సీలో వేయాలి. అందులోనే నువ్వులు కూడా వేసి పొడి చేయాలి. తరవాత యాలకులపొడి, బెల్లంపొడి వేసి మరోసారి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో అటుకులపొడి వేసి కలిపి లడ్డూల్లా చుట్టాలి.

బాదం హల్వా 

కావలసినవి 
బాదం: ఒకటిన్నర కప్పులు, మంచినీళ్లు: 2 కప్పులు, యాలకులు: ఆరు, కుంకుమపువ్వు: కొద్దిగా, పంచదార: అరకప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: పావుకప్పు 
తయారుచేసే విధానం 
బాదం నానబెట్టి పొట్టు తీసేయాలి. తరవాత వీటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మరోసారి రుబ్బాలి. 
మందపాటి బాణలిలో రుబ్బిన బాదం మిశ్రమం వేసి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. పంచదార వేసి కలుపుతూ కరిగించాలి. అది పూర్తిగా కరిగిన తరవాత పాలు పోసి కలపాలి. తరవాత నెయ్యి వేసి ఓ రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. చివరగా కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలిపి దించాలి.

చమ్‌ చమ్‌

కావలసినవి 
పాలు: 4 కప్పులు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పంచదార: ఒకటింపావు కప్పు, మంచినీళ్లు: మూడుకప్పులు, యాలకులపొడి: అరటీస్పూను, డెసికేటెడ్‌ కొబ్బరి: 4 టేబుల్‌స్పూన్లు, కోవా: 4 టేబుల్‌స్పూన్లు, పంచదారపొడి: టేబుల్‌స్పూను, పిస్తాముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలపాలి. 
పాలను బాగా మరిగించి, నిమ్మరసం పోసి విరగ్గొట్టాలి. తరవాత చల్లని నీళ్లు లేదా ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. ఇప్పుడు ఈ పాలమిశ్రమాన్ని పలుచని బట్టలో వేసి మూటలా కట్టాలి. దీన్ని ట్యాప్‌వాటర్‌కింద పెట్టి కడగాలి. నీళ్లన్నీ కారిపోయేవరకూ సుమారు 45 నిమిషాలపాటు మూటను పైపుకి కట్టి ఉంచాలి. తరవాత పనీర్‌ను మెత్తగా చిదిమి కాస్త పొడవుగా లేదా గుండ్రంగా కావలసిన ఆకారంలో ఉండల్లా చేయాలి. 
సగం డెసికేటెడ్‌ కొబ్బరి, కోవా, పంచదారపొడి, పిస్తాముక్కలు అన్నీ ఓ గిన్నెలో వేసి కలిపి ఉంచాలి. ఓ గిన్నెలో పంచదార వేసి మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించాలి. తరవాత యాలకులపొడి వేసి కలపాలి. ఇప్పుడు ఉండల్లా చేసిన చమ్‌ చమ్‌ వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి. చల్లారాక వీటిని ప్లేటులో పెట్టి, మిగిలిన కొబ్బరిపొడిలో దొర్లించాలి. తరవాత వాటి మధ్యలో చాకుతో గాటుపెట్టి కొబ్బరి మిశ్రమం వేసి అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని