అమ్మవారికి గారె బూరె..!

దసరా పండగ అంటేనే... అమ్మవారి నైవేద్యాల వేడుక. అయితే వాటిల్లో అమ్మలూ అమ్మమ్మలూ కూడా మర్చిపోతున్న పాతకాలపు వంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిల్లో కొన్ని...

Published : 27 Jun 2021 19:48 IST

దసరా పండగ అంటేనే... అమ్మవారి నైవేద్యాల వేడుక. అయితే వాటిల్లో అమ్మలూ అమ్మమ్మలూ కూడా మర్చిపోతున్న పాతకాలపు వంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిల్లో కొన్ని...

తిరుపతి వడ

కావలసినవి
మినుములు: పావుకిలో, బియ్యం: టేబుల్‌స్పూను, మిరియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: టీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, ఉప్పు: సరిపడా, నెయ్యి లేదా నూనె: తగినంత

తయారుచేసే విధానం
* మిరియాలు, జీలకర్ర కలిపి దంచాలి.
* మినుములు రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లన్నీ వంపేసి మినుములకి బియ్యం జత చేసి గట్టిగా రుబ్బాలి. అందులోనే మిరియాలు-జీలకర్ర పొడి వేసి రుబ్బాలి. తరవాత పిండిలో ఇంగువ, తగినంత ఉప్పు వేసి కలపాలి.
* బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు వడని బట్టమీదగానీ పాలిథీన్‌ కాగితంమీదగానీ తడి చేసుకుంటూ పలుచని చెక్కల్లా వత్తి కాగిన నూనెలో ముదురు రంగులోకి మారేవరకూ వేయించి తీయాలి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి.

కదంబం

కావలసినవి
కందిపప్పు: కప్పు, బియ్యం: కప్పు, చింతపండు: కొద్దిగా, కరివేపాకు: 2 రెబ్బలు, సాంబారుపొడి: టేబుల్‌స్పూను, జీలకర్ర: టీస్పూను, మునక్కాయ, క్యారెట్‌, బంగాళాదుంప: ఒక్కొక్కటి చొప్పున, బెండకాయలు: రెండు, చిక్కుడుకాయలు: నాలుగు, పచ్చిబఠాణీ: టేబుల్‌స్పూను, గుమ్మడికాయ: చిన్నముక్క, నెయ్యి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* చింతపండు నానబెట్టాలి.
* కూరగాయ ముక్కలన్నీ చిన్నగా కోసుకోవాలి. తరవాత వీటిని కుక్కర్‌లో వేసి, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి.
* తరవాత వాటిని పక్కకు తీసి, బియ్యం వేసి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన అన్నం పక్కన ఉంచి, కుక్కర్‌లో పప్పు వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
* వెడల్పాటి పాన్‌ తీసుకుని నెయ్యి వేసి వేడెక్కాక, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత కూరగాయ ముక్కలన్నింటినీ నీటితో సహా వేసి ఉడికించాలి. తరవాత చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికించి పక్కన ఉంచిన పప్పు కూడా వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. తరవాత ఉడికించిన అన్నం కూడా వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించి, దించి కొత్తిమీర చల్లితే ప్రసాదం రెడీ.

పాలబూరెలు

కావలసినవి
బియ్యం: కిలో, బెల్లం తురుము: ముప్పావు కిలో, కొబ్బరి తురుము: కప్పు, యాలకులపొడి: 2 టీస్పూన్లు, పాలు: సరిపడా(సుమారు అరలీటరు), నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* బియ్యం ఒక రోజంతా నానబెట్టాలి. ఉదయాన్నే కడిగి ఆరబోసి మెత్తగా పిండి పట్టించాలి.
* కొబ్బరి వేయించి పెట్టాలి.
* బెల్లం తురిమి అది మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించాలి. సన్నని తీగ పాకం వస్తే చాలు. తరవాత పాకంలో కొబ్బరి తురుము, నువ్వులు, యాలకులపొడి వేసి కలపాలి. పిండి కూడా వేసి కలిపి, స్టవ్‌మీద నుంచి దించాలి. ఇప్పుడు ఇందులో కొంచెంకొంచెంగా పాలు పోస్తూ కలపాలి. పిండి మరీ జారుగా కాకుండా దోసెపిండిలా ఉండాలి.
* బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. పిండిని గుంట గరిటెతో తీసుకుని నెమ్మదిగా నూనెలో వదలాలి. ఇలా మూడు నాలుగు చొప్పున వేసుకుని, ఎర్రగా వేయించి తీయాలి. ఇవి మూడు రోజుల వరకూ నిల్వ ఉంటాయి.

రవ్వ గారెలు

కావలసినవి
బొంబాయిరవ్వ: కప్పు, పెరుగు: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, అల్లంతురుము: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, జీలకర్ర: టీస్పూను, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* రవ్వలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, జీలకర్ర, ఉప్పు, అల్లంతురుము, బేకింగ్‌సోడా అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు కొంచెంకొంచెంగా నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకుని మూతపెట్టి పది నిమిషాలు నాననివ్వాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు కలిపి గారెల పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా చేసి కాగిన నూనెలో మీడియం మంటమీద వేయించి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని