చిల్లీతో చిల్‌ చిల్‌..!

పనీర్‌ను ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో ఉప్పు, అల్లంవెల్లుల్లి, కార్న్‌ఫ్లోర్‌, గుడ్డుసొన, మైదా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పన్నీర్‌ ముక్కలకు పట్టించాలి. అవసరమైతే కాసిని నీళ్లు కూడా చిలకరించుకోవచ్చు. 

Updated : 07 Jul 2021 15:48 IST

చిల్లీ పనీర్‌

 

కావలసినవి 
పనీర్‌: 200 గ్రా., కార్న్‌ఫ్లోర్‌: రెండున్నర టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి: అరటేబుల్‌స్పూను, మంచినీళ్లు: తగినన్ని, గుడ్డు: ఒకటి, మైదా: టేబుల్‌స్పూను, నూనె: తగినంత, జీలకర్ర: అరటీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, దనియాలపొడి: అరటీస్పూను, చిల్లీ గార్లిక్‌ సాస్‌: టీస్పూను, అజినమోటో: చిటికెడు, రెడ్‌ క్యాప్సికమ్‌ ముక్కలు: కప్పు, ఎల్లో లేదా గ్రీన్‌ క్యాప్సికమ్‌ ముక్కలు: కప్పు, సోయాసాస్‌: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: టీస్పూను, కొత్తిమీర: కట్ట 
తయారుచేసే విధానం 
* పనీర్‌ను ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో ఉప్పు, అల్లంవెల్లుల్లి, కార్న్‌ఫ్లోర్‌, గుడ్డుసొన, మైదా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పన్నీర్‌ ముక్కలకు పట్టించాలి. అవసరమైతే కాసిని నీళ్లు కూడా చిలకరించుకోవచ్చు. 
* బాణలిలో నూనె పోసి కాగాక సిమ్‌లో పెట్టి మిశ్రమాన్ని పట్టించిన పనీర్‌ ముక్కలను వేయించి తీయాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె ఉంచి జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేగాక, కొద్దిగా మంచినీళ్లు చిలకరించాలి. ఇప్పుడు దనియాలపొడి, చిల్లీ గార్లిక్‌ సాస్‌, అజినమోటో వేసి కలపాలి. కారం, సోయాసాస్‌, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం కూడా వేసి కలపాలి. చివరగా వేయించిన పనీర్‌ ముక్కలు వేసి బాగా కలిపి అందించాలి.

 

హనీ చిల్లీ పొటాటో

 

కావలసినవి 
బంగాళాదుంపలు: రెండు, మైదా: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, కారం: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా, ఉల్లికాడలు: 2, నూనె: టీస్పూను, వెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను, క్యాప్సికమ్‌: ఒకటి, తేనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, సోయాసాస్‌: పావుటీస్పూను, నువ్వులు: 3 టీస్పూన్లు, చిల్లీ సాస్‌: 2 టీస్పూన్లు 
తయారుచేసే విధానం 
* ఓ గిన్నెలో మైదా, ఉప్పు, కారం వేసి కలపాలి. తరవాత పొట్టు తీసి సన్నగా పొడవుగా తరిగిన బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ మిశ్రమం ముక్కలకు పట్టేలా కలిపి, కాగిన నూనెలో వేయించి తీయాలి. 
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడల ముక్కలు వేసి వేగాక, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. తరవాత తేనె, ఉప్పు, సోయా, చిల్లీ సాస్‌లు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు వేయించి తీసిన బంగాళాదుంప ముక్కలు వేసి, నువ్వులు చల్లి బాగా కలిపి దించాలి.

 

చిల్లీ గార్లిక్‌ మష్రూమ్స్‌

 

కావలసినవి 
పుట్టగొడుగుల ముక్కలు: 2 కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి: 8 రెబ్బలు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, ఉప్పు:రుచికి సరిపడా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, టొమాటో కెచప్‌: టేబుల్‌స్పూను, నిమ్మరసం: టీస్పూను, నూనె:2 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
* పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్దలా రుబ్బాలి. 
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేయించాలి. తరవాత పచ్చిమిర్చి-వెల్లుల్లిముద్ద వేసి మీడియం మంటమీద రెండు నిమిషాలు వేయించాలి. 
* తరవాత పుట్టగొడుగులు, ఉప్పు వేసి కలిపి మీడియం మంటమీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, టొమాటో కెచప్‌, నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించి దించాలి.

 

చిల్లీ బేబీకార్న్‌

 

కావలసినవి 
బేబీకార్న్‌: 20, వెల్లుల్లి: 10, కార్న్‌ఫ్లోర్‌: 6 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: మూడు, టొమాటో సాస్‌: 4 టేబుల్‌స్పూన్లు, వినెగర్‌: టీస్పూను, పండుమిర్చి ముద్ద: 2 టేబుల్‌స్పూన్లు, సోయాసాస్‌: టీస్పూను, పంచదార: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లు (చిన్నవి): ఒక్కోటి చొప్పున, ఉల్లికాడలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, నువ్వులనూనె: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* బేబీకార్న్‌ అర అంగుళం సైజు ముక్కలుగా కోయాలి. వాటిమీద నాలుగు టేబుల్‌స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ చల్లాలి. తరవాత నాలుగు టేబుల్‌స్పూన్ల నీళ్లు చిలకరించి ఆ పిండి వాటికి పట్టేలా కలిపి కాగిన నూనెలో ఈ ముక్కలను వేయించి తీయాలి. 
* విడిగా చిన్న గిన్నెలో మిగిలిన కార్న్‌ఫ్లోర్‌ వేసి, ఓ కప్పు నీళ్లు పోసి కలపాలి. 
* మరో బాణలిలో మూడు టేబుల్‌స్పూన్ల నూనె పోసి ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఓ నిమిషం వేయించాలి. క్యాప్సికమ్‌ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరవాత టొమాటో సాస్‌, వినెగర్‌, పండుమిర్చి ముద్ద, సోయాసాస్‌, పంచదార, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలిపిన కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని పోసి, చిక్కబడే వరకూ ఉడికించాలి. చివరగా వేయించిన బేబీకార్న్‌, నువ్వుల నూనె వేసి ఓ నిమిషం తిప్పి వడ్డించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు