బాప్‌రే బాప్‌... చికెన్‌ కబాబ్‌..!

మిక్సీలో మటన్‌కీమా, మిరపగింజలు, అల్లంవెల్లుల్లి, నిమ్మరసం,  దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, ఉప్పు వేసి మెత్తగా చేయాలి...

Published : 27 Jun 2021 19:47 IST

మటన్‌ సీఖ్‌ కబాబ్‌

కావలసినవి 
మటన్‌ కీమా: పావుకిలో, మిరపగింజలు: అరటీస్పూను,  
అల్లంవెల్లుల్లి: టీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, దనియాలపొడి: అరటీస్పూను, జీలకర్ర పొడి: అరటీస్పూను, ఉల్లిముద్ద:  
3 టీస్పూన్లు, బ్రెడ్‌ పొడి: టీస్పూను, గుడ్డుసొన: ఒకటి,  
ఉప్పు: తగినంత, నూనె: సరిపడా

తయారుచేసే విధానం 
* మిక్సీలో మటన్‌కీమా, మిరపగింజలు, అల్లంవెల్లుల్లి, నిమ్మరసం,  దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. 
*తరవాత ఆ ముద్దలో ఉల్లిముద్ద, బ్రెడ్‌ పొడి, గుడ్డుసొన, కొద్దిగా నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఓ గంట నాననివ్వాలి. ఇప్పుడు సన్నని ఇనుప ఊచలకి చుట్టూ మిశ్రమాన్ని కావలసినంత పొడవులో అతికించాలి. ఇప్పుడు వీటిని ఓవెన్‌ గ్రిల్‌లోగానీ బొగ్గులమీదకానీ కాల్చి తీయాలి. అవి లేకపోతే స్టవ్‌మీద గ్రిల్‌ ప్లేటు పెట్టి వాటిమీద ఈ కబాబ్‌ ఊచల్ని పెట్టి కాల్చి తీయాలి.

చికెన్‌ శామి కబాబ్‌

కావలసినవి 
సెనగపప్పు: కప్పు, జీలకర్ర: టీస్పూను, లవంగాలు: ఏడు,  
మిరియాలు: ఏడు, దనియాలు: 2 టీస్పూన్లు, వాము: టీస్పూను, ఎండుమిర్చి: మూడు, కారం: అరటీస్పూను, బోన్‌లెస్‌ చికెన్‌: అరకిలో, ఉప్పు: టీస్పూను,  
మంచినీళ్లు: కప్పు, అల్లంతురుము: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, మిరపగింజలు: టీస్పూను,  
వెల్లుల్లి తురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: అరకప్పు, పుదీనా తురుము: అరకప్పు,  
గుడ్లు: రెండు, నూనె: సరిపడా

తయారుచేసే విధానం 
* సెనగపప్పుని అరగంటసేపు నానబెట్టాలి. 
* ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి జీలకర్ర, లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క,  దనియాలు, వాము, ఎండుమిర్చి, మిరపగింజలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత  నానబెట్టిన సెనగపప్పు వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత చికెన్‌ ముక్కలు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి సిమ్‌లో ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరైపోయి ముక్క మెత్తగా అయ్యేవరకూ ఉడికించి దించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.  
* రుబ్బిన మిశ్రమంలో కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, వెల్లుల్లి తురుము, పుదీనా తురుము వేసి బాగా కలపాలి.  
తరవాత గుడ్ల సొన కూడా వేసి బాగా కలిపి మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి గుండ్రని బిళ్లల్లా చేత్తోనే వత్తి పెనంమీద రెండువైపులా నూనె వేస్తూ కాల్చి తీసి చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తే సరి.

హరా మసాలా కబాబ్‌


 

కావలసినవి 
బంగాళాదుంపలు: నాలుగు, పాలకూర తురుము: పావుకప్పు, బఠాణీలు: 100గ్రా., జీలకర్ర: 2 టీస్పూన్లు, దనియాలు: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, వెల్లుల్లి: రెండు రెబ్బలు, అల్లంతురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: ఒకటి, నిమ్మకాయ: ఒకటి, పసుపు: టీస్పూను, చాట్‌ మసాలా: టీస్పూను,  
కార్న్‌ఫ్లోర్‌: 4 టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌పొడి:  4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం 
* కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు మరిగించి అందులో పాలకూర, బఠాణీలు వేసి  
* ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. 
* తరవాత వాటిని ఆ నీళ్లలోంచి తీసి చల్లని నీళ్లలో వేయాలి.  
* బాణలిలో జీలకర్ర, దనియాలు వేసి వేయించాలి. తరవాత వీటిని పొడి చేయాలి. బంగాళాదుంపల్లో ఉప్పు వేసి ఉడికించాలి. తరవాత పొట్టు తీసి మెత్తగా మెదపాలి. ఇప్పుడు మిక్సీలో వేయించిన జీలకర్ర-దనియాలపొడి, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, నిమ్మరసం, పసుపు, చాట్‌మసాలా, నీళ్లలో వేసి తీసిన పాలకూర, తాజా బఠాణీలు, కొద్దిగా నూనె వేసి మెత్తగా రుబ్బాలి.  తరవాత ఈ మిశ్రమానికి మెదిపిన బంగాళాదుంపల ముద్దని కూడా కలిపి, గుండ్రని బిళ్లల్లా చేసి నాన్‌స్టిక్‌ పాన్‌లో కొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.

స్వీట్‌ కార్న్‌ కబాబ్‌

కావలసినవి 

స్వీట్‌కార్న్‌: అరకప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి), బియ్యప్పిండి: 4 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం 
* స్వీట్‌కార్న్‌ గింజల్ని మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా రుబ్బాలి. తరవాత అందులో క్యాప్సికమ్‌ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు,  బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. 
* ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా నూనె రాసుకుంటూ చేత్తోనే పొడవాటి ఉండల్లా చేసి దాని మధ్యలో ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌ పెట్టి చుట్టూ వచ్చేలా వత్తాలి. తరవాత బాణలిలో డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి కాగాక, కబాబ్‌లను వేసి వేయించి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో అందిస్తే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని