కుక్కర్‌లోనూ చేయొచ్చా?

కొత్త సంవత్సరం వేళ ఇంట్లో కేక్‌ చేయాలనుకుంటున్నా. అయితే మా దగ్గర అవెన్‌ లేదు. ప్రెషర్‌ కుక్కర్‌లోనూ కేక్‌ చేసుకోవచ్చని ఎక్కడో చదివా. నిజమేనా...? ఎలా తయారుచేసుకోవాలి?

Updated : 26 Dec 2021 05:28 IST

కొత్త సంవత్సరం వేళ ఇంట్లో కేక్‌ చేయాలనుకుంటున్నా. అయితే మా దగ్గర అవెన్‌ లేదు. ప్రెషర్‌ కుక్కర్‌లోనూ కేక్‌ చేసుకోవచ్చని ఎక్కడో చదివా. నిజమేనా...? ఎలా తయారుచేసుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.

- భవ్య, హైదరాబాద్‌

కేక్‌ చేయాలనుకునేవారు అవెన్‌ లేకపోయినా ప్రెషర్‌ కుక్కర్‌ ఉపయోగించి కూడా బేక్‌ చేసుకోవచ్చు. దీనికోసం అల్యూమినియం కుక్కర్‌ ఉంటే సరిపోతుంది. అల్యూమినియం అయితే అధిక ఉష్ణోగ్రత వచ్చే వరకు ఇబ్బంది లేకుండా బేక్‌ చేసుకోవచ్చు.

కేకు తయారుచేసుకునే సమయంలో ఎలాగైతే అవెన్‌ను ప్రీహీట్‌ చేసుకుంటామో కుక్కర్‌ని కూడా అలాగే ప్రీహీట్‌ చేసుకోవాలి.  మూత పెట్టకుండా స్టవ్‌పై అయిదు నుంచి పది నిమిషాలు వేడి చేయాలి. కుక్కర్‌లో బేకింగ్‌ డిష్‌ను నేరుగా పెట్టకూడదు. ఇలా చేస్తే ఎక్కువ వేడి అడుగు భాగానికి తగిలి అడుగు మాడిపోతుంది. కాబట్టి చిన్న స్టాండ్‌ ఉంచి దానిపై మౌల్డ్‌ /డిష్‌ ఉంచాలి. తర్వాత కుక్కర్‌ మూత పెట్టి విజిల్‌ పెట్టకుండా వేడి చేసుకోవాలి. స్టాండ్‌ పెట్టి కేక్‌ చేసేటప్పుడు నీళ్లు పోయొచ్చు. స్టాండ్‌ లేకపోతే కుక్కర్‌ అడుగు భాగంలో రెండు మూడు కప్పుల ఉప్పు వేసి దానిపై కేక్‌ పాత్రను పెట్టి వేడి చేసుకోవాలి. ఉప్పు బదులుగా ఇసుకను కూడా వాడుకోవచ్చు.  

కుక్కర్‌, అవెన్‌... ఎందులో బేక్‌ చేసినా సమయం దాదాపు ఒకేలా ఉంటుంది. కాబట్టి కేక్‌ అండర్‌ బేక్‌ లేదా ఓవర్‌ బేక్‌ కాకుండా ప్రతి 10-15  నిమిషాలకు ఒకసారి స్టేటస్‌ చెక్‌ చేసుకోవాలి. కేక్‌ టిన్‌ అడుగుభాగం  అంచులకు వెన్న రాసి పిండిలో డస్ట్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే కేక్‌ బేక్‌ అయ్యాక తేలికగా టిన్‌ నుంచి వేరు  చేసుకోవచ్చు. అలాగే అడుగు భాగంలో బటర్‌ పేపర్‌ వాడొచ్చు. ఇవి దొరకని పక్షంలో అల్యూమినియం ఫాయిల్‌ కూడా వాడొచ్చు. కేక్‌ బాగా మెత్తగా స్పాంజిగా రావడం కోసం బ్యాటర్‌ తయారయ్యాక ఒకట్రెండు చెంచాల వెనిగర్‌ కలపాలి. కుక్కర్‌లో సరిగ్గా సరిపోయే బేకింగ్‌ టిన్‌ను జాగ్రత్తగా చూసి సెలెక్ట్‌ చేసుకోవాలి.

బేకింగ్‌ టిన్‌లో కేక్‌ బ్యాటరీ వేశాక సమానంగా ఉండేలా అడ్జస్ట్‌ చేసుకుని బేక్‌ చేసుకోవాలి. మొదట కేక్‌ను మీడియం ఫ్లేమ్‌లో అయిదు నిమిషాలు కుక్‌ చేయాలి. కేక్‌ బాగా బేక్‌ అవుతుందేమో చూసుకోవాలి. తర్వాత మంట చిన్నగా పెట్టుకుని వేడి చేసుకోవాలి. టూత్‌పిక్‌ను కేకులో గుచ్చితే అది పిండి ఏమాత్రం అంటుకోకుండా క్లీన్‌గా బయటకు వస్తే కేక్‌ రెడీ అయినట్లు అనుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేశాక కేక్‌ చల్లారిన తర్వాత బయటకు తీసి డీ మౌల్డ్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని