సావిత్రమ్మ స్పెషల్‌ రూపాయికే దోశ!

అనంతరపురం జిల్లా, తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధిలో ఉదయం నుంచే సందడి మొదలవుతుంది. అక్కడున్న ఓ కొట్టు పిల్లలూ, పెద్దలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆమె అందించే రుచికరమైన దోశలంటే అక్కడి వారికి ఎంతో ఇష్టం.

Updated : 27 Feb 2022 06:21 IST

అనంతరపురం జిల్లా, తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధిలో ఉదయం నుంచే సందడి మొదలవుతుంది. అక్కడున్న ఓ కొట్టు పిల్లలూ, పెద్దలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆమె అందించే రుచికరమైన దోశలంటే అక్కడి వారికి ఎంతో ఇష్టం. ప్రేమాభిమానాలతోపాటు కేవలం రూపాయికే దోశను అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు 65 ఏళ్ల సావిత్రమ్మ.

తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు దాదాపు 45 ఏళ్ల కిందట భార్య సావిత్రమ్మ, 8 ఏళ్లలోపున్న ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి బతుకు దెరువు కోసం తాడిపత్రి పట్టణానికి వలస వచ్చారు. టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబం ఇబ్బందులకు గురైంది. తన తల్లి చంద్రమ్మ సహకారంతో 1980లో దోశలు వేయడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. లాభార్జన లేకుండా తన బిడ్డలతో పాటూ నలుగురి ఆకలి తీర్చడమే ధ్యేయంగా రూపాయికి నాలుగు దోశలు ఇచ్చేది. క్రమేపీ ధరలు పెరగడంతో రూపాయికి రెండు దోశలు... ఆ తర్వాత రూ.2కి మూడు దోశలు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రస్తుతం రూపాయికి ఒక దోశ ఇస్తోంది. దోశతోపాటూ రెండు రకాల చట్నీలను ఇస్తోంది. ఉదయం విద్యార్థులు, కూలీలు అవ్వ దుకాణం వద్ద దోశల కోసం వేచి ఉంటారు. రోజుకు 500కి పైగా దోశలను విక్రయిస్తోంది. సాయంత్రం రూ.10కి ఆరు బజ్జీలు, రూ.10కి పది పొంగనాలను కూడా అమ్ముతోంది. ఇలా రోజుకు రూ.200 వరకూ సంపాదిస్తోంది. 40 ఏళ్లుగా ఈ పనిలోనే మునిగిపోయిందామె. వచ్చిన స్వల్ప ఆదాయంతోనే బిడ్డల పెళ్లిళ్లు చేసింది. శిథిలావస్థలోని ఇంటినీ మరమ్మతులు చేయించుకుంది. ‘అందరి ఆకలి తీర్చడం సాధ్యం కాకపోయినా ఇక్కడికి వచ్చేవారికి తక్కువ ధరకే దోశలు వేస్తూ వారి కడుపు నింపడం ఆనందాన్ని ఇస్తోంది. ఈ వయసులో కష్టపడాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులంటున్నా కూడా ఈ ఆనందం కోసమే ఇంకా ఈ పని కొనసాగిస్తున్నా’ అని చెబుతోందీ అవ్వ.

- బొమ్మినేని లక్ష్మీపతినాయుడు, తాడిపత్రి, అనంతపురం జిల్లా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని