చిక్కటి పాలే కావాలి!

రెస్టారెంట్‌ వంటకాల్లో వాడే ఫ్రెష్‌ క్రీమ్‌ని ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చా?

Published : 13 Mar 2022 00:52 IST

రెస్టారెంట్‌ వంటకాల్లో వాడే ఫ్రెష్‌ క్రీమ్‌ని ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చా? -మనస్విని, హైదరాబాద్‌

ఫ్రెష్‌ క్రీమ్‌నే ‘హెవీ క్రీమ్‌’ అని కూడా అంటారు. సాధారణంగా ఈ క్రీమ్‌ని గ్రేవీలు, పాస్తా, సూప్‌లలో అదనపు రుచి కోసం వాడుతుంటారు. ఫ్రెష్‌ క్రీమ్‌ వాడకం వల్ల గ్రేవీలకు రుచితోపాటు చిక్కదనం కూడా వస్తుంది. ఈ క్రీమ్‌ని ఇంట్లోనూ సులభంగా తయారుచేసుకోవచ్చు. క్రీమ్‌ తయారీకి చిక్కటి పాలు (ఫుల్‌ ఫ్యాట్‌ మిల్క్‌) వాడాలి. ఈ పాలలో కొవ్వు ఆరు శాతం వరకూ ఉంటుంది. అదే టోన్డ్‌ పాలలో 3 శాతం మాత్రమే. పాలను కాచి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మరొకసారి దాదాపు అయిదు నిమిషాలు మరగపెట్టాలి. ఆ తర్వాత అరగంట వరకు మూతపెట్టి పక్కన పెట్టాలి లేదా ఫ్రిజ్‌లో గంట నుంచి రెండు గంటలు పెట్టొచ్చు. అలా పూర్తిగా చల్లారిన పాలపై ఏర్పడిన మీగడను గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పాలను రెండుసార్లు కాచి, చల్లార్చి మీగడ తీసి పెట్టుకోవాలి. ఈ మీగడను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా వారం నుంచి రెండు వారాల తీసి పెట్టుకోవాలి. దీన్ని విస్క్‌తో మృదువుగా ఉండలు లేకుండా విస్క్‌ (గిలక్కొట్టడం/బాగా కలపడం) చేసుకోవాలి లేదా మిక్సీ/ఎలక్ట్రిక్‌ విస్క్‌తో కానీ గిలక్కొట్టొచ్చు. అయితే ఎక్కువసేపు గిలక్కొడితే వెన్న విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి క్రీమీగా అయ్యే వరకు విస్క్‌ చేస్తే చాలు. దీన్ని గ్రేవీలు, సూప్‌లు, కూరల్లో వాడుకోవచ్చు.

ఇలా తయారుచేసిన క్రీమ్‌కి కొద్దిగా పులుపు రుచి ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి స్వీట్స్‌ తయారీలో వాడొద్దు. పులుపు రుచి రావొద్దనుకుంటే ఎక్కువ పాలు కాచి మీగడ తక్కువ రోజులకే విస్క్‌ చేసుకోవాలి. పాలు కాచి చల్లార్చిన ప్రతిసారీ మీగడ తీసుకోవచ్చు. ఇలా తీసిన క్రీమ్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో పెడితే తాజాగా ఉంటుంది. బయటకు తీసి గది ఉష్ణోగ్రతకి వచ్చాక విస్క్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని