విశాఖవాసులు నచ్చే వీరన్న జావ

విశాఖ తీరంలో నడకకు వచ్చే చాలామందికి పెనుబోతు వీరన్న పరిచితులే.  అందరినీ డాడీ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. వేడి వేడి జావనందిస్తారు. దాదాపు పదహారేళ్లుగా రుచి, పోషకభరిత జావను

Updated : 27 Mar 2022 06:14 IST

విశాఖ తీరంలో నడకకు వచ్చే చాలామందికి పెనుబోతు వీరన్న పరిచితులే.  అందరినీ డాడీ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. వేడి వేడి జావనందిస్తారు. దాదాపు పదహారేళ్లుగా రుచి, పోషకభరిత జావను విశాఖ ప్రజలకు అందిస్తున్నారాయన... దానికున్న ప్రత్యేకత ఏమిటంటే...

విశాఖలోని ఆర్‌.కె.బీచ్‌ దగ్గర మోరిస్‌ గ్యారేజెస్‌ షోరూమ్‌ ఎదురుగా రాగి జావ అమ్మే 60 ఏళ్ల వీరన్న గురించి తెలియని వారుండరు. అందరినీ ‘డాడీ...’ అని పిలుస్తూ ఆకర్షించే ఆయన విశాఖ తీరంలో ఉదయపు నడకకు వెళ్లే పలువురికి సుపరిచితుడే. నడక పూర్తయిన తర్వాత ఆయన దగ్గర జావ తాగి ఇంటికి వెళ్లడం చాలామందికి అలవాటు. ఏళ్లుగా తాను ఉపాధి పొందుతూ పలువురికి ఆరోగ్యాన్నీ పంచుతున్నారు. వీరన్నది విశాఖలోని గోపాలపట్నం. గతంలో కూలీ. వచ్చే డబ్బు చాలకపోవడంతో ఏదైనా చిరువ్యాపారం చేయాలనుకున్నారు. అదీ ప్రజల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండే పోషక ఉత్పత్తులు ఏవైనా విక్రయించాలనుకున్నారు. అలా 16 ఏళ్ల కిందట  విశాఖ తీరంలో రాగిజావ(చోడిజావ) అమ్మడం మొదలుపెట్టారు.

‘కొత్తలో చాలా తక్కువ మంది మాత్రమే తాగేవారు. క్రమంగా కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. రాగులు/చోళ్లను బాగా శుభ్రం చేసి పిండి చేయించి రోజూ తెల్లవారుజామునే మూడుగంటలకే జావ కాచి ఆరు గంటలకల్లా బీచ్‌కు చేరుకుంటా.’ అని  చెబుతారాయన. జావతోపాటు మొలకలు, బొబ్బర్లు, ఉలవలు, క్యారెట్‌ ముక్కలు, నువ్వుండలు, తులసి టీ, మజ్జిగనూ విక్రయిస్తారు. రోజూ 30 లీటర్ల రాగి జావ, పది లీటర్ల మజ్జిగ తీసుకువస్తారు. దాదాపు సరకంతా అమ్ముడైపోతుంది. వర్షాలు కురిసినప్పుడు నడకకు వచ్చే వారి సంఖ్య ఒక్కసారిగా పడిపోతుంటుంది. దాంతో మిగిలిపోయిన జావ, మజ్జిగను పిల్లలకు ఉచితంగా అందిస్తారు.

రోజూ రూ. 1500 వరకూ ఆదాయం!

వీరన్న చేసే ప్రత్యేకమైన తులసి టీ తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ‘జావ స్వచ్ఛంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పిండి యంత్రాన్ని కూడా సమకూర్చుకున్నా. అందులో కలిపే మజ్జిగ పులుపు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. వేడి ఏమాత్రం తగ్గని క్యాన్లలో జావను పోసి బీచ్‌కు తీసుకువస్తా. ఈ జావలో శనగలనూ చేర్చి కొనుగోలుదారులకు అందిస్తా. రోజూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు బీచ్‌లో ఉంటా. రోజుకు రూ.1200లు నుంచి రూ.1500ల వరకు విక్రయాలు చేస్తుంటా. నిత్యవసర ధరలు పెరిగి, ఖర్చులు అధికమైనా ఎంతో తృప్తినిచ్చే వ్యాపారం కావడంతో ఇందులోనే కొనసాగుతున్నా. ఈ వ్యాపారంలో నా కుటుంబం మొత్తం సాయపడుతుంది. ఈ మధ్యే ఆటోనూ కొనుక్కునా.. డ్రైవర్‌ని పెట్టుకున్నా. ఆ ఆటోలో ఉదయాన్నే బీచ్‌కు వచ్చి అన్నీ అమ్మేసి ఇంటికెళ్లిపోతా.’ అని ఆనందంగా చెబుతారాయన.

-బి.ఎస్‌. రామకృష్ణ, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని