ఐస్‌ చేసేయండి చల్లచల్ల టీ తో..

ఉదయాన్నే ఒక‘టి’... టిఫిన్‌ చేశాక మరొక‘టి’.. సాయంత్రం ఇంకో‘టి’ అంటూ కప్పుమీద కప్పు టీలు తాగే తేనీటి ప్రియులకు వేసవిలో కాస్త నిరాశే. అలాంటివారు ఈ చల్లని టీలు తాగేయండి.

Updated : 22 May 2022 02:50 IST

ఉదయాన్నే ఒక‘టి’... టిఫిన్‌ చేశాక మరొక‘టి’.. సాయంత్రం ఇంకో‘టి’ అంటూ కప్పుమీద కప్పు టీలు తాగే తేనీటి ప్రియులకు వేసవిలో కాస్త నిరాశే. అలాంటివారు ఈ చల్లని టీలు తాగేయండి. హాయిగా ఉండటమే కాదు ఆరోగ్యానికీ మంచిది. చేసుకోవడమూ తేలికే!

పుదీనా ఐస్‌ టీ

కావాల్సినవి: తాజా పుదీనా ఆకులు- అరకప్పు, గ్రీన్‌టీ బ్యాగ్స్‌- మూడు, తేనె- రెండు చెంచాలు, వేడినీళ్లు- నాలుగుకప్పులు, నిమ్మగడ్డి- చెంచా

తయారీ: ఒక పాత్రలో పుదీనా ఆకులు, గ్రీన్‌టీ బ్యాగులు, నిమ్మగడ్డి వేసి అందులో మరుగు నీళ్లు పోయాలి. ఆ ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టేయాలి. టీని వడకట్టి, చల్లారిన తర్వాత ఆ టీని ఫ్రిజ్‌లో ఉంచాలి. కావాల్సినప్పుడు తేనె కలిపి సర్వ్‌ చేసుకోవచ్చు. 


మ్యాంగో టీ

కావాల్సినవి: మామిడిపండు ముక్కలు- కప్పున్నర, టీ బ్యాగులు- నాలుగు, పుదీనా ఆకులు- గుప్పెడు, పంచదార- తగినంత, నిమ్మరసం- చెంచా, నీళ్లు- నాలుగు కప్పులు.

తయారీ: ముందుగా మామిడిపండు ముక్కలని బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసుకొని ఫ్రిజ్‌లో ఉంచాలి. నీళ్లను మరిగించి అందులో టీ బ్యాగులని వేసి ఐదునిమిషాల పాటు ఉంచితే డికాషన్‌ తయారవుతుంది. ఈ డికాషన్‌ని కూడా ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తర్వాత.. బ్లెండర్‌లో మామిడిపండు ముక్కలు, పంచదార, నిమ్మరసం వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. చివరిగా పుదీనా వేసి సర్వ్‌ చేస్తే రుచిగా ఉంటుంది.


పుచ్చకాయతో

కావాల్సినవి:  తరిగిన పుచ్చకాయ ముక్కలు- నాలుగు కప్పులు, గ్రీన్‌టీ బ్యాగులు- రెండు, నిమ్మరసం- పావుకప్పు, పుదీనా ఆకులు - కొద్దిగా, నీళ్లు- రెండు కప్పులు.

తయారీ: ముందుగా నీళ్లు మరగ కాచుకుని... ఆ నీటిలో గ్రీన్‌ టీ బ్యాగులు వేసి ఐదునిమిషాలు  వదిలేయాలి. బ్యాగులు తీసేసి ఆ నీటిని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడిన తర్వాత బ్లెండర్‌లో పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసం, గ్రీన్‌టీవేసి బాగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ టీని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక... సర్వ్‌ చేసేటప్పుడు పుదీనా ఆకులు వేసి ఇస్తే పరిమళం, రుచి బాగుంటాయి.


అల్లంతో..

కావాల్సినవి: నీళ్లు- లీటర్‌, బ్లాక్‌ టీ బ్యాగ్స్‌- నాలుగు, పుదీనా ఆకులు- పదిహేను, తురిమిన అల్లం- చెంచా, నిమ్మకాయ- ఒకటి, తేనె- నాలుగు చెంచాలు.

తయారీ: ముందుగా నీళ్లని మరగ కాచుకోవాలి. పొయ్యికట్టేసి ఆ నీళ్లలో బ్లాక్‌ టీ బ్యాగులు, పుదీనా ఆకులు, తురుమిన అల్లం వేసి మూతపెట్టాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టుకుని అందులో నిమ్మరసం, తేనె కలుపుకుని ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌చేయండి.


రోజ్‌వాటర్‌తో..

కావాల్సినవి:  వేడునీళ్లు- మూడుకప్పులు, గ్రీన్‌టీ బ్యాగులు- రెండు, పుచ్చకాయముక్కలు- రెండుకప్పులు, వంటల్లో వాడే రోజ్‌వాటర్‌- రెండు చెంచాలు, పుదీనా- కొద్దిగా, పంచదార-తగినంత.

తయారీ: వేడినీటిలో టీబ్యాగులు వేసి ఐదునిమిషాలు ఉంచి చల్లారాక ఆ నీటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బ్లెండర్‌లో పుచ్చకాయ ముక్కలు, రోజ్‌ వాటర్‌, టీ, పంచదార కూడా కలిపి బ్లెండ్‌ చేసి వడకట్టుకోవాలి. చివరిగా పుదీనా వేసి సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని