ఇవి పక్కాలోకల్స్‌!

తాగితే కోమలా విలాస్‌ కాఫీనే తాగాలి.. తింటే నందిమల్ల చేపలనే తినాలి.. ఇడ్లీల్లో... పాక ఇడ్లీ రుచే వేరబ్బా. ఇవన్నీ ఎక్కడివో కాదు. మనవే! తెలుగు రాష్ట్రాల్లోని పక్కాలోకల్‌ రుచులు...  

Updated : 31 Jul 2022 09:46 IST

తాగితే కోమలా విలాస్‌ కాఫీనే తాగాలి.. తింటే నందిమల్ల చేపలనే తినాలి.. ఇడ్లీల్లో... పాక ఇడ్లీ రుచే వేరబ్బా. ఇవన్నీ ఎక్కడివో కాదు. మనవే! తెలుగు రాష్ట్రాల్లోని పక్కాలోకల్‌ రుచులు...  

కాఫీ అంటే... కోమలా విలాసే!

ఉదయమైందా.. కోమలావిలాస్‌ కాఫీ తాగాల్సిందే! సాయంత్రమైతే చాలు.. ఇక్కడి జనాలు ఈ కాఫీ కోసం ఎగబడతారు. నెల్లూరుకి ఎవరైనా కొత్తగా వచ్చారా.. వారికీ ఈ  రుచి చూపించాల్సిందే..
86 ఏళ్ల క్రితం మొదలైన ఈ హోటల్‌ గురించి నెల్లూరులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. స్వాతంత్య్రానికి పూర్వం 1936లో ప్రారంభమైన ఈ హోటల్‌.. నేటికీ నడుస్తుందంటే దీనికున్న ప్రత్యేకత, ఆదరణని అర్థం చేసుకోవచ్చు. నెల్లూరులో ఎన్నో కాఫీ షాపులున్నా.. వీరి ఫిల్టర్‌ కాఫీ రుచి ప్రత్యేకం.
ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కాఫీ ఘుమఘుమల్ని ఆస్వాదించడానికి రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నేటి కాలంలో టీ, కాఫీ షాపుల్లో పేపరు, ప్లాస్టిక్‌ గ్లాసులు ఉపయోగిస్తే.. ఇక్కడ మాత్రం స్టీలు గ్లాసులను వాడతారు. అందులో తాగితే దీని అసలు రుచేంటో తెలుస్తుందని అంటారు నిర్వాహకులు వెంకటేశ్వర్లు, వినోద్‌లు. కాఫీ పొడిని చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తామని, రోజుకు 800కి పైగా కప్పులు విక్రయిస్తామనీ చెబుతున్నారు. వెంకయ్యనాయుడు లాంటి వారు మనసు పారేసుకున్న ఈ కాఫీ రుచిని ఆస్వాదించడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వెళ్తూ ఉంటారు.          

- జి. ప్రశాంత్‌, నెల్లూరు


కొరమేను...బొచ్చ... తాజా రుచితో!

నందిమల్ల ప్రత్యేకం!

చేపలు తినాలనిపిస్తే ఏం చేస్తాం? మార్కెట్‌ నుంచి తెచ్చుకొని, వండుకుంటాం. కానీ చేపల్ని తాజాగా వలేసి పట్టుకొని అప్పటికప్పుడు వండుకుని తింటే? ఆ రుచే వేరబ్బా..! అలాంటి సౌకర్యం జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతమైన నందిమల్ల గ్రామం వద్ద ఉంది. పర్యాటకుల కోసం ఇలాంటివి ఏకంగా 500 దుకాణాలు ఉన్నాయిక్కడ... జూరాల ప్రాజెక్టు అందాలు చూడ్డానికి అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. దీనికి దగ్గర్లోనే నందిమల్ల గ్రామం ఉంది. తాజా చేపల రుచి కోరుకొనే చాలామంది ఇక్కడకు వస్తుంటారు. అక్కడుండే  వ్యాపారులు సందర్శకులను నేరుగా ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లి వారికి ఏ చేపలు కావాలో పట్టి ఇస్తారు. కొరమీను, బొచ్చ, బంగారుతీగ, జెల్లలు లాంటి 10 రకాల చేపలు ఇక్కడ దొరుకుతాయి. కొన్న తరువాత ఇక్కడే వండించుకోవచ్చు కూడా. జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు దాదాపు 500 కుటుంబాలు వాళ్లు ఈ చేపలు పట్టడం, వండటాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. ‘12 ఏళ్లుగా ఇదే మా పని. కుటుంబాలతో, స్నేహితులతో ఇక్కడకు వస్తుంటారు. రోజంతా పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. గేట్లు తెరిచినపుడు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు నచ్చిన చేపలు తెచ్చి ఇస్తారు. వాటిని రుచిగా, వారు మెచ్చే తీరులో వండి ఇస్తుంటాము. చాలామంది వేపుడు, పులుసు ఎక్కువగా అడుగుతారు’ అంటోంది చేపల్ని రుచిగా వండి వార్చే లక్ష్మి.

- జె. జ్యోతి, ఈనాడు జర్నలిజం స్కూల్‌


40 ఏళ్లుగా పాక ఇడ్లీ!

విజయవాడ పేరుచెబితే ఉలవచారు బిర్యానీ, నోరూరించే పచ్చళ్లు, పునుగు బజ్జీలే గుర్తుకొస్తాయి. ఇప్పుడా జాబితాలోకి పాక ఇడ్లీ కూడా చేరిందండోయ్‌! నగరానికి వచ్చే పర్యాటకులైనా, ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులైనా, కాలేజీ కుర్రకారైనా ఈ స్పెషల్‌ ఇడ్లీని ఆస్వాదించకుండా వెళ్లలేరు..
చల్లటి పాక. లోపలికి అడుగు పెట్టీ పెట్టగానే ఘుమఘుమలాడే నెయ్యి వాసన. అప్పుడే పొయ్యి మీది నుంచి దించిన వేడివేడి ఇడ్లీ. నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది. దానికి తోడు కారప్పొడి, అల్లం, పల్లీలతో చేసిన చట్నీ, కాసింత నెయ్యి. ఇదే ఇక్కడి మెనూ. ఈ హోటల్‌లో మరో వంటకం కనిపించదు. మేడసాని మల్లికార్జునరావు, చుక్కమాంబ దంపతులు 40 ఏళ్ల కిందట పూరిపాకలో మొదలుపెట్టిన ఈ హోటల్‌ ఇప్పటికీ కిటకిటలాడుతూ కనిపిస్తోంది. వారాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ సందడి ఉంటుంది. నగరం ఆధునికత వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లోనూ అదే పాకలో దీనిని నిర్వహిస్తున్నారు. వాళ్ల తర్వాత వారి కుమారుడు కృష్ణప్రసాద్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. ‘ఇక్కడ ఎలాంటి హంగూ, ఆర్భాటాలు ఉండవు. నాపరాళ్లతో చేసిన బల్లలు, మట్టి కుండల్లో నీళ్లు ఉంటాయి. ఇదే మా ప్రత్యేకత. ఎవరికైనా సొంతూరులో ఉన్న అనుభూతి కలిగిస్తాయి. అందుకే ఇన్నేళ్లయినా ఎలాంటి మార్పులు చేయకుండా ఇలాగే ఉంచాం. ఏసీ గదుల్లో తినడం బోరు కొట్టిన వాళ్లు సాయంకాలం కుటుంబాలతో ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు’ అని అంటున్నారు కష్ణప్రసాద్‌. 

   - భవాని మోటకోడూరు, విజయవాడ


రామయ్య దగ్గర... సలీం చాయ్‌!

భద్రాచలం వెళ్లి రామయ్యని దర్మించుకోవాలనుకుంటున్నారా? అయితే వస్తూ, వస్తూ సలీం చాయ్‌ని కూడా ఓసారి రుచి చూసి రండి. 42 ఏళ్లుగా రామయ్య భక్తులేేకాదు.. ఎంతోమంది సెలబ్రిటీలూ ఇష్టపడిన సలీం చాయ్‌ గొప్పదనం ఏంటో తెలుసుకుందాం రండి... భద్రాచలానికి చెందిన సలీంటీ దుకాణం ఉదయం 7 గంటల నుంచీ సాయంత్రం 7 వరకూ రద్దీగానే ఉంటుంది. అదంతా అతని చాయ్‌ రుచి మహిమ వల్లే. 2008 వరకు సలీం తాతయ్య అమానుల్లా ఈ దుకాణాన్ని నడిపేవారు. ఆయన చనిపోయాక దీన్ని ఆయన మనవడు సలీం నడిపిస్తున్నారు. ‘చిన్నప్పట్నుంచీ తాత దగ్గర పనిచేస్తూ ఈ చాయ్‌ తయారీ నేర్చుకున్నా. సీజన్‌లో రోజుకు రెండువేల చాయ్‌లు అమ్ముడుపోతుంటాయి. రైతుల నుంచి సేకరించిన చిక్కని పాలని ఈ టీకి వాడుతుంటాం’... అంటూ ఈ టీ రుచి వెనుక రహస్యాన్ని వెల్లడించారు సలీం. గ్యాస్‌, టీపొడి ధరలు పెరిగినా రూ.10కే ఈ టీని అందిస్తున్నారాయన. గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, హీరో సాయికుమార్‌, ప్రొఫెసర్‌ కోదండరాం వంటివారు ఇష్టపడిన చాయ్‌ ఇది.  ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సలీం చాయ్‌కు చక్కని ఆదరణ ఉంది. ఈ చాయ్‌ రుచి చూసి ‘చాలామంది మేం షాప్‌ పెడతాం మా దగ్గర పనిచేయ్‌’ అని ఎన్నో ఆఫర్లు ఇచ్చినా అన్నింటినీ చిరునవ్వుతోనే తిరస్కరిస్తుంటాడు సలీం.

- భూపతి సత్యనారాయణ, భద్రాచలం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని